కర్మజీవికి కైమోడ్పు

నేటి ప్రజాస్వామ్య పాలనలో ప్రతి పనికి, ప్రతి పదవికి భారీగా వెలకడుతున్న పాలనా వ్యవస్థను చూస్తూంటే నాటి ఏకస్వామ్య పాలనలో ప్రజాస్వామ్య పాలనా

Update: 2024-08-22 00:30 GMT

నేటి ప్రజాస్వామ్య పాలనలో ప్రతి పనికి, ప్రతి పదవికి భారీగా వెలకడుతున్న పాలనా వ్యవస్థను చూస్తూంటే నాటి ఏకస్వామ్య పాలనలో ప్రజాస్వామ్య పాలనా శుచితో, సంఘ సంస్కరణ రుచితో సుమారు అర్ధ శతాబ్ది కాలం పాటు సాగిన కొత్వాలు వెంకటరామరెడ్డి నిస్వార్థ సేవలను పరిశీలిస్తే... ఒక పోలీసు అధికారి తన హోదాతో బీద జనాభివృద్దికై ఎంత మేరకు సేవ చేయవచ్చునో తెలుపడానికి మంచి ఉదాహరణగా, నిలువెత్తు సాక్ష్యంగా కనబడతారు.

తన ఉద్యోగం పట్ల కర్తవ్య నిష్ట ప్రభుత్వం పట్ల విధేయత, ప్రజల పట్ల అనురక్తి, అంతరంగంలో దేశభక్తి, సామాజిక సేవానురక్తి మేళవించిన తెలంగాణ వైతాళికుడు రాజాబహద్దుర్‌ పాశం వేంకటరామరెడ్డి. ఆయన నేడు మన ముందు లేకున్నప్పటికీ, నేటికీ అవిరళమైన సేవలందిస్తున్న వారిచే స్థాపితమైన పలు విద్యాసంస్థలు వారి అజరామరమైన కీర్తికి ప్రతీకలుగా నిలిచాయి. నేడు ఆయన జయం తి దినం. స్ఫూర్తిదాయకమైన సంఘ సేవకుడుగా తదుపరి తరాలకు మార్గదర్శకుడుగా నిలిచిన ఆ కర్మ జీవికి కైమోడ్పు.

నేటి వనపర్తి జిల్లా రాయణిపేటలో 1869లో జన్మించిన ఆయన అనతికాలంలోనే అనాథ గా మారాడు. బంధు మిత్రుల సహకారంతో విద్యాబుద్ధులు నెరపి, నాటి హైదరాబాదు రాష్ట్ర పోలీసు శాఖలో సబ్-ఇన్‌స్పెక్టర్ హోదాలో చేరినారు. వివిధ ప్రాంతాల్లో వివిధ హోదాలతో తన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. వివిధ ప్రాంతాలు, భాషలు, సంస్కృతులకు నిలయమైన హైదరాబాద్‌ రాష్ట్రంలోని మిశ్రమ జీవన విధానంలో ఇమిడిపోగల కలిమిడిని అలవరచుకొని అన్ని సంస్కృతులకు ఆమోదయోగ్యుడై ప్రజల ప్రియ తత్వాన్ని గెలుచుకొని ఇటు ప్రజలకు, అటు పాలకులకు విశ్వాస పాత్రుడైనాడు. ఆయన పనిచేసిన ప్రతిచోట పరిశోధన క్రమంలో కలుసుకున్న ప్రతి వ్యక్తి అపరాధియైనా, సాక్షియైనా వార్తాహరుదైనా, ఇతరులెవరైననూ, ఆ చట్టపరమైన సంప్రదింపుల తదుపరి వ్యక్తిగత కోణంలో చర్చించేవారు. వారి కుటుంబ ఇబ్బందులు, సాధక బాధకాల చర్చల్లోకి వెళ్లి వారి భావావేశాలను పరిశీలించి మానవీయ దృక్పథంతో అర్థం చేసుకొనేవారు.

నీతి నిజాయితీలకు దర్పణం

ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ మానవీయ పోలీసుగా ప్రజల మన్ననకు పాత్రుడై పదోన్నతిపై హైదరాబాద్ నగర పోలీసు శాఖలో సహాయ కొత్వాలుగా చేరగానే తమదైన శైలిలో పోలీసు సిబ్బంది సమస్యలను పరిష్కరించి, సంస్కరణ చర్యలు చేపట్టారు. శాస్త్ర సాంకేతిక రంగాలు, చట్టం అమలు చేసే విధానాలు, పరిశోధనలో పాటించవలసిన మెళకువలు, అన్నింటినీ మించి విధి నిర్వహణలో నీతి నిజాయితీలను పాటించవలసిన ఆవశ్యకతలను తెలియపరచారు. వాటన్నింటిని పాటించగల చిత్తశుద్ధికి స్ఫూర్తిని కలిగించారు. తానూ అలాంటి విలువలను పాటిస్తూ అన్నపానీయాలపై అంతగా ఆలోచించకుండా అహర్నిశలు పనిలో నిమగ్నులై ఉండటం వలన తమ సిబ్బందికి మార్గదర్శకులైనారు. వారి కార్యదక్షతకు ముగ్దులైపోయిన నాటి హైదరాబాద్ నగర కొత్వాల్ ఇమాదు జంగు బహద్దరు తమ కొత్వాలీ నివేదికలో అరుదైన ప్రశంస చేయడం గమనార్హం. ఈయన సేవలు, కృషి వల్ల కొత్వాలీ కచ్చేరీలో సంస్కరణలు సాధ్యమయ్యాయంటూ ఆ నివేదికలో ప్రశంసించారు.

నగర కొత్వాలుగా తెలుగువాడు!

ఇమాదు జంగు అకాల మరణానంతరం, వృత్తిపరమైన శద్ధాసక్తులకు గుర్తింపుగా, ఏడవ నిజాం ప్రభువు వేంకటరామరెడ్డిని నగర కొత్వాలుగా నియమించినారు. ఆ కాలంలో కొత్వాలు పదవి ప్రధానమంత్రి తదుపరి హోదాగా పరిగణింపబడేది. అది వారి ఉద్యోగ చరిత్రలో శిఖర న్థానంగా చెప్పుకోవచ్చు. అంతటి శక్తివంతమైన హోదాగల గొప్ప ఉద్యోగాన్ని తన బుద్ధికుశలత, కఠోర పరిశ్రమ ద్వారా మాత్రమే పొందగలిగినారు. వివిధ సామాజిక సంఘాలలో, పాలకుల సన్నిధిలో మంచి పలుకుబడిని సంపాదించుకున్నారు. నగర కొత్వాలు ఆధీనంలో వివిధ హోదాల సిబ్బంది సుమారు 3000 వరకు పనిచేసేవారు. ఆయా శాఖల సిబ్బంది సమర్ధతను ఆధునీకరించి సమాచార సేకరణ విభాగాన్ని పటిష్టపరిచినారు.

అన్ని కులాల పిల్లలకు హాస్టళ్లు

గ్రామీణ ప్రాంతంలో రైతులు అనుభవిస్తున్న ఇక్కట్లు, ఆర్థిక భారంతో తమ పిల్లలకు విద్యా సదుపాయాలు కరువై గ్రామాలలోనే మగ్గవలసిన దీనపరిస్థితుల గురించి నాటి వనపర్తి మహారాజు రాజా రామేశ్వరరావు సమక్షంలో ఇతర సంస్థానాల మహారాజులు, పాలకులు, భాగ్యవంతులను సంప్రదించి హైదరాబాద్ నగరంలో చదువుకుంటున్న రైతుల పిల్లలకు ఒక ఆవాస సదుపాయం ఏర్పర్చడానికి సహాయ సహకారాల కోసం కొత్వాల్ వెంకట్రామిరెడ్డి అభ్యర్థించారు. అందరూ దీనికి స్పందించి 1918లోనే రూ. 80,000లు ఆర్థిక సహాయం అందించారు. దీనిని జాంబాగులోని కిరాయి ఇంట్లో రెడ్డి బోర్డింగును రాజామురళీధర్‌చే ఆవిష్కరించారు. ఇదే తర్వాత రెడ్డి హాస్టలుగా పేరుకెక్కింది. తొలి సంవత్సరంలో 54 మంది విద్యార్థులు చేరారు. తర్వాత నాయుళ్లు, వెలమ, కమ్మ మొదలియార్‌ పిళ్లై, ఇతర కులముల వారికి కూడా వీరే వసతిని కల్పించారు.

49 ఏళ్ల సుదీర్ఘ సేవ..

సమర్థ పోలీసు పాలకుడుగా, సంఘ సంస్కర్తగా, ప్రాచుర్యం పొందిన పాశం వెంకటరామరెడ్డిని ఏడవ నిజాం ప్రభువు “రాజాబహద్దుర్” అను బిరుదుతో సత్కరించారు. అలాగే బ్రిటీషు ఇండియా రాజ్యపాలకులైన కింగ్‌ జార్జి-5 వీరిని “ఆర్డర్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఎంపైర్‌” (ఓ.బి.ఇ.) అనే ప్రతిష్టాత్మకమైన పతక ప్రదానంతో సత్కరించారు. పదవీ విరమణ దశకు చేరుకున్నప్పటికీ కొత్వాలు సేవా కాలాన్ని పలుమార్లు పొడిగించారు. చివరకు సుమారు 49 సంవత్సరాల సేవా కాలాన్ని విరమించుకొనడానికి అనుమతించారు. అంతటితో ఆగకుండా ఆయనను “సర్ఫేఖాస్‌” అధికారిగా నియమించారు. తన పదవి విరమణతో బీదసాదలు ఒక ఆత్మీయునికి దూరమైనట్లుగా తలపోశారు. వారి అభిమానానికి తీపి గుర్తును చిరస్థాయి నిలుపుకోవడానికి నాటి ప్రజానీకం చందాలు వేసుకుని నగర నడిబొడ్డున నారాయణ గూడ కూడలిలో కొత్వాల్ గారి నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరింపజేసుకున్నారు.

(నేడు కొత్వాల్ వెంకట్రామిరెడ్డి జయంతి)

- పెద్దిరెడ్డి తిరుపతిరెడ్డి

94400 11170

Tags:    

Similar News