జోడేఘాట్ ఉద్యమ వ్యూహకర్త కుమ్రం సూరు

remembering komuram sooru

Update: 2023-03-24 18:30 GMT

నిజాం నిరంకుశ పాలనలో 1938 - 1940ల మధ్య జరిగిన జోడేఘాట్ సాయుధ పోరాటం దేశ చరిత్రలోనే అరుదైనది. నిజాం పాలకులకు వ్యతిరేకంగా ఆదివాసీ గిరిజనులను కూడగట్టి గెరిల్లా సైన్యంతో పోరాడిన తెలంగాణ తొలి గిరిజన పోరాట యోధుడు కుమ్రం భీంకు ప్రధాన అనుచరుడిగా, పోరాట వ్యూహకర్తగా పనిచేసిన కుమ్రం సూరు అజరామరుడు. ఆదివాసీ గూడేల్లో అరాచకాలు సృష్టించే నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గెరిల్లా సైన్యం ఏర్పాటులో కుమ్రం భీంకు హవల్దార్ పాత్ర పోషించారు. ఆదివాసీ యువ సైనికులను తీర్చిదిద్దడానికి తగిన సూచనలు చేస్తూ వారిని సమీకరించారు. వెదురుతో విల్లంబులు, బాణాలు తయారుచేయడం, ఉచ్చులు బిగించడం మాత్రమే కాదు, భీమ్ దగ్గర గెరిల్లా యుద్ధతంత్రాన్ని నేర్చుకుని పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. మరోవైపు కుమ్రంభీంకు తన అక్షరజ్ఞానం తో రాజకీయ మెళకువలను కుమ్రం సూరు దగ్గరుండి నేర్పించారు.

కుమ్రం భీం గిరిజన గోండు తెగకు చెందినవాడైతే, కుమ్రం సూరుది కొలాం తెగ.. ఐనా వీరిద్దరి సాహచర్యం జోడేఘాట్ పోరాటాన్ని మరింత విస్తృతం చేసింది. ఆదివాసీలందరినీ కూడగట్టింది. ఆదిలాబాద్ జిల్లాలోని (ప్రస్తుతం అసిఫాబాద్) కెరిమెరి మండలం జోడేఘాట్‌లో కుమరం చిన్నూ, మారుబాయి దంపతులకు 1918 మార్చి 25వ కుమ్రం సూరు జన్మించాడు. నిజాం ప్రభుత్వం తరపున పట్వారీలు, చౌకీదారులు పన్నులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ వారిపై దాడులు చేయాలని భీమ్ ఆజ్ఞాపించినప్పుడు దానికి తగిన విధంగా సూరు వ్యూహరచన చేసి ప్రతి దాడులకు నాయకత్వం వహించేవాడు. జోడేఘాట్ చుట్టపక్కల 12 గ్రామాల్లో బోడేఘాట్, పట్నాపూర్, టోకున్నావాడ, లైన్ పటల్, కోశగూడ, చల్బరిడి, భీమన్ గొంది, కల్లేగావ్, అంకుశాపూర్, నర్సాపూర్, శివగూడల భూములకు పట్టాలివ్వాలని ఆ గ్రామాలకు స్వయం పాలన కావాలని తీర్మానించారు.

నిజాం ప్రభుత్వానికి తన డిమాండ్లను తెలుపడానికి కుమ్రం భీం హైదరాబాద్ వెళ్ళినప్పుడు సూరు ఆయనతోనే ఉన్నారు. నిజాం సర్కార్ వీరిద్దరికి కలిసే అవకాశం ఇవ్వకపోవడంతో కుమరం భీమ్ సూరులిద్దరు మనస్తాపం చెంది జోడేఘాట్ తిరిగి వచ్చారు. నిజాం సర్కార్‌పై ఆవేదనతో కసితో రగులుతున్న వీరిద్దరూ గోండు, కోలాం యువకుల్ని కూడగట్టి ప్రతిభ గల సైనికులుగా శిక్షితులను చేసి జల్ , జంగల్, జమీన్ గెరిల్లా యుద్ధ తంత్రం వంటబట్టించి జోడేఘాట్ కేంద్రంగా యుద్ధానికి సమాయత్తం చేశారు. జోడేఘాట్ గుట్టల్లో కుమరం భీమ్ సైన్యంపై 1940 అక్టోబర్ నిజాం సైనికులు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన భీమ్ వీరమరణం పొందాడు. ఆ యుద్ధభూమిలోనే నూరు కుడిచేయి, కుడి కాలుకు, నడుముకు తూటాలు తగిలి గాయాలయ్యాయి. ఆ సమయంలో కొన్నాళ్ళు అజ్ఞాత జీవితం గడపాల్సి వచ్చింది సూరు. తర్వాత సముతుల గుండం, యాపలతాటి, శేకర్ గొంది గ్రామాల్లో తల దాచుకున్నట్లు నూరు బంధువుల ద్వారా తెలుస్తోంది. 1910లో కుమ్రం భీం నాయకత్వంలో నడిచిన గెరిల్లా పోరాటాన్ని అందులోని ఒడిదొడుకులను బాహ్య ప్రపంచానికి తెలిపినది ఆయనే. మనం ఈ రోజు చూసే" కుమ్రం భీం' ఛాయా చిత్రం నూరు చెప్పిన రూపురేఖల ఆధారంగా రూపొందించినది.

నాగరిక సమాజానికి ఆమడ దూరంలో ఉంటూ దోపిడీ పీడనలను ఎదుర్కొంటున్న కొలాం తెగ నుంచి ఎదిగి వచ్చిన కుమ్రం సూరు ఉవ్వెత్తున లేచిన గిరిజన ఉద్యమానికి గొప్ప మార్గదర్శకులు. జోడేఘాట్ పోరాట స్పూర్తికి చిరునామాగా మిగిలిన కుమ్రం సూరు శేకన్ గొంది గ్రామంలో 1997, ఆగస్టు 10న కన్నుమూశారు. ప్రతి ఏటా గోండు, కొలాం, తోటి తెగల ఆదివాసులు శీకన్ గొందిలో వున్న నూరు సమాధి వద్ద నివాళులర్పించడం వారి సంప్రదాయం. తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసులు కోరుకున్న స్వయంపాలన సుదూర స్వప్నం గా మిగిలింది. ఏదేమైనా జోడేఘాట్ పోరాటంలో కుమరం భీమ్ కు అండగా నిలిచిన కుమరం సూరు పాత్ర అణగారిన సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుంది !

( మార్చి 25 న కుమ్రం సూరు జయంతి )

గుమ్మడి లక్ష్మీనారాయణ

9491318409

Tags:    

Similar News