జాషువా .. సాహితీ ధార

మహాకవి గుర్రం జాషువా కవిత్వం ఓ ప్రవాహం. ఒకచోట నిర్మల ధారలా ఉంటుంది.. అంతలోనే అదో ఉప్పెనన తలపిస్తుంది. జలపాతంలా

Update: 2024-09-28 00:30 GMT

మహాకవి గుర్రం జాషువా కవిత్వం ఓ ప్రవాహం. ఒకచోట నిర్మల ధారలా ఉంటుంది.. అంతలోనే అదో ఉప్పెనన తలపిస్తుంది. జలపాతంలా దుముకు తుంది. మరోచోట పరవళ్లు తొక్కుతుంది. సముద్రమంత లోతుగా కూడా ఉంటుంది. అన్ని సందర్భాల్లోనూ అనుభవ సారం, ఆవేదన, ఆక్రోశం, అలజడి కనిపిస్తుంది. సున్నితంగానూ కటువుగానూ ఉంటూ, రెండంచుల ఖడ్గంగా కనిపిస్తుంది. గంభీరంగాను ఉంటుంది. ఏది రాసినా ఆయన కలం పాఠకుల సాహిత్య దాహార్తిని తీరుస్తుంది. ప్రజలను నిత్య జాగృతం చేసింది. జాషువా సున్నిత మనస్కుడు. ఆ సునితత్వం ఆయన సాహిత్యంలో ప్రతిబింబిస్తుంది. కవిత్వంలో ఆర్తి కనిపిస్తుంది. అది నిర్మల ధారలా సాగుతుంది. గజిగాడి గూడును చూసినా, శిశువును చూసినా, సాలీడును చూసినా ఆయన స్పందిస్తాడు. పేదలు అభాగ్యులు బలహీనులు మూగ జీవుల పట్ల ఆయన గుండె కరిగిపోతుంది.

వైభవంబునఁ బోలు దేవతల ఱేఁడు.. లేఁడురా గిజిగాడ! మొనగాఁడ వోయి’ అంటూ ఇంటి ముందు గిజిగాడు పక్షిని, దాని పనితనాన్ని చూసి అక్షరీకరించాడు. తల్లికి పిల్లలపై ఉన్న ప్రేమ గురించి ఆర్ద్రతతో గొప్ప సాహిత్యం సృష్టించారు. అమృతమ్ము విషమను వ్యత్యాస మెరుగ కాస్వాదింపచను వెర్రిబాగులాడు.. అంటూ శిశువును వర్ణించాడు. శిశువును ఇంతకంటే అద్భుతంగా వర్ణించిన మరో కవి లేడేమో? ‘బొటన వ్రేల ముల్లోకములను చూచి లోలోన ఆనందపు నోరులేని యోగి..’ అంటూ పసికందును యోగిగా అభివర్ణించాడు. అలాగే కరుణ రసం నిండిన కన్నీటి కావ్యం గబ్బిలం. ఇందులోని కథానాయకుడు దీనుడు. జాషువా మాటల్లో ‘వాని నుద్ధరించు భగవంతుడే లేదు.. మనుజెడెట్లు వాని గనికరించు..’ తనకు కనిపించి గబ్బిలానికి బాధను చెప్పకొంటాడు. దానంతటినీ ఆ ఈశ్వరుడికి విన్నవించమని వేడుకుంటాడు. అందులో ఆర్ద్రత ఉంటుంది. కథానాయకుడి వేదనను వర్ణించిన తీరు కూడా పాఠకుల హృదయాలను తాకుతుంది. ‘నా కవితా వధూటి వదనంబు నెగాదిగజూచి.. మీదే కులమన్న, ప్రశ్న వెలయించి- చివాలున లేచి పోవుచో బాకున గ్రుమ్మినట్లగును ’.. ఎంతటి వేదనను అనుభవించి ఈ పద్యాన్ని రాశాడో కదా..! ఆ వేదనే .. జాషువాను అగ్రగణ్య కవుల్లో ఒకడిగా నిలిపింది. ‘చిన్నప్పటినుండియు నా కన్ను పరుల కష్టములను కని యోరువలే దన్నా!’ సుమనస్కుడు కాబట్టే తన గురించి ఇలా చెప్పకొన్నాడు.

వివక్షకు గురైన జనం పక్షం నిలిచి

ఆయన కవిత్వం ఓ ఉప్పెన కూడా..! ఆయన తన కలం అనే ఆయుధంతో వర్ణ వ్యవస్థను, మతాంధకారాన్ని, సాంఘిక దురాచారాలను ఎత్తి చూపారు. ముప్పది మూడుకోట్ల దేవతలెగవడ్డ దేశమున భాగ్య విహీన క్షుత్తులారునే.. అంటూ ఆవేశాన్ని ప్రకటించారు. మరో చోట ‘గవ్వకు సాటిరాని పలుగాకుల మూకలసూయచే నన్నేవ్విది దూరినన్ ననువరించిన శారద లేచిపోవునే..’ అని ప్రశ్నిస్తాడు. ఎన్నో ఏళ్లుగా తాను చవిచూసిన వివక్ష, తనపై వచ్చిన విమర్శలను ధీటుగా ఇలా ఆయన సమాధానమిచ్చారు. తనలాగే ‘నాలుగు పడగల హైందవ నాగరాజు’ అనే వివక్షకు గురైన లక్షలాది మంది పక్షాన నిలబడ్డాడు. తన కలంతో ‘రవ్వలు రాల్చెదన్ గరగరల్ సవరించెద నాంధ్ర వాణికిన్..’ ఎలుగెత్తి చాటాడు. ‘కొత్తలోకం’ కోసం తపన చెందాడు. జాషువా తన భావాలను ఎంతో తీవ్రంగా వ్యక్తం చేశారు. అది అందరినీ స్పందింపజేసింది. ఆయన కవిత్వంపైన ఆనాటి ఉద్యమాల ప్రభావం కనిపిస్తుంది. నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు, తిరుగులేదు విశ్వ నరుడను నేను.. అంటూ తన గురించి గర్వంగా చెప్పకొన్నాడు జాషువా.

నిర్మల ధార, ఎదిరించే ఉప్పెన

జాషువా సాహిత్యం సముద్రమంత లోతుగాను గంభీరంగానూ ఉంటుంది.. ఆయన రాసిన శ్మశాన వాటిక పద్యాలలో అది కనిపిస్తుంది. ఎన్నో యేండ్లు గతించిపోయినవి గానీ,యీ శ్మశానస్ధలిన్ . గన్నుల్ మోడ్చిన మందభాగ్యుడొకఁడైనన్ లేచిరాఁ,డక్క టా!.., స్మశానం అంత గంభీరం ఈ పద్యాలలో ఉంది. ఇట నస్పృశ్యత సంచరించుటకు దావేలేదు.. ఇది ఎంతో లోతైన భావన. నాకు ఇద్దరు గురువులు. పేదరికం, కుల మత భేదం. ఒకటి నాకు సహనాన్ని నేర్పితే రెండోది నాలో ఎదిరించే శక్తిని పెంచింది అంటారు జాషువా. ఆయన సహనం నిర్మల ధారలా కవిత్వంలో ప్రవహిస్తుంది. ఎదరించే శక్తి కవిత్వం రూపంలో ఉప్పెనలా కనిపిస్తుంది. కవిత్వాల్లో ఇంతటి వైవిధ్యం చూపించి ఎన్నో బిరుదులు సత్కారాలు అందుకున్నారు. 75 ఏళ్ల వయసులో 1971 జూలై 24 గుంటూరులో మరణించారాయన...

రాజు మరణించే నొక తార రాలిపోయే

కవియు మరణించే నొక తార గగనమెక్కె

రాజు జీవించే రాతి విగ్రహములందు

సుకవి జీవించే ప్రజల నాల్కలయందు...

గుర్రం జాషువా సుకవి.... తన కవిత్వంతో ఆయన ప్రజల నాల్కల యందు సజీవంగానే ఉన్నారు.

(నేడు మహాకవి గుర్రం జాషువా జయంతి)

శిఖా స్వాతి,

తెలుగు రీసెర్చ్ స్కాలర్

77948 64455

Tags:    

Similar News