కోటానుకోట్ల నరులొక/ మేటి జగన్మాతసుతులు/ మిత్రులని మందిం/బాటింపు మీసువార్తన్/ జాటింపుము జీవితంబు సార్థక్యమగున్ .. అని ( ముసాఫరులు గ్రంథంలో) రాశారు జాషువా.
జాషువా మనసులో సామాజిక బాధ్యత ఎక్కువ. ఆ బాధ్యత తన రచనల్లో ఎక్కువ శాతం కనిపిస్తుంది. సమాజం ఎలా ఉండాలి? కానీ తాను నివసిస్తున్న సమాజం ఎలా ఉంది. ఆ సమాజం ఎలా ఏర్పడుతుంది. అనే ప్రశ్నలు జాషువా మనసులో ఉదయించాయి. ఒక రచయితగా తన స్వప్న సందేశాన్ని తన కావ్యాల ద్వారా జనాలకు అందించారు. తాను కోరుకునే న్యాయం కోసం సాంఘిక, ఆర్థిక, రాజకీయ కోణాలను విమర్శించారు.. ప్రతి సంఘ సేవకుడికి సామాజిక స్వప్నం కలగడం సహజం. సామాజికవేత్తలు కూడా అదే కలలు కంటూ ఉంటారు. సామ్యవాద సమాజం కోసం ఎందరో మహనీయులు పోరాటాలు చేయడం మన చరిత్రలో జరిగిన నిజాలు మనందరికీ తెలుసు.. రచయితలు తమ కావ్యాలలో సామాజిక స్వప్నాన్ని కాంక్షిస్తూ, వసుదైక కుటుంబాన్ని సృష్టించుకున్నారు. భిన్నమైన కాలాలలో కుల వ్యవస్థలో మార్పులు చేర్పులు చెందుతూ నేటికీ నడుస్తూనే ఉంది సామాజిక రుగ్మత. వేమన కూడా వసుదైక కుటుంబాన్ని కలగన్నారు. ఒక ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం జరగాలని దీనికి, అడ్డంకిగా ఉన్న కుల, మత, వర్గ సంఘంలో జరిగే అనేక సంఘ వ్యతిరేక పరిణామాలన్నీ పోవాలని తన పద్యాలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వర్ణించారు.
కులమతాలను తొలగించి…
ఆధునిక కాలంలో గురజాడ కూడా వసుదైక కుటుంబం కోసమే తన సాహిత్యంలో సృజించాడు. "ఎల్ల లోకము లొక్కయిల్లై/ వర్ణబేధము లెల్ల కల్లై/ వేల నెరుగుని ప్రేమ బంధము/ వేడుకల కురియు../ అన్నదమ్ముల వలెను జాతులు/ మతములన్ని మెలగవలెనోయ్.."
గురజాడ ఈ రకమైన సమాజం ఏర్పడాలని కలలు కంటూ రాశారు. తనను కలలు కన్నా సమాజం ఏర్పడడానికి అడ్డంకులుగా కుల మత జాడ్యాలను మౌడ్యాలను నిశితంగా విమర్శించారు. లోకమంతా ఒకే ఇల్లుగా ఉండాలని. వర్ణబేధాలు పోయి ప్రేమ బంధం కావాలని. అన్నదమ్ముల మాదిరి అందరూ ఉండాలని ఆయన తన కవిత్వం ద్వారా చాటిచెప్పారు.. ఈ విధంగానే గుర్రం జాషువా తాను కూడా సామాజిక స్వప్నాన్ని ప్రకటించారు తన స్వప్నం కూడా కులమత పీడితాలు లేకుండా వసుదైక కుటుంబం కావాలని అలాంటి సమాజం ఏర్పడాలని ఆర్థిక, సాంఘిక ,రాజకీయ సాంస్కృతిక, అసమానతలు తొలగాలని, తన కవిత్వాన్ని ఆయుధంగా ఉపయోగించుకొని సమాజంపై విరుచుకు పడ్డారు.
కులమతాలు గీసుకున్న గీతాలు జొచ్చి/ పంజరాన కట్టువడను నేను/ నిఖిల లోకమెట్లు/నిర్ణయించిన నాకు/ తిరుగులేదు విశ్వనరుడను నేను" అని తనను తాను ప్రకటించుకున్నారు జాషువా. సమాజములో స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వంలతో కూడినటువంటి సమాజం కావాలన్నది జాషువా స్వప్నం. కులమతాలను తొలగించి జీవించాలని. తానొక విశ్వనారుడిగా మెలగాలని తన అభిమతాన్ని తెలియజేశాడు. ప్రపంచ సోదరుడిగా నిలబడి వెలగాలని జాషువా గారి ఆశయం.. జాషువా మీద గాంధీ అంబేద్కర్‌ల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. జాషువా భావాలు అంబేద్కర్‌కు సమీపంగా ఉంటాయి. కుల వ్యవస్థపై తిరుగుబాటుతనం కనిపిస్తుంది. కుల వ్యవస్థపై ఆయన రాసిన ఆణిముత్యం లాంటి పద్యం చూస్తే బాధనిపిస్తుంది.
వసుధైక కుటుంబం కావాలని..
కులములేని నేను కొడుకుల బుట్టించి/ యీ యఖాతమందె త్రోయవలెనె/ భార్యయేల బుట్టు బానిస కానివాడు/ జరుప సాగె బ్రహ్మచర్య దీక్ష.." అని జాషువా చెప్పారు. పెళ్లి చేసుకొని పిల్లలను కనీ, వాళ్లను అగ్రవర్ణ భూస్వాములకు బానిసలుగా పంపి ఆత్మగౌరవం, సామాజిక మర్యాద లేకుండా బతకనీయడం ఎందుకని. అతను పెళ్లి చేసుకోవడం మానుకున్నాడని జాషువా తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఆ కాలం దళితులు, అగ్రవర్ణాల వారు జీతగాళ్లుగా ఇళ్లలో పెట్టుకొని, పని పాటలు చేయించుకునే వారని. స్వాతంత్ర్యం లేకుండా చేసేవారని. జాషువా గారి భావన. పుట్టు బానిసలాగా వర్ణించడం ఆయనలోని బాధను వ్యక్తపరుస్తుంది పై పద్యం..
జాషువా స్వప్నం ఒక నాగరికత. సమాజంలో ఆత్మగౌరవంగా బ్రతకాలని, గౌరవనీయమైన జీవితం కావాలని, తన స్వప్నంలో వాస్తవికత ఆధునికత, ఆవశ్యకత అనివార్యమని చెప్పారు. తాను కోరుకున్న సమాజం రావాలని, ఆయన గమ్యం నవ సమాజ నిర్మాణం, అంబేద్కర్ తత్వం, సమానత్వం, సౌభ్రాతృత్వం వసుధైక కుటుంబం కావాలని రచనల ద్వారా సందేశమిచ్చి సమాజ ఉద్దరణకు తన గళం, కలం ద్వారా కవిత్వాన్ని సృష్టించి లోకాభ్యుదయానికి పాటుపడిన మహనీయుడు. ఆయన కలలుగన్న స్వప్నం సాకారం కావాలి. ప్రతి రచయిత తన రచనల ద్వారా సమాజ అభివృద్ధికి పాటుపడి, నవ సమాజ స్థాపనలో తన ముద్రను నిర్మించి, లోక కళ్యాణానికి వసుదైక కుటుంబాన్ని యావత్ ప్రపంచానికి పరిచయం చేసి, జాషువా ఆశయాలను ఆయన కలలు కన్నా స్వప్నం నిజం చేయడానికి మన వంతు సహాయం చేద్దాం. మన రచనల ద్వారా సందేశాన్ని వినిపిద్దాం..
(నేడు గుర్రం జాషువా జయంతి)
కొప్పుల ప్రసాద్
తెలుగు ఉపన్యాసకులు,
98850 66235