ప్రజా పోరాటాలకు స్ఫూర్తి ఐలమ్మ

Remembering Chakali Ailamma on birth anniversary

Update: 2023-09-10 00:15 GMT

ణచివేత అధికమైనప్పుడు పోరాటం పురుడు పోసుకుంటుంది. దోపిడి, అన్యాయాలు అధికమైనప్పుడు ఎదురించడమే మార్గమంటూ ఆయుధం కావాలని తన జీవితాంతం బానిస బతుకుల విముక్తి కోసం కృషి చేసిన మహోన్నత మానవతామూర్తి చాకలి ఐలమ్మ. ఆమె పోరాటం అంతా అణగారిన వర్గాల బతుకులపై జరుగుతున్న దోపిడిపైనే ..భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తితో పాటు బాంచెన్ కాల్మొక్తా అనే బతుకులను మార్చడానికి తన జీవితాన్ని, నలుగురు పిల్లలను త్యాగం చేసి తను నమ్మిన సమాజం కోసం అండగా నిలబడిన చాకలి ఐలమ్మ జీవితం ఎప్పటికీ తెలంగాణ సమాజానికి ఆదర్శం.

చాకలి ఐలమ్మ అనగానే దొరల గుండెల్లో, గడీలు ఉలిక్కి పడే పేరు. వెట్టి చాకిరి, దోపిడిపై తొలిసారి దొరలను ఎదిరించడానికి ఆయుధమై నిలబడి ఆనాడే బలహీన వర్గాల వారికి భూ పంపిణీ జరిగేలా చేసిన ఆమె మహోన్నత పోరాటం.. ఆమె త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ దోపిడీ, అసమానతలపై ప్రస్తుతం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఆమె వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండలం క్రిష్ణాపురం గ్రామంలో ఓరుగంటి మల్లమ్మ, సాయిలుకు నాల్గో సంతానంగా చాకలి ఐలమ్మ జన్మించింది. ఈమెకు పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో ఐలమ్మ బాల్య వివాహం జరిగింది. వీరికి ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, ఆర్థికంగా వెనుకబడిన మధ్య కాలంలో విస్నూర్‌లో దేశ్ ముఖ్, రజాకార్ల అరాచకాలపై ఎదురు తిరిగి నిలిచింది.

తెలంగాణ రైతాంగంలో విప్లవం రగిల్చి..

గడీల్లో అగ్రకులాల స్త్రీలు, దొరసానులు కూడా ‘దొర’ల వలె ఉత్పత్తికులాల చేత వెట్టి చాకిరి చేయించుకునేవారు. వారిని దొర అని పిలువని ఉత్పత్తి. కులాల స్త్రీల మీద తమ భర్తలను ఉసిగొల్పి, దగ్గరుండి ఆఘాయిత్యం చేయించేవారు. మల్లంపల్లి భూస్వామి కొండలరావుకు పాలకుర్తిలో 40 ఎకరాల భూమి ఉండగా ఐలమ్మ కౌలుకు తీసుకుంది. అందులో నాలుగు ఎకరాలు సాగుచేసేవారు ఐలమ్మ. పాలకుర్తి పట్వారీ వీరమనేని శేషగిరిరావుకు ఐలమ్మ కుటుంబానికి విరోధం ఏర్పడింది. అప్పుడు సోమనర్సయ్య నాయకత్వంలో ఆంధ్రమహాసభ ఏర్పడింది. ఐలమ్మ ఆ సంఘంలో సభ్యురాలు. పాలకుర్తి పట్వారీ శేషగిరిరావు ఐలమ్మను కుటుంబంతో వచ్చి తన పొలంలో పనిచేయాలని ఒత్తిడి చేయడంతో పనిచేయడానికి నిరాకరించింది. ఆయన పప్పులుడకక ఐలమ్మ కుటుంబంపై కక్ష గట్టి విసునూర్ దేశముఖ్ రాపాక రాంచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు. కేసులో అగ్రనాయకులతో పాటు ఐలమ్మ కుటుంబాన్ని ఇరికించారు. అయినప్పటికీ కోర్టులో తీర్పు దేశముఖ్‌కు వ్యతిరేకంగా వచ్చింది. ఐలమ్మ కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తే చాకలి కులవృత్తే వారికి జీవనాధారం. అందుకే దేశముఖ్ పట్వారిని పిలిపించుకొని, ఐలమ్మ కౌలుకు తీసుకున్న భూమిని తన పేరున రాయించుకున్నాడు. భూమి తనదని, వండించిన ధాన్యం తన దేనని పంటను కోసుకురమ్మని వందమందిని దేశముఖ్ పంపాడు. కానీ ఈ భూమినాది. పండించిన పంటనాది. తీసుకెళ్లడానికి దొరెవ్వడు. నా ప్రాణం పోయాకే ఈ పంట, భూమి మీరు దక్కించుకోగలరు అంటూ మాటల్ని తూటాలుగా మల్చుకొని దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని రగిలించి పండిన ధాన్యాన్ని ఐలమ్మ, ఆంధ్రమహాసభ కార్యకర్తలు కలిసి ఐలమ్మ ఇంటికి చేర్చింది. కోర్టులో కొండా లక్ష్మణ్ బాపూజీ సహకారంతో ఐలమ్మకు అనుకూలంగా తీర్పువచ్చింది. రజాకార్ల ఉపసేనాధిపతి అయిన దేశముఖ్ రెండుసార్లు పరాజయం పాలయ్యాడు. దీంతో ఐలమ్మ ఇంటిని కూడా తగులబెట్టి ధనాన్ని, ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు. ఐలమ్మ కూతురు సోమనర్సమ్మపై అత్యాచారానికి పాల్పడ్డారు. కానీ ఐలమ్మ కుమారులు ముగ్గురు పాలకుర్తి పట్వారీ ఇంటిని కూల్చి అదే స్థలంలో మొక్కజొన్న పంటను పండించారు.

ఆమె స్ఫూర్తి పోరాటం కొనసాగించాలి!

అయితే ఈ పోరాటంలో ఐలమ్మ కూతురితో పాటు నలుగురు కొడుకులను కోల్పోయిన సమాజం కోసం ఐలమ్మ వెనుకడుగు వేయలేదు. ‘ఈ దొరగాడు ఇంతకంటే ఇంక నన్ను ఏవిధంగా నష్టపెట్టగలడు’ అని తనలో తాను ప్రశ్నించుకొన్నది. నీ దొరోడు ఏం చేస్తాడ్రా' అని మొక్కవోని ధైర్యంతో రోకలి బండ చేతబూని గూండాలను తరమికొట్టింది. కాలినడకన వెళ్లి దొరకు సవాలు విసిరింది. ఐలమ్మ భూపోరాటం విజయంతో పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడిచేసి ధాన్యాన్ని ప్రజలకు పంచారు. అలాగే 90 ఎకరాల దొర భూమిని కూడా పంచారు. ఐలమ్మ భూపోరాటంతో మొదలుకొని సాయుధ పోరాటం చివరి వరకు నాలుగు వేలమంది ఉత్పత్తి కులాల వారు అమరులయ్యారు. 10 లక్షల ఎకరాల భూమి పంపకం జరిగింది. ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన ఐలమ్మ సెప్టెంబర్ 10, 1985న అనారోగ్యంతో మరణించింది. ఆమె సమాజం కోసం చేసిన త్యాగం, కృషి, దోపిడిపై ప్రస్తుతము ఆమె స్ఫూర్తితో పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

(నేడు చాకలి ఐలమ్మ వర్ధంతి)

సంపత్ గడ్డం

78933 03516

Tags:    

Similar News