దేశ స్వాతంత్య్రం కోసం ఎంతోమంది త్యాగధనులు ఆంగ్లేయులతో పోరాడిన చరిత్ర గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. తెలుగు రాష్ట్రాలలో రాంజీ గోండ్, అల్లూరి సీతారామరాజు, కొమురం భీం పేర్లను పుస్తకంలో పాఠాలుగా విద్యార్థులు వింటుంటే, అడవితల్లి ఒడిలో సేద తీరుతున్న ఆదివాసీ సమాజం వారి వీరగాథల గురించి కథలు కథలుగా చెప్పుకుంటుంది. అలాంటి వారిలో బాబూరావు సెడ్మకి విశిష్ట నాయకుడు. మహారాష్ట్రలోని నాటి చంద్రాపూర్ జిల్లాలో 1833 మార్చి12న బాబూరావు సెడ్మకి జన్మించారు. ఆయన బాల్యం నుంచే అస్త్ర, శాస్త్ర విద్యలో నైపుణ్యం సాధించాడు. అనంతరం రాయ్‌పూర్ వెళ్లి ఐదవ తరగతి వరకు చదువుకొని తిరిగి సొంత ఊరికి చేరుకున్నారు. 18 ఏళ్ల వయస్సులో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రాజ్ కున్వార్‌తో వివాహం అనంతరం జమిందారీగా బాధ్యతలు తీసుకున్నారు. భారత భూమిని అంగుళం అంగుళం ఆక్రమించుకుంటున్న ఆంగ్లేయుల నుండి రాజ్య రక్షణకు ప్రతిజ్ఞ చేసి ఆదివాసీ గిరిజనులను, ముస్లింలను, మరాఠీలను ఏకం చేసి తన సైన్యంతో ఆంగ్లేయులపై అడవి ప్రాంతలో దాడులు జరిపారు.
నమ్మకద్రోహం కారణంగా
ఆ కాలంలో మధ్యప్రదేశ్, ఒరిస్సా, బల్లార్షా, చంద్రాపూర్, మాణిక్ ఘడ్, గడిచిరోలి, జగదల్పూర్, బిలాస్ పూర్, బీజాపూర్, దంతేవాడ, సుక్మాల నుండి ఇటు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం వరకు విస్తరించి ఉన్న అడవిలో అనేక గిరిజన తెగలు వారి వారి సామ్రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు. వారిలో చదువు లేనప్పటికీ పాలన విధానంలో కరువు కాటకాలు, ప్రకృతి విపత్తులను సంభవించినప్పుడు ఒకరికొకరు తోడుగా ఉండి, సమిష్టిగా జీవించి పోడు వ్యవసాయంతో సమృద్ధి పంటలు పండించేవారు. దీంతో గోండ్ సామ్రాజ్యాలపై, అడవులపై కన్నేసిన ఆంగ్లేయులు క్రమక్రమంగా ఆక్రమించుకోవడం, అడ్డు అనుకున్న ఆదివాసీలపై దాడులు చేయడం, నిర్బంధించడం, గిరిజనులు పండించిన ధాన్యాన్ని దౌర్జన్యంగా లాక్కొని గిడ్డంగులలో దాయటం సర్వసాధారణంగా మారింది. 1858లో బ్రిటిష్ కెప్టెన్ క్రికటన్, బ్రిటిష్ సైన్యాధిపతిగా నెక్స్ ఫియర్ సారధ్యంలో ఆధునిక ఆయుధాలతో రెండుసార్లు గోండులపై దాడి చేసినా.. సాంప్రదాయక బరిసెలు, బల్లెములు, బడితెలు, కత్తులతో ఉన్న సెడ్మకి సైన్యం చేతిలో బ్రిటిష్ సైన్యం ఓడిపోయి చంద్రాపూర్ వైపు పారిపోయి తలదాచుకున్నారు.
క్రికటన్, నెక్స్ ఫియార్‌లు సెడ్మకిని పట్టించిన వారికి కానుకగా జమీందారీగా నియమిస్తామని ప్రకటించడంతో, సెడ్మకి నమ్మిన వ్యక్తి కోవర్టుగా మారి సమాచారం అందించింది. ఆంగ్లేయులు సెడ్మకిని బంధించి నాటి గోండు రాజు కోట నేటి చంద్రాపూర్ జైలు ప్రాంతంలో నేటికి సజీవంగా ఉన్న వృక్షానికి అక్టోబర్ 21న సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఉరితీశారు. మూడు సార్లు ఉరి తీసినా సెడ్మకి మృతి చెందకపోవడంతో చిత్రహింసలకు గురి చేసి పొగాకు బట్టిలో కాల్చి దహనం చేశారు. ప్రతి ఏటా సెడ్మకి జయంతి, వర్ధంతిల సందర్భంగా ఆదివాసీ ప్రజలు చంద్రాపూర్ జైలు ప్రాంతానికి చేరుకొని ప్రకృతి ఒడిలో పురుడు పోసుకున్న ఆదివాసీ అగ్నిపుష్పాలకు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పిస్తారు.
(రేపు బాబూరావ్ సెడ్మకి వర్ధంతి)
అనిల్ భగత్
జర్నలిస్ట్,
9491743506