ఖాసీల వీరఖడ్గం.. తీరద్ సింగ్
ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసిన భారతీయులలో వెలుగు చూడనివారు చాలామంది ఉన్నారు. ఆ కోవలోకి చెందినవారే మేఘాలయకు చెందిన ఖాసీ తెగ
ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసిన భారతీయులలో వెలుగు చూడనివారు చాలామంది ఉన్నారు. ఆ కోవలోకి చెందినవారే మేఘాలయకు చెందిన ఖాసీ తెగ గిరిజనులు. వీరు పరాయి పరిపాలనను వ్యతిరేకించిన వీరయోధులు. తెల్లదొరల కుటిల రాజకీయ ఎత్తుగడలతో ఖాసీల స్వరాజ్యాలను వశపరచుకునే ప్రయత్నాలను ఖాసీలు తిప్పికొడుతూ స్వయం పాలన సమరానికి పూనుకున్నారు. ఖాసీ తెగ గిరిజనులు దక్షిణ అసోంలోని సిల్హట్ ప్రాంతంలో ఉత్తరం కింది భూభాగానికి మధ్యగల 3,500చదరపు మైళ్ల విస్తీర్ణంలో నివసిస్తున్నారు. పూర్వం నుండే ఖాసీ కొండల్లో 30 దాకా ఖాసీల రాజ్యాలుండేవని, ఇవన్నీ సత్సంబంధాలు కలిగిన ఖాసీల గణతంత్ర రాజ్యాలుగా పరిపాలింపబడేవని చరిత్రను బట్టి తెలుస్తోంది. ఒక్కో ఖాసీ రాజ్యానికి సర్దార్లు, స్వంత మంత్రి మండలి ఉండేది. ఇలాంటి అదిమ ఖాసీ తెగలో పోరాట పటిమ గల యోధుడు తీరద్ సింగ్. ఈయన 1802లో మొయిరాంగ్‌లో జన్మించాడు.
కుట్రలను ఛేదించి..
అసోంలో అధికారం చలాయిస్తున్న ఆంగ్లేయులు ఖాసీ కొండలపై కాలుమోపి ఆదివాసీల రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలనే కుట్ర పన్నారు. అసోం ఈశాన్య ప్రాంత గవర్నర్ జనరల్‌కు ఏజెంటుగా వున్న డేవిడ్ స్కోట్ ఖాసీ కొండల నుండి సిల్హట్‌ను కలుపుతూ అసోం దిగువ క్షేత్రం వరకు రోడ్డు నిర్మించేందుకు పథక రచన చేశాడు. ఈ కుట్రలను ఛేదించి తెల్ల దొరలను ఎదిరించి పోరాడిన ఖాసీలలో తీరద్ సింగ్ గొప్ప వీరుడు. ఆదివాసీ యోధుడు. 1826లో ఛత్రసింగ్ మరణానంతరం నుంగక్లా ప్రజలు డేవిడ్ స్కోట్ ఆధ్వర్యంలో తీరద్ సింగ్‌ను తమ సర్దార్‌గా ఎన్నుకున్నారు. 18 నెలలు గడిచిన తర్వాత బ్రిటీషోళ్లు తమకు పన్ను కట్టవలసిందిగా తీరద్ సింగ్‌పై ఒత్తిడి పెంచారు. ఆగ్రహించిన తీరద్ సింగ్ ఖాసీ కొండల నుండే బ్రిటిష్ పాలకులను తరిమేయాలని శపథం చేశారు.
వారి సైన్యాలను తరిమి వేయడానికి..
1829, ఏప్రిల్ 4న మిలియమ్ రాజ్య సర్దార్‌తో కలిసి తొలిసారిగా బ్రిటిషోళ్లపై దాడి చేశాడు తీరద్ సింగ్. నుంగక్లా గ్రామ తహసీల్దార్ గా ఉన్న మహీధర్ బరువాతో సహా చాలా మంది అధికారుల్ని పట్టుకున్నాడు. అంతేగా క కెప్టెన్ బోడింగ్ ఫీల్డ్, కెప్టెన్ బర్లటన్లను ఖాసీలు పట్టుకున్నారు. ఖాసీల ఉద్భత పోరాటానికి దిగొచ్చిన ప్రభుత్వం బందీలుగా ఉన్న ఖాసీలందర్నీ విడుదల చేసింది. దీంతో ఖాసీ కొండల్లో నివసిస్తున్న వనవాసులందరూ తీరద్ విప్లవ సైన్యంలో చేరడంతో ఉద్యమ బలం పెరిగింది. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా సాగుతున్న తీరద్ సింగ్ స్వాతంత్య్ర పోరాటానికి ప్రజల అండదండలు పెరిగాయి. వేలమంది ఖాసీలు అస్త్ర శస్త్రాలు ధరించి గౌహతి నుండి తెల్ల దొరల సైన్యాలను తరిమి వేయడానికి సిద్ధమయ్యారు.
ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ ఆదివాసీ!
బ్రిటీష్ కెప్టెన్ లిస్టర్ నాయకత్వంలో ఒక సైనిక బృందాన్ని సిల్వట్‌కు పంపారు. ఈ విషయం తెలుసుకున్న తీరద్ సింగ్ తమ అనుచరులైన వనమోన్, మాన్‌సింగ్‌లతో కలిసి చాకచక్యంగా తప్పించుకున్నాడు. కష్టతరమైన తీరద్ తన పోరాటంలో వెనకడుగు వేయలేదు. కానీ కొందరి సహచర విప్లవకారుల మోసం వల్ల తీరద్ సింగ్ బ్రిటిషోళ్లకు లొంగిపోక తప్పలేదు. 1833, జనవరి 26న తీరద్‌ను గౌహతికి పంపించి సైనిక న్యాయస్థానంలో విచారణ జరిపించారు. బ్రిటిష్ వ్యతిరేక విధానాలకు పాల్పడినందుకు తీరద్‌ను దోషిగా నిలబెట్టారు. ఆ తర్వాత తీరద్‌ను ఢాకా జైలులో దుర్భర జీవనం గడుపుతూ 1835, జూలై 17న తనువు చాలించాడు. ఈశాన్య రాష్ట్రాల్లోని మేఘాల యా, అసోంలోని ఆదివాసీ స్వతంత్ర రాజ్యా ల్లో తెల్లదొరల చొరబాటును ధిక్కరించి, విప్లవ శంఖాన్ని పూరించిన తీరద్ సింగ్ ప్రతి భారతీయుడు గర్వించదగ్గ ఆదివాసీ వీర యోధుడు.
(నేడు తీరద్ సింగ్ వర్ధంతి)
గుమ్మడి లక్ష్మీ నారాయణ,
ఆదివాసీ రచయితల వేదిక,
94913 18409