నిబద్ధత గల వీసీలను నియమించండి!
Recruit committed vice chancellors to Telangana universities
గత ప్రభుత్వం పదేళ్ల పరిపాలనలో విద్యా వ్యవస్థను పూర్తిగా విధ్వంసం చేసింది. అందులో ముఖ్యంగా తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి, తెలంగాణ ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించి ఉద్యమానికి ఊపిరి అందించిన యూనివర్సిటీలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఎలాంటి మౌలిక వసతులు కల్పించకుండా చేశారు. యూనివర్సిటీలలో అర్హులకు ఫెలోషిప్స్ ఇవ్వకుండా, మెస్ ఫీజులు అధికంగా పెంచి, ప్రైవేటు విద్యా సంస్థల కంటే ఘోరంగా గ్రామీణ నిరుపేద విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేయడం జరిగింది. దానికి తోడు యూనివర్సిటీలలో నిర్బంధాలు, మేధో చర్చలు లేకుండా సమావేశాలపై ఆంక్షలు విధించారు. ఓయూలో కేవలం బీఆర్ఎస్ కార్యక్రమాలకే అనుమతులు ఇచ్చి.. వారి నాయకులకు సాదర స్వాగతం పలికించారు. కానీ కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి నిరాకరించి వ్యవహరించిన తీరు చూశాం. ఓయూ వీసీనే యూనివర్సిటీలలో ప్రశ్నించిన విద్యార్థులపై కేసులు మోపి దాడులు చేపించిన తీరు కేయూలో చూశాం.
గత ప్రభుత్వంలో నిత్యం ఇలాంటి సంఘటనలు సమైక్య రాష్ట్రంలో కంటే ఎక్కువగా జరిగాయి. దీనికి కారణం కేసీఆర్ వ్యక్తిగత ఆలోచన విధానానికి అనుగుణంగా కనీస నైతిక విలువలు మరిచి, విజ్ఞత లేకుండా కొంతమంది ప్రొఫెసర్‌లు.. తమ పదవులు, స్వలాభమే ఎజెండాగా పనిచేయడమే! ప్రజా విద్యార్థి పక్షాన ఉండాల్సిన వాళ్ళు, గత ప్రభుత్వంలో వీసీలుగా.. వివిధ పదవుల్లో పనిచేసిన ప్రొఫెసర్లను పునర్ నియామకం చేయకుండా ఉండాలని కోరుతున్నాం. ఉన్నత విద్యలో ఇంకా కొనసాగుతున్న అలాంటి ప్రొఫెసర్లను, అధికారులను కూడా తొలగించి సైద్ధాంతిక విలువలు, రాష్ట్ర పునర్నిర్మాణంలో విద్యా వ్యవస్థ బలోపేతం చేయడం కోసం నిబద్ధత కలిగినటువంటి ప్రొఫెసర్లని వైస్ ఛాన్స్‌లర్లుగా ఉన్నత విద్యలో నియామకం చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల పక్షాన ప్రజా పాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.
వలిగొండ నరసింహ
ఓయూ విద్యార్థి నాయకుడు
91609 61717