రాహుకాలం
రోజురోజుకు రాహుకాలం పిచ్చి, వాస్తు పిచ్చి పెరిగిపోతున్నది. ఆ మధ్యన ఓ గమ్మత్తైన సంఘటన నాకు ఎదురైంది
రోజురోజుకు రాహుకాలం పిచ్చి, వాస్తు పిచ్చి పెరిగిపోతున్నది. ఆ మధ్యన ఓ గమ్మత్తైన సంఘటన నాకు ఎదురైంది. ఆ రోజు శనివారం. కోర్టు లేదు. కేసు ఫైల్స్ చూస్తూ కూర్చున్నాను. సరిగ్గా తొమ్మిది గంటలకు నా సెల్‌ఫోన్ మోగింది. ఓ క్లయింట్ ఫోన్ చేసి నన్ను కలవడానికి టైం అడిగాడు. ఆదివారం ఉదయం రమ్మని చెప్పాను. అతను ఇష్టపడలేదు. అతను కోరిన తేదీన అతను కోరిన టైంకి అపాయింట్మెంట్ కావాలని వేడుకోలుగా అడిగాడు. అది ఏం పిచ్చో అర్థం కాలేదు. అతను కోరిన తేదీకే టైంకే అపాయింట్మెంట్ ఇచ్చాను. నా సెల్ నంబర్ అతను అనుకున్న అంకెలకి అనుగుణంగా ఉందని కూడా అతను మాటల్లో చెప్పాడు. అందుకే నన్ను న్యాయవాదిగా ఎంపిక చేసుకున్నానని కూడా చెప్పాడు. నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు అయినా నాకు కొత్త కేసు వస్తుంది కదా? అని ఏమీ అనలేకపోయాను.
అపాయింట్మెంట్ ఇచ్చిన సమయానికి ఠంచనుగా వచ్చాడు. కేసు గురించి అడిగాను. వివరించాడు. కొంతసేపటికి నా పుట్టిన రోజు సంవత్సరం అడిగాడు. 'ఎందుకు' ప్రశ్నించాను నేను. అతడు సరిగా సమాధానం చెప్పలేదు కానీ, మళ్లీ అడిగాడు. పుట్టినరోజు, సంవత్సరం చెప్పడం వల్ల నష్టం ఏమీ లేదని అనుకొని వివరాలు చెప్పాను. కాసేపు ఏవో లెక్కలు వేసుకున్నాడు. అతని మొహం వెలిగిపోయింది. 'మీ జన్మ తేదీ కూడా నా అంకెలకు బాగా సరిపోయింది సార్' అన్నాడు.
అంతటితో ఊరుకోలేదు. 'కేసు తప్పక మనం గెలుస్తాం' అని అన్నాడు. అతని న్యూమరాలజీ పిచ్చికి ఏమనాలో నాకు తోచలేదు. ఆ తర్వాత కేసుకు సంబంధించిన కాగితాలు ఇచ్చాడు. నేను ఎడమ చేతితో తీసుకోబోయాను. కుడి చేతితో తీసుకొమ్మని కోరాడు. కాగితాలు అన్నీ చూసి కేసులో బలం ఫిఫ్టీ ఫిఫ్టీ ఉందని, ప్రయత్నం చేద్దామని చెప్పాను. ఆ తర్వాత ఫీజు విషయం చెప్పాను. నేను చెప్పిన ఫీజులో ఒక వెయ్యి రూపాయలు తగ్గించి తీసుకోమని కోరాడు. అలా అయితే తన సంఖ్య కుదురుతుందని కూడా చెప్పాడు. సరేనన్నాను.
అతను ఆనందంతో నేను చెప్పిన ఫీజు మొత్తం చెక్ రాసి ఇచ్చాడు. అయితే, కేసు తప్పక మర్నాడే ఫైల్ చేయాలని కోరాడు. మొత్తం ఫీజు ఒకేసారి చెల్లించిన క్లయింట్ కాబట్టి 'అలాగే' అన్నాను. ఎలాంటి జాప్యం లేకుండా అతను కోరినట్టుగా కేసు దాఖలు చేశాను. ఆ మర్నాడు కేసు లిస్ట్‌లోకి వచ్చింది. కేసు ఆర్గ్యూ చేయడానికి సంసిద్ధమవుతున్నాను. అప్పుడు వచ్చాడు మా క్లయింట్. ఆ రోజు కేసు విధించవద్దని కోరాడు. సరైన రోజున కేసు లిస్ట్‌లో రాలేదని కూడా చెప్పాడు. మనం కోరిన విధంగా జడ్జిలు తేదీలు ఇవ్వరని చెప్పాను. వారం రోజుల తరువాతకు వాయిదా తీసుకోమని కోరాడు. కాసేపు ఆలోచించి అతన్నే కోర్టుకు వెళ్లి కేసు వాయిదా తీసుకోమని చెప్పాను. తన న్యాయవాది అనారోగ్యంగా ఉన్నాడని కూడా చెప్పమన్నాను. అలాగే చేశాడు. అతని కేసు వారం రోజులకు వాయిదా పడింది.
వాయిదా రోజు నా దగ్గరికి వచ్చాడు. ఆ రోజు కూడా బాగా లేదని, మర్నాడు చాలా బాగుందని, వాయిదా తీసుకోమని కోరాడు. ఇష్టం లేకపోయినా, కష్టం అనిపించినా పూర్తి ఫీజు ముందే చెల్లించిన క్లయింట్ కాబట్టి వాయిదా కోరాను. అసహనంగా జడ్జిలు వాయిదా ఇచ్చారు. ఇంకోసారి వాయిదా ఇవ్వబోమని కూడా హెచ్చరించారు. ఆ రోజు నా క్లయింటు మళ్లీ వచ్చి సరిగ్గా మధ్యాహ్నం మూడు గంటలకి నా వాదనలని ప్రారంభించామని కోరాడు. ఎందుకంటే అంతకు ముందు దుర్మూహుర్తం ఉందని చెప్పాడు. కుదరదని చెప్పాను. బతిమిలాడినాడు. కాళ్లావేళ్లా పడటంతో సరే, అదే టైంకి వాదనలకు అనుమతి ఇవ్వమని జడ్జిలని కోరతానని చెప్పాను. నా క్లయింటు విషయం జడ్జిలకు చెబుతూ టైం అడిగాను. వారు ఏ మూడ్‌లో వున్నారో నవ్వుతూ టైం ఇచ్చారు. ఈ సారి ఆశ్చర్యపోవడం నా వంతయ్యింది.
నా క్లయింటు ఆనందానికి హద్దులే లేవు. సరిగ్గా అతను కోరుకున్న సమయానికి నేను కేసు వాదించాను. వాదనలు ముగిసిన తర్వాత కేసు అడ్మిషన్ స్టేజీలోనే డిస్‌మిస్ అయ్యింది. ఆ డివిజన్ బెంచ్‌లోని న్యాయమూర్తి నా వైపు చూస్తూ నవ్వుతూ ఇలా అన్నాడు. 'ఏ కాలమైనా మీ క్లయింటుకి రాహుకాలమే' ఆ తర్వాత మా క్లయింటు కనిపించాడు. అతని వైపు చూసాను. కేసు డిస్మిస్ అయిన సంగతి అతనికి తెలిసింది. బాధపడతాడని అనుకున్నాను. అతని మొహంలో అలాంటి ఛాయలు కనిపించలేదు. అంతే కాదు, అతనే నన్ను ఓదార్చాడు. 'పర్వాలేదు సార్! మళ్లీ మనం రివిజన్ వేద్దాం. ఈ కోర్టు వాస్తు బాగా లేదు అందుకే మన కేసు వీగిపోయింది' అన్నాడు. నాకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు.
కోర్టు హాలు వాస్తు బాగాలేదో, ఈ దేశం వాస్తు బాగా లేదో నాకు అర్థం కాలేదు. ఇద్దరం కలిసి బార్ రూం వైపు వస్తుంటే అతని ఫోన్ మోగింది. కట్ చేసాడు. మళ్ళీ మోగింది. 'ఇక్కడ దగ్గరలో కోర్టు హాల్ లేదు. మాట్లాడండి' అన్నాను. అతను మాట్లాడాడు. ఇంటి దగ్గర రోడ్డు మీద అతని కొడుక్కి యాక్సిడెంట్ అయ్యిందని, ఏ హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లాలో చెప్పమని అతని భార్య అడుగుతోంది. జయా హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లమని చెప్పి, వెంటనే ఆ హాస్పిటల్‌లో తెలిసిన డాక్టర్‌కి ఫోన్ చేసాడు. నేను ఒకసారి నా సెల్‌ఫోన్‌లోని పంచాంగం వైపు చూసాను. అతను ఫోన్ చేసిన సమయం రాహుకాలం. ఆ విషయం అతనితో చెప్పకుండా, త్వరగా హాస్పిటల్‌కు వెళ్లమని సూచించారు. అతను తన కారు వైపు పరిగెత్తాడు. రాహు కాలమని చూడకుండా!!
-మంగారి రాజేందర్ జింబో
94404 83001