సీనియర్ సిటిజన్స్ కు సౌకర్యాలు కల్పించండి

దేశం ప్రస్తుతం అన్ని రంగాలలో పటిష్టంగా ఉందంటే అది ‘సీనియర్ సిటిజన్స్’ కృషి ఫలితమే. కానీ, సీనియర్ సిటిజన్స్‌ను ప్రభుత్వాలు అస్సలు

Update: 2022-09-28 18:30 GMT

దేశం ప్రస్తుతం అన్ని రంగాలలో పటిష్టంగా ఉందంటే అది 'సీనియర్ సిటిజన్స్' కృషి ఫలితమే. కానీ, సీనియర్ సిటిజన్స్‌ను ప్రభుత్వాలు అస్సలు పట్టించుకోవడవం లేదు. ఎలాంటి వసతులు, సౌకర్యాలు కల్పించడం లేదు. బ్యాంకులలో రుణాలు పొందడానికి, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి అర్హత లేకుండా చేశారు. దేశ ఆర్థిక పటిష్టత కోసం జవసత్వాలు ఉన్నప్పుడు పన్నులు చెల్లించాం. ఇప్పటికీ చెల్లిస్తూనే ఉన్నాం. కానీ, మా ఆర్థిక పటిష్టత కోసం ఉద్యోగం చేయడానికి మాత్రం అర్హత ఉండటం లేదు. దేశంలో మా కోసం ఏ పథకం లేదు.

మా కోసం రైల్వేలో ఉన్న 50 శాతం తగ్గింపును కూడా నిలిపేశారు,. రాజకీయాలలో ఉన్న సీనియర్ సిటిజన్‌లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మాత్రం అన్ని రకాలుగా పింఛన్లు పొందుతున్నారు. వృద్ధాప్యంలో పిల్లలు భరించలేకపోతే మేము ఎక్కడ ఆశ్రయం పొందాలి?

ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి

సీనియర్ సిటిజన్స్‌కు మన దేశంలో ఉన్నది ఒకటే అర్హత 'ఓటు హక్కు'. దాని ద్వారా ఓటు వేయించుకొని మమ్ములను పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలను మార్చే శక్తి మాకు ఉంది. మేము బలహీనులమని చిన్నచూపు చూడకండి. సీనియర్ సిటిజన్‌ల కోసం కూడా ఒక పథకం అవసరమని ఎప్పుడూ గుర్తించడం లేదు. ఇప్పటికే మాకు బ్యాంకు వడ్డీ రేటును తగ్గించారు. ఫలితంగా మా ఆదాయం తగ్గిపోతున్నది. దేశంలో సీనియర్ సిటిజన్‌గా ఉండటం ఒక శాపం. కావున ప్రభుత్వాలు ఆలోచించి అర్హతకు తగినట్టుగా పింఛన్లు ఇవ్వాలి.

ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలి. రవాణాలో 50 శాతం రాయితీ, ఆదాయ పన్ను నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వాలి. వయోధిక పౌరులు సగౌరవంగా బతికేలా ప్రభుత్వం చొరవ చూపాలి. బ్యాంకులలో నిలుచోని కార్యకలాపాలు చేయవలసి వస్తున్నది. ప్రతి కార్యాలయంలో, బస్టాండ్‌లో రైల్వే స్టేషన్‌లో, అన్ని ప్రదేశాలలో సీనియర్ సిటిజన్స్ కు ప్రత్యేక సదుపాయాలు కల్పించి ప్రపంచానికే ఆదర్శంగా భారతదేశం నిలవాలవాలని కోరుకుంటున్నాం..


దండంరాజు రాంచందర్‌ రావు

రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్

సింగరేణి భవన్, హైదరాబాద్

98495 92958

Tags:    

Similar News