ప్రేమను గెలిపించిన తండ్రి

Proddutur MLA shivaprasad reddy wins love daughters love marriage

Update: 2023-09-15 01:00 GMT

'ఎమ్మెల్యే గారి అమ్మాయా! రెడ్డింటి బిడ్డనా! ఎలా ప్రేమించావురా! ఆ పిల్లే ప్రేమించాను అన్నా సరే అనేయడమేనా! భూమ్మీద బతకాలని లేదా! ఇదేమన్నా సినిమా అనుకున్నావా! అని పిల్లాడి ప్రేమ విషయం తెలియగానే మధ్యతరగతి తల్లిదండ్రులు నెత్తినోరు కొట్టుకుంటారు. అటువైపు- ‘నలుగురిలో మన పరువు ప్రతిష్టలు ఏం కాను! రేపటి నుంచి బజార్లో తలెత్తుకొని తిరుగుతామా!’ ససేమిరా కుదరదని అమ్మాయి ఇంట్లో బెదిరింపుల పర్వం నడుస్తుంది. పేదింటి అబ్బాయిని గొప్పింటి అమ్మాయి ప్రేమిస్తే ఇలాగే ఉంటుంది. ఆ ప్రేమకథలో విషాదాంతాలే ఎక్కువ. ఎక్కడో ఓ చోట పెళ్లయ్యాక జరిగిందేదో జరిగింది అని చేరదీసే వారుంటారు. కానీ ఈ ఎమ్మెల్యే అమ్మాయి ప్రేమను పెద్ద మనసుతో అంగీకరించి సంతోషంగా పెళ్లి చేశారు. ఆయనే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.

సంప్రదాయాలను దాటి..

ఈ నెల ఏడున కూతురు కోరినట్లుగా ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి నిరాడంబరంగా, సాంప్రదాయబద్దంగా బొల్లవరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెద్దల సమక్షంలో వీరి వివాహం జరిపించి అనంతరం ప్రొద్దుటూరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించారు. మనసున్న తండ్రిగా ఆయన తీసుకున్న ఈ నిర్ణయంపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రేమించుకున్న పిల్లల మధ్య కుల, మత, ఆర్థిక, సామాజిక తారతమ్యాలను లెక్కించి, బంధువుల ముందు తలవంపులని భావించి పరువు కోసం ప్రాణాలు తీస్తున్న నేటి క్రూర పరిస్థితుల్లో... చల్లని జల్లులా, ఎందరికో కళ్ళు తెరిపించేలా, ప్రేమికులకు ధీమా ఇచ్చేలా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ఈ అగ్రకుల తండ్రి భేషజాలకు స్వస్తి పలికి దేశానికే ఆదర్శంగా నిలిచారు. తెలుగుజాతి యావత్తు గర్వపడేలా కూతురు మనసుపడ్డవాడితో పెళ్లి చేశారు. తరాలుగా వస్తున్న సామాజిక, సాంప్రదాయిక బంధనాలను ఒక్క ఉదుటన దాటి ఆయన తన పెద్ద కూతురు పల్లవి కోరుకున్నవాడితో కులాంతర పెళ్లి జరిపించారు. ఆ పని ఈ వాక్యం రాసినంత తేలికయినది కాదు. కూతురు తన మనసులోని కోరిక చెప్పగానే ఆయన ఎంత ఘర్షణ పడ్డారో, సహచరితో ఎన్ని ఆలోచనలు చేశారో, అగ్రకులం వేలెత్తి చూపుతుందని ఎంత సతమతమయ్యారో గాని చివరకు అన్నింటిని పక్కకు తోసి నికార్సయిన నిర్ణయం తీసుకున్నారు.

సకల హోదాల పరంగా సమాజంలో ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న ఆయన తన కూతురు అడిగిన వెంటనే ఎన్నో మెట్లు దిగివచ్చి బిడ్డ సుఖమే తమ సౌఖ్యమనుకొని సరేనన్నారు. అలా దిగి వచ్చిన ఆయన సమాజం దృష్టిలో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారు. వరుడు పవన్ కుమార్ ఆర్టీసీలో మెకానిక్ కుమారుడు. అమ్మాయి క్లాస్ మేట్. పదేళ్లుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. పెద్దలు తమ ప్రేమను అంగీకరించరని ఎంత కాలం బెంగ పడ్డారో కానీ అమ్మాయి ఇంట్లో పెళ్లి ప్రస్తావన తేగానే ధైర్యంగా తన మనసులోని మాట చెప్పి తన ప్రేమను నిలబెట్టుకుంది. ఫలానా అబ్బాయిని ప్రేమిస్తున్నాను, అతడినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పడానికి ఆడపిల్ల ఎంత వేదన పడుతుందో తెలిసిందే! తండ్రితో తన నిర్ణయాన్ని చెప్పడంలోనూ తండ్రి ప్రేమ, పెంపకం దాగి ఉన్నాయి.

ఆయన మాటలు సుభాషితాలు!

పెళ్లి అనంతరం ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కుమార్తె ఇష్టాన్ని, నిర్ణయాన్ని గౌరవించి ఈ వివాహం జరిపించినట్లు చెప్పారు. డబ్బుకు, హోదాకు, కులానికి విలువ ఇవ్వకుండా వారి ఇష్ట ప్రకారమే పెళ్లి చేసినట్లు తెలిపారు. హుందాగా ఆయన తన మనసులోని మాటను నలుగురి ముందు ఎంతో సంతృప్తిగా చెప్పిన తీరు ఎంతో గొప్పగా ఉంది. ‘పదేళ్లుగా నిలిచిన వారి ప్రేమనే ప్రామాణికంగా తీసుకోని వారి స్వచ్ఛమైన అనుబంధానికి అదే నిదర్శనమని నమ్మినాను. కులాలకు నేను ప్రాధాన్యతనియ్యను. నాకు అనారోగ్యం చేస్తే ప్రాణం కాపాడే వైద్యుడు నా కులంవాడు కాదు. నాకు చదువు చెప్పి ఇంత జ్ఞానాన్ని ప్రసాదించిన గురువు దస్తగిరి. వారికి పాదాభివందనం. నేను తినే బువ్వ పండించినవాడు రెడ్డి కాదు. నా కులం కాని వారు బతుకంతా పనికొచ్చినపుడు పిల్లకు సంబంధానికి ఎందుకు పనికి రారు! కులం లేదు మతం లేదు, మిగిలింది మానవత్వమే. నాకు ఏ కులం లేదు. ఎవరింటికి పొతే వారిదే నా కులం. ఎలాంటి భేదభావాలు నా మనసులో చోటు చేసుకోవు. తనకు రాజకీయ ప్రత్యర్థులే తప్ప రాజకీయ శత్రువులు లేరు’ అన్న శివప్రసాద్ రెడ్డి మాటలు నిజంగా సుభాషితాలే. అందరు ఆచరించదగ్గవి.

'కులాంతర వివాహం, ఆర్థికంగా పేదవాడు, సామాజికంగా మన స్థాయి కాదు అనే మూడు అంశాలు శ్రేయోభిలాషులతో చర్చకు వచ్చినప్పుడు కులాల పట్ల నాకు పట్టింపు లేదని, నా బిడ్డ ఇష్టపడి ఒకరిని చేసుకుంటే అదే నా కులం. సరితూగే సామాజిక హోదా కన్నా వారు సుఖంగా ఉండడమే కావాలి. స్థాయి కన్నా బిడ్డ సంతోషం ముఖ్యం. పిల్లలు సరియైన నిర్ణయం తీసుకోకపోతే సలహా ఇచ్చే బాధ్యత మాత్రమే మనపై ఉంది. నేను అతడితో సంతోషంగా బతుకుతాను అని నమ్మకంగా చెప్పాక కన్నవారు అడ్డు చెప్పడం పద్ధతి కాదు. అబ్బాయి చదువుకొని మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ప్రయోజకుడైన అబ్బాయికి పిల్లనివ్వడానికి అభ్యంతరమేమీ కనబడలేదు’ అన్న శివప్రసాద్ రెడ్డి మాటల్లో ఓ ఉత్తమ తండ్రి హితబోధ ఉంది. అవి రేపటి కులాంతర, ప్రేమ వివాహాలకు భరోసానిస్తాయనే చిన్న ఆశ చిగురిస్తోంది.

-బి.నర్సన్,

94401 28169

Tags:    

Similar News