ప్రపంచవ్యాప్తంగా కరోనా సమయంలో కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజల వద్ద నుంచి ఏ విధంగా సొమ్ము వసూలు చేశారో మన కళ్ళ ముందు చూసాం. అప్పు చేసి వైద్య ఖర్చులు భరించినా రోగి ప్రాణాలతో బ్రతికి బట్టకట్టలేదు. ఆరోగ్య బీమా ఉన్న వాళ్ళను కార్డ్‌లో మొత్తం సొమ్ము హరించి మీది నుంచి నగదు చెల్లించేంత వరకు హాస్పిటల్ వర్గాలు రోగిని డిశ్చార్జ్ చేయలేదు. ప్రస్తుతం ఓ మనిషి శరీరంలో ఒక భాగానికి వైద్యం కోసం హాస్పిటల్‌కు వెళ్లితే అక్కడ రిజిస్ట్రేషన్ ఫీజ్, కన్సల్టింగ్ ఫీజ్, అనవసర రక్త పరీక్షలు, ఎక్స్-రే, స్కానింగ్‌ల పేరుతో దోపిడీ చేయడం జరుగుతుంది. ఒక వైద్యుని సంప్రదిస్తే మరొక వైద్యుడు రావడం ప్రతి వైద్యునికి ప్రత్యేక ఫీజ్ చెల్లించడం రోగం నిర్ధారణ కాక ఇన్-పేషంట్‌గా హాస్పిటల్ చేరాలని చెప్పి అక్కడ ప్రత్యేక వార్డ్, జనరల్ వార్డ్, ఏసీ వార్డ్, అని చెప్పి నామ్‌కే వాస్తేగా మందులు ఇస్తూ కాలం గడపడం అదృష్టం ఉంటే బతికి రావడం నిత్య సత్యం. ఆరోగ్య బీమా ఉంటే చాలు అందులో ఎంత సొమ్ము ఉంటే అంత వరకు వైద్యం ఇవ్వటం పరిపాటిగా మారింది. ఆరోగ్య బీమా పొందాలంటే కంటి, పంటికి చికిత్స వరకే బీమా, కంటి లెన్స్, కట్టుడు దంతాలకు భీమా వర్తించదు అని బీమా ఏజెంట్లు అమాయక ప్రజలకు బీమా తీసుకునేటప్పుడు చెప్పడం లేదు. ఈ విషయం తెలియని ఆరోగ్య బీమా పాలసీదారులు హాస్పిటల్‌లో చేరాక వారికి చుక్కలు కనబడుతున్నాయి. నేడు వైద్యం వ్యాపారంగా మారిన తరువాత కార్పొరేట్ వ్యక్తులు వైద్య నిపుణులను నౌకర్లుగా నియమించుకొని కేవలం డబ్బు ఉంటే వైద్యం చేయాలనే సూత్రం అమలు పరుస్తున్నారు. నేడు ప్రతి కార్పొరేట్ హాస్పిటల్ వారు పి.ఆర్.ఓలను నియమించుకోవడం వారు రోగులను పసికట్టి మా ఆసుపత్రుల్లో తక్కువ ఖర్చుతో ఉచిత పరీక్షల పేరుతో రప్పించడం తదనంతరం ఊబిలోకి లాగి ప్రజల సొమ్ము కాజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ ఉద్యోగులు రిటైర్ అయిన తరువాత దంపతులిద్దరికి పరిమిత వైద్య బీమా మెడికల్ కార్డు కలిగిఉన్నా, అవి ముసలి తనంలో వచ్చే వ్యాధులకు చెల్లడం లేదు.. చాలీచాలని పెన్షన్, అధిక ధరలతో సతమతమవుతున్న బడుగు పెన్షనర్స్ వద్ద మానవత్వం మరిచి నగదు గుంజుతున్నారు. ఇది వైద్య వృత్తికే కళంకం. ప్రభుత్వాలు భారీ భవనాలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించిననా అందులో వైద్య నిపుణులను పూర్తి స్థాయి నియామకం చేయకపోవడంతో ప్రజలు బలవంతంగా కార్పొరేట్ ఆసుపత్రులకు పరుగెత్తవలసిన పరిస్థితి నెలకొని ఉంది. నూతన తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు హామీ ఇచ్చిన గ్యారంటీ పథకాలతో పాటు, నిరుపేద ప్రజలు, ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థల పెన్షనర్లను, కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ నుంచి అరికట్టాలి.
ఆళవందార్ వేణు మాధవ్
86860 51752