చదువుకు కష్టమొచ్చిందోచ్…

Preparing students for TOEFL...Government teachers are under pressure

Update: 2023-09-20 01:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ప్రతిరోజు ఒక పీరియడ్ టోఫెల్ సన్నద్ధత కొరకు కేటాయించాలని సూచించారు. అయితే, ఆంగ్లాన్ని విద్యార్థులకు మరింత చేరువ చేయాలనుకోవడం మంచి ఆలోచన. విద్యార్థులకు ప్రపంచ స్థాయి పరిజ్ఞానాన్ని అందించాలనుకునే సంకల్పాన్ని ఉపాధ్యాయులుగా స్వాగతించాల్సిందే! అయితే ఇందులోని సాధకబాధకాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.

టీచర్లపై ఇంత భారమా?

ఈ టోఫెల్ విధానంతో అమలు విధానంతో ఉపాధ్యాయులు మనిషిగా భరించలేనంత కష్టం ఏర్పడుతుంది. ఆ కష్టం స్థాయి బహుశా కట్టు బానిసలకు కూడా ఎదురై ఉండకపోవచ్చు. ఒక సబ్జెక్టు టీచర్ పరిస్థితి మాత్రమే కాదు, దాదాపు బోధనారంగంలోని ఉపాధ్యాయుల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకల కంటే భిన్నంగా ఏమీ లేదు. టోఫెల్ బోధనకు ప్రభుత్వం సూచించిన విధంగా పీరియడ్లు తీసుకోవాలంటే ప్రస్తుతం వారంలో ఉన్న పీరియడ్లు అన్నీ కూడా చాలవేమో! వారానికి 48 పీరియడ్లు మాత్రమే ఉంటాయి. ఆరు రోజులు ఎనిమిది పీరియడ్లు (6×8=48) 48 పీరియడ్లు. అంటే క్షణం తీరిక లేని పనిభారం.

సింగిల్ సెషన్ ఉండే మూడు నుండి పదవ తరగతి వరకు ఉన్న (ఉన్నత పాఠశాల)పాఠశాలల్లో 96 పీరియడ్లలో తరగతులవారీ పార్యాంశాలతో పాటు TOEFL బోధనకు కేటాయించాలి. ఒక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ మొత్తం 48 పీరియడ్లు చెబితే కానీ ఇవి పూర్తి కావు. ఇక మూడు నుంచి ఎనిమిది తరగతులు ఉన్న (ప్రీ హై స్కూల్) ప్రాథమికోన్నత పాఠశాలల్లో మూడు నుంచి ఐదు తరగతులకు వారానికి 16 చొప్పున 48 మరియు 6 ,7, 8 తరగతులకు వారానికి 12 చొప్పున 36 పీరియడ్లు కేటాయించాలి. అప్పుడు మూడు నుండి 8 వరకు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలల్లో అంటే ఒక ఆంగ్ల ఉపాధ్యాయుడు 84 పీరియడ్లు బోధిస్తేనే సాధ్యమౌతుంది. మరి ఇది ఏ విధంగా, ఎంతవరకు సాధ్యమో ప్రణాళికలు రూపొందిస్తున్న ఎస్సీఈఆర్టీ మేధావులకే తెలియాలి. 3, 4, 5 తరగతుల్లో వర్క్ షీట్లు పూర్తి చేయడంపై తరగతుల్లో పాఠ్య పుస్తకంతో పాటు నాన్ డిటైల్డ్, వర్క్ బుక్‌తో పాటు నోటు పుస్తకాల కరెక్షన్, పాఠ్య ప్రణాళికలు, సన్నద్ధత కావడానికి సమయం అవసరం లేదా?

ఎవరైనా ఇంగ్లీష్ బోధించవచ్చా?

ఇప్పటికే పనిభారంతో, మానసిక వ్యాధులతో అవాంఛనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్న ఇతర ఉపాధ్యాయులను కూడా రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారు. అదేంటంటే ఏ ఆంగ్ల బోధన పద్ధతులను అభ్యసించి వున్నా, డిగ్రీలో కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ఉపాధ్యాయుడైనా, ఇంగ్లీష్ సబ్జెక్టు కలిగివున్న టోఫెల్ తరగతులు తీసుకోవచ్చునని ఎస్సీఈఆర్టీ అధికారులు సెలవిచ్చారు. ఇది పరోక్షంగా ఉపాధ్యాయులలో ఒక స్పష్టమైన అభిప్రాయ భేదం సృష్టించడమే కాదు, ఒకే పాఠశాలలోని ఉపాధ్యాయులను రెండుగా చీల్చడం. విపరీతంగా పెరిగిన పనిభారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇతర సబ్జెక్టుల ఉపాధ్యాయులను టోఫెల్ బోధించమని ఆదేశించడం బట్ట నెత్తికి, మోకాలి వెంట్రుకలను ముడి వేయడం తప్ప మరొకటి కాదు.

అలసటలేని అభ్యసనం ఏది?

అయితే, ఇంగ్లీషుపై ప్రభుత్వం ఎందుకో తొందర పడుతున్నట్లు కనిపిస్తున్నది. బలవంతంగా భాషను రుద్దడం వాస్తవ సాంస్కృతిక వికాసాన్ని దెబ్బతీస్తుంది. ఆంగ్లమే పరమావధి కాదు. ఆంగ్ల భాషా బోధన సర్వరోగ నివారిణి కాదు. ఇంగ్లీష్ మాతృభాషగా ఉన్న ఎన్నో దేశాల్లో నిరుద్యోగం జడలు విప్పి నర్తిస్తోంది. ఆంగ్లంలో విద్యార్జన చేసిన వారిలో నేర స్వభావం సాధారణ స్థాయి కంటే ఎక్కువగా వుంది. మానవతా విలువలు అట్టడుగు స్థాయిలో ఉన్నాయి. వివేచన, నైతిక విలువలు, నాగరికత, సామరస్య భావన, తల్లిదండ్రులను ప్రేమించే దృక్పథం, సాటి వారిని ఆదరించే స్వభావం మనిషిలో పెంపొందించే విద్య అవసరం. విద్య అనేది మనిషిని మనిషిగా తీర్చిదిద్దే ఉపకరణంగా ఉండాలి. భాష అనేది ఒక ఆభరణం మాత్రమే! అది ఆంగ్లమా, ఆంధ్రమా అనేది అప్రస్తుతం. తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ విధానాలపైనా, ఆంగ్లమాధ్యమంపై జరుగుతున్న అవాంఛనీయ గోబెల్స్ ప్రచారం పైనా అప్రమత్తతో ఆలోచించాలి. రాష్ట్రంలో విద్యారంగం పూర్తిగా నీరసించిపోయి రేవుకు సిద్ధమైన వాస్తవాన్ని గమనించాలి. విద్యార్థులలో కూడా అలసటలేని అభ్యసనానికి అవకాశం కల్పించాలి.

అప్పుడే.. వారి సేవలకు న్యాయం!

తమ బిడ్డలకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆశించడమే కాదు, చివరి రోజుల్లో తమ కళ్లెదుట ఉండి కనీసం చావు గడియల్లో ఆఖరి చూపులకైనా తల్లిదండ్రులు నోచుకోవాలి. పదిమందిలో ఉండి గౌరవప్రదంగా కాటికి సాగనంపే పరిస్థితిలో ఉండాలి. ఆంగ్లం చదివి విదేశాల్లో బతుకుదెరువుకు వెళ్ళితే ఏం జరుగుతుందో కంటిలోనే ఇంకిపోయిన కన్నీరును, ఏడ్చి ఏడ్చి బొంగురుపోయిన స్వరంతో మూగనోము నోస్తున్న వ్యధాభరిత కథలు వేలాదిగా ఉన్నాయి. విదేశాల్లో ఆయా కుటుంబాల్లో కకావికలమైన, సాధారణ ప్రేమకూడా లేక విలవిలలాడుతున్న దృశ్య రూపకాలు మరెన్నో!

ప్రభుత్వం రాత్రికి రాత్రి ఆకస్మికంగా బుర్రను తొలిచే ఆలోచనలకు కార్యరూపం ఇవ్వాలనే పరుగులు ఆపాలి. ఉపాధ్యాయ లోకం తన కష్టాలను ఎలుగెత్తి చాటుతోంది. భవిష్యత్తులో ప్రభుత్వ విద్యారంగం ఎదుర్కోబోతున్న పెనుసవాళ్లపై ఆందోళనతో ఉంది. ఇది జీతాల సమస్య కాదు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్లుంది. ఇది ఏమాత్రం సమంజసం కాదు. లోతుగా సమాలోచనలు చేసి ఆచరణ సాధ్యమైన పనికి ఉపాధ్యాయుల సేవలను సమర్ధవంతంగా వినియోగిస్తే ప్రభుత్వ పాఠశాలలను నమ్ముకొని బడుల్లో చేరిన విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. టోఫెల్ క్లాసుల నిర్వహణ గురించి మేధావుల నుంచి తగిన సూచనలు తీసుకోవాలి. ప్రస్తుతం దారుణమైన పని భారాన్ని మోస్తున్న ఆంగ్ల ఉపాధ్యాయులకు ఊరట కల్పించాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయుల సంఖ్యను పెంచి పనిభారం తగ్గించాలి. అప్పుడే ప్రభుత్వం ఆశించిన లక్ష్యాల సాధనకు దారులు ఏర్పడతాయి.

-మోహన్ దాస్

రాష్ట్ర కౌన్సిలర్, ఏపిటిఎఫ్ 1938.

94908 09909

Tags:    

Similar News