తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి నియామకాల విషయంలో ఒక దశాబ్దకాలంగా వివాదాలు నెలకొంటున్నాయి. ప్రభుత్వాలు తగిన నియమ నిబంధనలు పాటించకపోవడం, ముఖ్యంగా ఆధ్యాత్మిక అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా చైర్మన్, సభ్యులను నియమించడం వివాదాలకు దారి తీస్తున్నాయి. పాండిత్యం, నడవడిక, భక్తిభావాలను పరిగణనలోకి తీసుకోకుండా, ముందు వెనక ఆలోచన లేకుండా ఎవరికిబడితే వారిని నియమించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల ఆలయ పాలనాబాధ్యతలు నిర్వర్తించేందుకు బ్రిటీష్ ప్రభుత్వం 1933లో కమిషనర్ల నేతృత్వంలో పాలకమండలి వ్యవస్థను ఏర్పాటు చేసింది. 1951లో చేసిన హిందూమత చట్టం ప్రకారం కమిషనర్లందరినీ కార్యనిర్వాహక అధికారులు (ఈవో)గా మార్చారు. టీటీడీ ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేసి, దానికి అధ్యక్షుడిని నియమించారు.
వివాదాలుగా..నియామకాలు
ప్రపంచంలోని ప్రతి హిందువు, కులాలతో సంబంధం లేకుండా ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునేంతటి ప్రాచుర్యం పొందిన దైవం తిరుమల శ్రీవెంకటేశ్వరుడు. అంతర్జాతీయ స్థాయిలో అంతటి విశిష్టత కలిగిన దేవాలయ కమిటీ పాలకవర్గ సభ్యులు మతపరంగా, ఆధ్యాత్మికంగా, ఆలోచన, నడవడిక పరంగా ఉత్తమోత్తములై ఉండాలని భక్తులు ఆశిస్తారు. అటువంటి కమిటీ నియామకంలో నిర్లక్ష్యం వహించినా, పొరపాటు జరిగినా అది సమాజంపైనే కాకుండా ప్రభుత్వంపైన కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ నియామకాలు కులాలు, రాజకీయ ప్రాతిపదికన జరిగినప్పటికీ హిందువుల మనోభావాలకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది. మొదట్లో హిందూ ధర్మం పట్ల అచంచల విశ్వాసం కలిగిన భక్తులను మాత్రమే ఈ పాలక మండలిలో నియమించేవారు. హిందూ దేవాలయాలలో విశిష్టత కలిగిన దేవాలయంగా టీటీడీకి ప్రపంచం వ్యాప్తంగా గుర్తింపు రావడంతో ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యుల పదవికి విపరీతమైన పోటీ పెరిగిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడుతోపాటు దేశవ్యాప్తంగా అనేక మంది వ్యాపార ప్రముఖుల దృష్టి కూడా ఇక్కడే ఉంటుంది. ఈ కమిటీలో స్థానం పొందాలని ఆశిస్తుంటారు. దాంతో కాలక్రమంలో ఇవి పూర్తిగా రాజకీయ నియామకాలుగా మారిపోయాయి. ఈ నియామకంపై వివాదాలోస్తే మార్పులు చేర్పులు చేస్తున్నారు.
గతంలో నియామకమైన పుట్టా సుధాకర్ యాదవ్, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిలకు టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చినప్పుడు క్రైస్తవులనే ఆరోపణలే వచ్చాయి. నిజానికి సుధాకర్ యాదవ కులానికి చెందిన వ్యక్తి కానీ ఆయన క్రిస్టియన్ మత ప్రచార సభలలో పాల్గోంటున్నాడని విమర్శలు వచ్చాయి. నిజానికి అది తప్పుకాదు. అది మత సామరస్యానికి ప్రతీక కూడా. సామాజికంగా మంచి పనే. అలాగే భూమన కరుణాకరరెడ్డి తన కుమార్తెను ఒక క్రైస్తవుడికి ఇచ్చి పెళ్లి చేశారు. వారు వారి మత పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. ఇది కూడా తప్పుకాదు. మతాంతర వివాహం చేసినందుకు సామాజికంగా ఆయనను అభినందించాలి. కరుణాకరరెడ్డి పక్కా హిందువు. వారి అబ్బాయి వివాహం కూడా హిందూ సంప్రదాయాల ప్రకారమే చేశారు. కాకపోతే గతంలో, అంటే ఆయన యువకుడుగా ఉన్నప్పుడు కమ్యునిస్టు, నాస్తికుడు. తర్వాత ఆయన భక్తుడిగా మారారు. ఆయన 2006 నుంచి 2008 వరకు ఆయన టీటీడీ చైర్మన్‌గా పనిచేశారు. అప్పుడే ఈ విమర్శలు వచ్చాయి. ఇక వైవీ సుబ్బారెడ్డిపై సైతం ఇలాంటి ఆరోపణలే వస్తే తాను క్రైస్తవుడిని కాదని, హిందువునేనని చెప్పారు. అలాగే కమిటీ సభ్యురాలిగా గతంలో అప్పటి పాయకరావుపేట శాసనసభ్యురాలు వంగలపూడి అనిత నియామకం కూడా విమర్శలకు దారితీసింది. అంతకుముందు స్వయంగా తానే కారులో,బ్యాగ్‌లో తప్పనిసరిగా బైబిల్ ఉంటుందని చెప్పారు. ఆమె అటు క్రీస్తుని, ఇటు వెంకటేశ్వరుడిని నమ్మవచ్చు, పూజించవచ్చు, ప్రార్థించవచ్చు. ఒక రకంగా అది మంచిదే. కానీ మత విశ్వాసాలు ఇటువంటి వాటిని అనుమతించవు. ఏ మత పెద్దలైనా ఇటువంటివాటిని అంగీకరించరు. ఇది అర్థం చేసుకున్న అనిత తానంతట తానే తప్పుకుంది.
కులాలకు ప్రాధాన్యం ఇవ్వాలి!
అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశం టీటీడీ అనేది హిందూ మత విశ్వాసాలు బలంగా నాటుకుపోయిన సంస్థ. దానికి చైర్మన్ గానీ, సభ్యులుగా గానీ ఉండేవారు హిందూమతానికి చెందిన పరమ భక్తులై ఉండాలి. ఈ విషయంలో మరో మాటకు తావులేదు. సామాజిక అంశాలు, మత విశ్వాసాలు వేరు వేరు. ఏ మతమైనా మతపరమైన వ్యక్తుల మనోభావాలు వేరుగా ఉంటాయి. ప్రస్తుత వ్యవస్థలో వాటిని ప్రభుత్వాలు గుర్తించి, గౌరవించక తప్పదు. అన్ని ప్రభుత్వాలు కూడా అలానే చేస్తున్నాయి. కానీ, అప్పుడప్పుడు ఇలాంటి వివాదాలు తలెత్తుతుంటాయి. ఇది సున్నితమైన అంశమైనప్పటికీ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. పుట్టా సుధాకర్ యాదవ్, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి వంటి వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వదలచుకుంటే ప్రభుత్వంలో మరో ఉన్నతమైన పదవి ఇవ్వవచ్చు. టీటీడీ చైర్మన్‌గా ఇటువంటి వివాదాలకు అవకాశంలేని వారిని నియమిస్తే బాగుంటుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇంతకు ముందు ఈ ప్రభుత్వం 80 మంది సభ్యులతో ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయడం కూడా తీవ్రవివాదానికి, విమర్శలకు దారి తీస్తే ప్రభుత్వం 52 మంది నియామకాలను నిలిపివేసింది.
అలాగే టీటీడీ మత సంబంధ సంస్థ అయినందున అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీవారి సేవలో తరించే కొన్ని కులాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరం ఉంది. శ్రీవారికి అత్తింటివారమైన తమ కులస్తులకు కమిటీలో స్థానం దక్కడంలేదని పద్మశాలీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పద్మశాలీయులు సిరికి పుట్టింటివారు, హరికి అత్తింటివారని, శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మశాలీయుల అల్లుడని తామ్ర శాసన ఆధారాలతో నిరూపణ అయింది. అయితే, కమిటీలో సభ్యత్వం లేదన్నదే వారి బాధ. పద్మావతీదేవి తమ ఆడపడుచు అయినందున ప్రతిసారి కమిటీలో తమ వారికి ఒకరికి స్థానం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇతర కులాల పరంగా కూడా సేవ, ఇతర భక్తిపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటే విశ్వబ్రాహ్మణ, యాదవ, నాయిబ్రాహ్మణ, బ్రాహ్మణ కులాల వారికి కూడా ప్రతి కమిటీలో స్థానం కల్పించవలసిన అవసరం ఉంది. అలాగే కమిటీ సభ్యులుగా ఎస్సీ, ఎస్టీ వ్యక్తులను కూడా నియమిస్తే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు. వారిని ఆధ్యాత్మికంగా, సామాజికంగా అందరితో సమానంగా గుర్తించి తగిన స్థానం ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే, ఇటువంటి నియామకాల విషయంలో మత పరంగా వారి నడవడి, సమాజంలో వారికి ఉన్న గుర్తింపు వంటివాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో చైర్మన్ నియామకంలో వివాదాలు, విమర్శలకు రాజకీయాలు, మతంతోపాటు కులం కూడా ఒక కారణం. వరుసగా ఒకే సామాజిక వర్గానికే చైర్మన్ పదవి ఇవ్వడం, అలాగే వారు ఇద్దరూ ముఖ్యమంత్రికి అతి సమీప బంధువులు అవడం విమర్శలకు అవకాశం ఇచ్చినట్లైంది.
మతపరమైన ఆనవాయితీలు గౌరవించి..
తిరుమలలో క్రైస్తవ మత ప్రచారం జరుగుతోందని, దానిని అరికట్టాలని, ఉద్యోగులలో కొందరు క్రైస్తవులు ఉన్నారని, వారిని బదిలీ చేయాలని హిందువులు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో వివాదాలకు దారితీసే వారిని నియమించడం మంచిదికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటువంటి చర్యలు వేల సంవత్సరాలుగా హిందువులలో జీర్ణించుకుపోయిన మనోభావాలను దెబ్బతీస్తాయి. మనది లౌకక రాజ్యమైనా ఇటువంటి నియామకాల్లో మతపరమైన ఆనవాయితీలను గౌరవించకతప్పదు. ఇలాంటి నియామకాలు ప్రభుత్వాలకు కత్తిమీద సాములాంటివి. మతపరమైన అంశాలతోపాటు అనేక సామాజిక వర్గాలను సంతృప్తిపరచవలసి ఉంటుంది. అంతేకాకుండా ఈ పదవిని అత్యంత గౌరవంగా భావించి అన్ని రంగాలలో ఉన్నతవర్గాల వారు, పారిశ్రామికవేత్తలు పోటీపడుతుంటారు. ఇటువంటి సందర్భాలలో ఏదైనా పొరపాటు జరిగితే ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి ప్రతిపక్షాలు లబ్ధిపొందాలని చూస్తుంటాయి. ప్రభుత్వం అంటే గిట్టనివారు కూడా ఇటువంటి సందర్భాలను తమకు అనుకూలంగా వాడుకుంటుంటారు. అందువల్ల మత, సామాజిక పరంగానే కాకుండా రాజకీయంగా నష్టం జరగకుండా కూడా ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
శిరందాసు నాగార్జున,
సీనియర్ జర్నలిస్ట్
94402 22914