సెస్ ఎన్నికల్లో ప్రభుత్వ జోక్యం తగునా?
political parties involving in CESS elections
జాతీయ స్థాయి సహకార రంగంలో పేరు ప్రఖ్యాతులు పొందిన సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం 53 సంవత్సరాలు పూర్తి చేసుకుని 54 వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఇప్పటివరకు తెలంగాణలో ఉన్న ఏకైక సంస్థగా సెస్ 'మూడు పూలుగా ఆరు కాయలుగా'అలరారుతోంది. అలాంటి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి చేయూత అందకపోవడం శోచనీయం. రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కె.తారక రామారావు ఈ సంఘం విషయంలో ఏదో మనసులో పెట్టుకొని చూసీచూడనట్టు ఉండడం సహకార వాదులను ఆలోచనలో పడేస్తున్నది. సెస్ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్న వేళ వీరి 'పులి మేక'క్రీడలో సెస్ బలి పశువు కానుందేమోనని వినియోగదారులు, ప్రజాప్రతినిధులు సందేహపడుతున్నారు.
దానికి ఛత్రీ నీడ పడుతూ
ఇది ఇలా వుంటే, సంస్థను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నం ఒకటి తెర వెనుక జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావలసిన విద్యుత్ బకాయిలు సకాలంలో సంస్థకు మంజూరు చేయడం లేదు. మంజూరు చేసినా బ్యాంకులో ఫ్రీజ్ చేస్తున్నారు. వ్యవసాయ విద్యుత్ బకాయిలను ఎన్పీడీసీఎల్ వరంగల్‌కు సర్దుబాటు చేయకపోవడమే కాక, శాసనసభ్యుల కోటాలో కన్‌స్ట్రక్షన్ పనులకు క్రెడిట్ లెటర్ ఇచ్చి నిధులు కేటాయించడం లేదు. అవినీతి ఉన్నతాధికారులను పెంచి పోషిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మంత్రి గారి పేషీ నుంచే వారిని కాపాడుతున్నారని అంటున్నారు. ఈ విషయాన్నీ మంత్రిగారికి వేగుల ద్వారా అందుతోందా? లేదా? అనే మీమాంస ఉంది.
సంస్థ అనేక విధాల అభివృద్ధితో రాకెట్ వేగంతో నింగి సరిహద్దుగా దూసుకుపోతున్నది. గతంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ బి.సత్యనారాయణ ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో అధ్యయనం ఒకటి జరిగింది. 'సహకార రంగంలో సంస్థ ఆర్థిక లావాదేవీలు, వినియోగదారులకు అందించే అత్యున్నత సేవలు' అనే అంశాల మీద మూడు, నాలుగు ఎంఫిల్ అధ్యయనాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బోర్డు సమాన పరిధిలో సంస్థపై ఒక తులనాత్మక అధ్యయనం కూడా జరిగింది. వీటన్నిటి ద్వారా సంస్థ శ్రేయస్సు జాతీయస్థాయిలో ద్విగుణీకృతం అయింది. నేటికీ ఉద్యోగులు పగలు, రాత్రి శ్రమించి వినియోగదారులకు సేవలను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
ఆ పరిణామంతో శీతకన్ను
ఇటీవల మంత్రి అనుచరుడు అయిన ఒక స్థానిక నాయకుడి నేతృత్వంలో సెస్ పాలకవర్గాన్ని నియమించారు. అట్టి నియామకం చెల్లదని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వుల ద్వారా కలెక్టర్‌ను సెస్ పర్సన్ ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఈ పరిణామాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సంస్థపై శీత కన్ను వేసింది. ఎన్నికల ఏర్పాట్లలో ఉండగానే, డైరెక్టర్ స్థానాలు పెంచాలని కొందరు తిరిగి హైకోర్టు గడప తొక్కారు. ఇటు బహుజన సమాజ్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ వీరికి తోడు స్వతంత్ర అభ్యర్థులు మాటల తూటాల పేలుస్తూ డబ్బూ, దర్పం కూడగట్టుకుంటున్నారు. ఇప్పుడు కావాల్సింది రాజకీయ వ్యవస్థలో పునరావాస కేంద్రాలు కాదు. పునర్జీవ శిక్షణ తరగతులు కావాలి.
ప్రభుత్వాలు నైతిక విలువలను, ప్రజాసేవలను మరచి, విలువలకు తిరోదకాలిచ్చి కేవలం సంపాదనే పరమావధిగా పనిచేయడం ప్రజాస్వామ్య దుస్థితికి దయనీయతకు నిదర్శనం. సెస్ ఎన్నికలను (CESS Elections) అధికారులు సజావుగా నిర్వహించేలా ప్రభుత్వం పెద్దలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కలుగ చేసుకోకపోవడం సంస్థకు, వినియోగదారులకు, ఈ ప్రాంతం సంక్షేమానికి ఎంతో కొంత మంచిది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సంస్థ గురించి సంపూర్ణ అవగాహన కలిగినవారు. కాబట్టి 'మన మానేరు, మన దక్షిణ కాశీ వేములవాడ, మన నర్మాల ప్రాజెక్టు, మన మిడ్ మానేరు ప్రాజెక్టు, మన సెస్'అనే నినాదంతో సమన్వయం చేస్తూ ఎన్నికలలో ముందుకు కదలాల్సిన అవసరం ఉంది.
జూకంటి జగన్నాథం
94410 78095