వసంత జీవన మాధుర్య మెరుగక
ఇంటర్నెట్లు క్లబ్బులు పబ్బుల్లో
వలపు మబ్బులే వసంతం అనుకొని
నవ జవ్వన కోయిలలై కూస్తున్నారు
ఆ యవ్వన వనాల్లో
పగలు రాత్రులు లేని స్వర్గ లోకాలు
సృష్టించుకుని
దివ్యానుభూతులు పొందుతున్నారు!
వలపు మబ్బులు వర్షించక
నవ్వుల పువ్వులు పరిమళించక
ఎందరో అమాయక వరూధినిలు
మాయ ప్రవరాఖ్యుల చేత చిక్కి
వెక్కి వెక్కి రోధిస్తున్నారు!
ఆధునిక భ్రమల్లో
దారము తెగిన గాలిపటంలా
దారి తెలియని అష్టరాయిడ్స్ లా
సారథ్యం తెలియని పూల రథాలెక్కి
బస్మాసుర హస్తాల్లో చిక్కి
భస్మం అయిపోతున్నారు!
గాలి మేడలు కట్టి
తెలియని రహదారులు పట్టి
ఆదర్శాలు ఆవిరి అయిపోతే
కళ్ళు తెరిపించే వాలంటైన్స్ లేరు
కనువిప్పు కలిగిన దుష్యంతులు కరువు!
అరువిస్తే రాని యవ్వనాలు
గాలించినా కానరాని ఆదర్శాలు
పారని శాపాలు విమోచనాలు !
కచ దేవయాని కాలం కాదు!
ప్రేమికుల్లారా తస్మాత్ జాగ్రత్త!
(వాలెంటైన్స్ డే సందర్భంగా)
పి.బక్కారెడ్డి
97053 15250