నానాటికీ కుదేలవుతోంది
తెలంగాణ తల్లిపాల భాష
మట్టి పరిమళాల యాస!
తన్లాడుతోంది పానం
పరభాషా తాకిడికి రెపరెపలాడుతున్న
దీపమోలే దీనమైన స్థితిలో
దిక్కుతోచకుండా ఉన్న
మాతృభాష వైనం చూసి!
దునియాలో అగ్రసనాధిపత్యంగా
విలసిల్లింది ఒకనాడు
వినసొంపైన పదాలతో
కనువిందు చేసింది ఆనాడు!
శ్రీకృష్ణదేవరాయల వారిచే
లెస్సగా పొగడబడ్డ భాష,
వేద వేదాంగాల
విరచితమై నన్నయ, పెద్దన,
పోతన, వేమన చేతులలో
శతకాల వానచే
తడిచింది ఒకనాడు!
శరత్కాల వానను
తలపించిందానాడు!
నాద సౌందర్యంతో వినసొంపుగా
నిలిచింది.. పురాతన వారసత్వ
సంపద్విలసితమై వినుతికెక్కింది!
భాషావేత్తలకు అక్షయపాత్రై నిలిచింది.
సువిశాల భారతావనికి
మణికిరీటమై మెరిసింది!
ప్రపంచీకరణ పరవళ్లకు
తెనుంగుదనం పల్లేరుకాయల్ల
బొర్లించినట్లు కకావికలం అయింది
కన్నీటి పర్యంతమై
కాటికి కాళ్లు చాపుతోంది!
కనుమరుగవుతున్న తెలంగాణ భాషను
ఇకనైనా యాది మరవకుండా
ప్రాణాలతో పట్టుకుందాం!
తండ్లాడకుండా ఒడుపుగా
పట్టుకొని ఒడిసిపోకుండా కాపాడుకుందాం!
- డా. శైలజ మామిడాల
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రంగశాయిపేట