బాల్యం మళ్లీ వస్తే బాగుండు!

Poem

Update: 2024-06-25 00:30 GMT

నా బాల్యం

మళ్లీ మళ్లీ గుర్తొస్తుంది..

పదే పదే యాదికి వస్తుంది.

యాభై ఏళ్లు వెనక్కి వెళితే

నా జ్ఞాపకాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నయి.

అక్షరాభ్యాసం చేసింది మొదలు

అన్నీ ఇతిమిద్ధంగా గుర్తులేకున్నా..

అందరిలో ఒకడిగా ఆడుకున్న

రోజులు అబ్బురమనిపిస్తూంది..

పెందలాడి లేచి అమ్మకు

బావి నుండి నీళ్లు చేదిపెట్టి

గబగబా తయారయ్యి

పుస్తకాల సంచి చేతబట్టి

బడికి పరిగెత్తిన రోజులు

భలే భలే అనిపిస్తున్నయి..

తెల్ల చొక్కా ఖాకీ నిక్కరు

నాకెప్పుడూ బోరు రాలేదు

శనివారం రోజు సివిల్ డ్రెస్

నాకెప్పుడూ జోరు పెంచలేదు.

పంతులు చెప్పే పాఠాలు

ఏనాడు బోరు కొట్టలేదు..

వర్షంలో తడుస్తూ

వీధుల్లో ఆనకట్టలు కట్టి

ఇసుకలో పిచ్చుక గూళ్లు కట్టి

సివిల్ ఇంజనీర్‌లా

ఆనందపడ్డ అద్భుత క్షణాలు

మళ్లీ వస్తే బాగుండు అనిపిస్తుంది..

అగ్గిపెట్టెలతో మోటారు కార్లు

సిగరెట్ల పాకెట్ ముక్కలతో

పేక ముక్కలు

కాలిపోయిన కరెంటు బుగ్గతో

తెగిన సినిమా రీళ్ళతో

గోడ మీద ప్రదర్శనలు..

పాడైన సైకిల్ టైర్లతో

లేదంటే ఇనుప చక్రంతో

వీధుల్లో తిరుగుతూ..

వీధి వీధి నాదే బ్రదర్

కల్మషం లేని స్నేహానికి

హద్దులే లేవు ఆనాడు..

పొట్టి లాగుతో

గంటకు పావలా పెట్టి

సైకిల్ కాంచి తొక్కుతూ

ఊరంతా బలాదూర్

16 ఎం ఎం సినిమా అంగట్లో

ఓపెన్ థియేటర్లో చూడడం

భలే భలే ఇష్టం ..

పదో తరగతి ఫస్ట్ అంటే

పండగే ఊరంతా..

కాలేజీ చదువంటే

ఉద్యోగం వచ్చినట్టే..

వంద ఫోన్ నంబర్లను అవలీలగా

గుర్తుపెట్టుకునే నాటి తరం..

వంటికి మేధకు పదును

పెట్టని నేటి తరం..

అంతర్జాలమే అన్నిటికీ దిక్కు నేడు.

రెక్కలు ముక్కలు చేసుకుని

ఆరోగ్యంగా ఉన్న నాటి తరం

కొవ్వు కరిగించుకోడానికి

జిమ్ముల్ల కుస్తీ పట్టే నేటి తరం.

అవసరం కొద్దీ సైకిల్ ఆనాడు

ఆరోగ్యం కోసం సైకిల్ ఈనాడు..

మొబైల్ ఫోన్ లేని నాటి తరానికి

ఊరంతా చుట్టాలే..

ఆత్మీయపు పలకరింపులే

బడిలో చదివే వారంతా స్నేహితులే

చదువు చెప్పే పంతుల్లంతా దేవుళ్లే..

ఫేస్ బుక్ లేని నాటి తరానికి

ఇరుగు పొరుగుతో కబుర్లే

ఇంటిల్లిపాదికి ఇష్టాలు..

కష్టాల్లో వారే ఆపద్బాంధవులు..

వాట్సాప్ లేని మా తరానికి

ఉత్తరాలే ప్రత్యుత్తర సమాధానాలు

ఏ సాంకేతికత లేకున్నా

ఎంతో ఆనందంగా గడిపిన ఆ రోజులు..

నిర్మలమైన ఆకాశంలో

చుక్కల్లెక్కెట్టుకుంటూ..

రేడియోలో

వివిధ భారతి పాటలు వింటూ

హాయిగా నిద్రపోయిన

ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండు..

కాలచక్రం ఒక్కసారిగా వెనక్కి

తిరిగి బడి బాట పడితే బాగుండు..

ఈ యాంత్రిక ప్రపంచం మాయమై

నా బాల్యం మళ్లీ వస్తే బాగుండు..

ఈ మనీ ప్రపంచంలో మరమనిషిలా కాక

మనుష్యుల మధ్య ఓ మనిషిగా బతికేస్తా..

శిరందాస్ శ్రీనివాస్

94416 73339

Tags:    

Similar News