ఏ అర్థరాత్రి మొదలైందో అందమైన వాన...
తెల్లవారుతున్నా కురుస్తూ, మురిపిస్తోంది
ఆమె తెల్లవారుజామున నాలుగింటికి
లేచింది, దంత ధావనం ముగించి,
ఆ వీధి నుంచి ఈ వీధికి విస్తరించిన
రైలుపెట్టేల పాతింటిని ఆణువణువు
శోధించి శుభ్రం చేసింది. స్నానించి వచ్చాక
ఆమె వంటిల్లు అగరొత్తుల పరిమళంతో గుబాళించింది.
ముందు గదిలో టీ. వీ. మోత,
మధ్య గదిలో పిల్లల కేకలు,
వెనక వైపు వర్షం హోరులో
వంటింట్లో దేవుడికే కాదు తనకే
అర్థం కాని పూజను ముగించింది
ఒక పక్క పిల్లలకి పాలు, మరో పక్క వంట,
మధ్య మధ్యలో సింకులో గిన్నెల ప్రక్షాళన,
ఇంకో పక్క వాషింగ్ మిషన్..
అష్టావధానం చేస్తూ, ఆ ఇరుకు వీలులో
వర్షాన్ని ఆస్వాదిస్తూ, మధ్యమధ్యలో
టీ చుక్కలను నోట్లో పోసుకుంటూ
స్టీలు సామాను కొట్టులా భోజనాలు
సర్దిన డబ్బాలను టేబుల్ మీదకు చేర్చింది
అందర్నీ బైటకి పంపి, నైటీ లోంచి ఎదురుగా
కనిపించిన చీరలోకి మారి,
కనిపించని కళ్ళజోడును వెతుక్కుంటూ,
ఆగని వర్షాన్ని తిట్టుకుంటూ,
తన తోడు నీడ గొడుగును
పట్టుకుని బైటకు నడిచింది.
వర్షం ఎవరి కోసం ఆగదు.
ఎవరూ వర్షం కోసం ఆగరు
చిన్న చిన్న పిల్ల కాలువలు,
వైతరణి నదులు ఈదుకుంటూ
ఆమె బడికి చేరుకొని,
మనసు లేని పాఠాలను,
జీతం మీద మనసుతో చెప్పి వచ్చింది.
ఇంటి గుమ్మంలోనే బొడ్లో చీర దోపి
తన కోసం ప్రేమగా ఎదురు చూస్తున్న
వంటింట్లోకి చొరబడి,
వర్షపు ఆనవాయితీని పాటిస్తూ
వేడి వేడి పకోడీలను
భర్త, పిల్లలకు అందిస్తూ
కాగితపు పడవలు, వానా వానా వల్లప్ప
ఆటల బాల్యపు వర్షానందాన్ని
నెమరు వేసుకుంటుంటే
ఆకాశంలో మెరుపులు,
ఆమె పెదవులపై చిరు దరహాసం
ఒకేసారి తళుక్కున మెరిసి
అలసటను మాయం చేసేసాయి
- డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి
63027 38678