పట్టాలకెప్పుడూ
నిజానికి కునుకే పట్టదు
తమ భుజాలపైన ఆశల మూటల్ని
సజావుగా దరికి చేర్చేదాకా
దిగాలుగానే ఉంటాయి
మానవ తప్పిదమో
హీనుల కుత్సితమో
వేల గూళ్ళని ఒక్కవేటున
నేలమట్టం చేసినప్పుడు
కలల దేహాల్ని శకలాలుగా
తమ పైకి విసిరేసినపుడు
పట్టాల గుండె కోత
ఓ పట్టాన అర్థం కాదు
మౌనంగా రోదిస్తాయి
చెల్లాచెదురై ధూళి పట్టిన ఆశల్ని
కన్నీళ్ళతో కడిగేస్తాయి
విరిగిన ఆ లోహపు మనసుకి
మిగిలిన ఊరట ఒకటే
పరిచయమైనా లేని ఆర్తులకు
చేయందించగ.. పరుగున వచ్చిన
మానవ ప్రవాహాన్ని గాంచినపుడే.
మానవతా పరిమళాలు తాకినపుడే.
- డా. డి.వి.జి.శంకరరావు
94408 36931.