వారం వారం మంచి పద్యం: రీతి

poem

Update: 2023-05-28 18:45 GMT

కాఫీ తాగుతూ కూర్చున్న మాతో బుంగి ఇలా చెప్పాడు. ‘బహుశా నాకప్పుడు ఆరేళ్ళనుకుంటాను. వేసవి సెలవులు. పగలు అన్నం తిన్నాక కాసేపటికి మా ఇంట్లో రామాయణ పారాయణం జరిగేది. మా నాయనమ్మ పక్కన కూర్చొని వినేవాడిని. వచనం చక్కగా ఒంటపట్టేది. నాకు శ్రద్ధ పెరిగింది. అందరికంటే ముందే వచ్చి కూర్చునే వాడిని. నాయనమ్మ నా వీపుపై తట్టుతూ ప్రోత్సహించేది. ఆ రోజు హనుమంతుడు సముద్రం దాటే ఘట్టం వినిపించారు. వెళ్ళేది రాక్షసుల లంకకు. దాటేది ఆకాశమార్గాన సముద్రం. తెలియని సీమలో సీతను వెతకడం. ఇదంతా అర్థమయ్యేసరికి భయము, బాధ కలిగాయి. సాధించగలడా, సాధ్యమా అనే అనుమానాలు కలిగాయి. ఆంజనేయుడిపై అభిమానము, ఆత్మీయత ఏకకాలంలో కలిగాయి. సముద్రం దాటడం, లంఖిణి మరణం, ఫలించిన సీతాన్వేషణ ఘట్టాలు ముగిసాయి. మారుతి అభిమాన నాయకుడయ్యాడు. అణువణువునా నాలో నిండిపోయాడు. ఆరాధ్యుడయ్యాడు. ఆనాటి పారాయణం ముగిసింది. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా? ఎప్పుడు కథ మొదలవుతుందా అనే ఆలోచనతోనే కాలం గడిచింది. ఆ క్షణం రానే వచ్చింది. పారాయణం మొదలయింది. రాక్షసులను వధిస్తూ సాగుతున్న జితేంద్రియుడు నాలో ఆనందాన్ని నింపాడు. కుప్పలు కుప్పలుగా వచ్చి వానరయోధుణ్ణి చుట్టుముట్టి బంధించిన రాక్షసుల నీతి నచ్చలేదు. తెలియని వణుకు ప్రవేశించింది. బంధితుణ్ణి రాజు వద్దకు తీసికెళ్ళాడు. వాయుపుత్రునితో రావణుడు చర్చలు జరిపాడు. రాజుకు ఇతని వాక్కులు గాలిమాటలుగా వినిపించాయి. ఇతని చేష్టలు కుప్పిగంతులుగా తోచాయి. జరిగిన మారణకాండకు కోపించిన రాజు ‘కోతితోక’కు నిప్పుపెట్టమని ఆజ్ఞాపించాడు. తోకకు నిప్పంటించాడు. భగభగ మంటలు రేగాయి. అది వింటూనే నాలో విపరీతమైన దుఃఖం కట్టలు తెంచుకుంది. హన్మంతుడు చనిపోతాడేమోననిపించి ఏడ్వసాగాను. నా ఏడుపు చూసి చదివే అతను ఆగిపోయాడు’.

‘ఇంతకీ నీవు ఇప్పుడు ఏం చెప్పదలచుకున్నావు’ అడిగాను బుంగిని. 'స్పందించే హృదయం గల మనిషిని కథ సంస్కరిస్తుంది. సమాజ మార్పుకు దోహదపడుతుంది' అన్నాడు బుంగి.

కధలు తెచ్చును మార్పును ఖచ్చితముగా

ఎదుటి వారల మనసులు ఎరిగి తెలిసి

రీతి తెలిసిన కధనమ్ము కొత్తకాదు

కశప చెప్పిన కధనమ్ము కాంతి పథము.


డా. బి.వి.ఎన్ స్వామి

92478 17732

Tags:    

Similar News