బీహార్ రిజర్వేషన్లపై కోర్టు తీర్పు సామాజిక న్యాయ విరుద్ధం!

దేశ చరిత్రలోనే మొదటిసారిగా.. బిహార్‌లోని నితీష్ కుమార్ - తేజస్వి యాదవ్‌ల సంకీర్ణ ప్రభుత్వం 2022లో రాష్ట్రస్థాయిలో కుల

Update: 2024-07-30 05:50 GMT

దేశ చరిత్రలోనే మొదటిసారిగా.. బిహార్‌లోని నితీష్ కుమార్ - తేజస్వి యాదవ్‌ల సంకీర్ణ ప్రభుత్వం 2022లో రాష్ట్రస్థాయిలో కుల జనగణన చేపట్టింది. సదరు సర్వేలో తేలిన అంశాల నేపథ్యంలో.. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల రిజర్వేషన్ల శాతాన్ని 65 శాతానికి పెంచుతూ చట్టం చేసింది. రిజర్వేషన్ వ్యతిరేకులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో కేసు వేశారు. తాజాగా.. మొన్నటి జూన్ 20న తీర్పునిచ్చిన పాట్నా హైకోర్టు.. సదరు రిజర్వేషన్ల పెంపును కొట్టివేసింది. వేల సంవత్సరాల వివక్షకు గురైన వర్గాలకు సమన్యాయం అందించాలనే అంశం ముందుకు వచ్చినప్పుడు మాత్రమే.. పరిమితి.. ప్రతిభ అనేవి పెద్దలకు గుర్తుకొస్తుంటాయి! ఏదేమైనా.. సామాజిక న్యాయం ఈ దేశపు బిడ్డలకు ఇంకా అందని ద్రాక్ష గానే మిగిలి ఉన్నది!

దేశంలో మెజార్టీ వర్గమైన బీసీ వర్గాల జనగణన చేపట్టాలని, జనాభాకి అనుగుణంగా సమాజ సంపదలో న్యాయమైన వాటా అందించాలనే డిమాండ్‌కు అర్థశతాబ్దపు చరిత్ర ఉన్నది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 2014 ఎన్నికలకు ముందు బీసీ జనగణ చేపడతామని హామీ ఇచ్చి, ఆ పిదప.. అగ్రవర్ణాల ఒత్తిళ్లకు తలొగ్గి ఆ అంశంపై వెనక్కి తగ్గింది. కానీ దేశ చరిత్రలోనే మొదటిసారిగా.. బిహార్‌ ప్రభుత్వం 2022లో రాష్ట్రస్థాయిలో కుల జనగణన చేపట్టింది. ఆ సర్వేలో తేలిన అంశాల నేపథ్యంలో.. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల రిజర్వేషన్ల శాతాన్ని 65 శాతానికి పెంచుతూ చట్టం చేసింది.

సమ ప్రాతినిధ్యం దక్కాలనీ..

అయితే రిజర్వేషన్ వ్యతిరేకులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో కేసు వేశారు. తాజాగా.. మొన్నటి జూన్ 20న తీర్పునిచ్చిన పాట్నా హైకోర్టు.. సదరు రిజర్వేషన్ల పెంపును కొట్టివేసింది. తమకు దక్కాల్సిన సామాజిక న్యాయం దక్కుతుందని దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మెజార్టీ వర్గాలను పాట్నా హైకోర్టు తీర్పు నిరాశకు గురిచేసింది. పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పు.. భారత రాజ్యాంగం నిర్దేశించిన సామాజిక న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా నిలబడిందన్నది సుస్పష్టం. 1980లో వెలుగు చూసిన మండల్ కమిషన్ నివేదిక.. ఎస్సీ, ఎస్టీల లాగా.. ఇతర వెనుకబడిన తరగతుల వారు సైతం అనేక రకాల వివక్షకు గురవుతున్నారని, ఆ వర్గాలకు విద్యావకాశాల్లో, ప్రభుత్వ ఉద్యోగాలలో సమ ప్రాతినిధ్యం ఇంకా దక్కలేదని తేల్చి చెప్పింది. 1990లో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ నివేదికని ఆమోదించడంతో పాటు, బీసీ వర్గాలకు విద్యావకాశాలు, ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్స్ సౌకర్యం కల్పించింది. ఈ నివేదికలో.. జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్ పరిమాణం ఉండాలని తేల్చిచెప్పి, తాజా లెక్కలు లేవు కాబట్టి.. 1931 నాటి జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకుని బీసీ రిజర్వేషన్లను 27 శాతంగా నిర్ణయించింది. బీసీల రిజర్వేషన్ సక్రమంగా అమలు కావాలంటే రాబోయే జనాభా లెక్కల్లో విధిగా బీసీ వర్గాల జనాభా లెక్కలు సైతం సేకరించాలని సిఫార్సు చేసింది.

రాజ్యాంగంలో లేని నిబంధన!

ఇందుకు అనుగుణంగా బిహార్ ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో కులాల వారీ జనగణన చేపట్టి తదనుగుణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకి సమ ప్రాతినిధ్యం అందించే దిశలో రిజర్వేషన్ల పెంపుకు పూనుకున్నది. అన్ని వర్గాల రిజర్వేషన్లు కలిపి 50 శాతానికి మించకూడదంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకించిన పాట్నా హైకోర్టు.. 50 శాతం పరిమితి దాటినందున రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది. బిహార్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సమానతా సూత్రాలకు సైతం విరుద్ధమంటూ న్యాయమూర్తులు పేర్కొన్నారు. నిజానికి ఈ 50 శాతం పరిమితి అనేది రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనబడలేదు. కేవలం 1992లో సుప్రీంకోర్టు వెలువరించిన ఇంద్రా సాహ్నీ తీర్పులో.. రిజర్వేషన్లకు 50 శాతం పరిమితి ఉండాలంటూ మొదటిసారిగా ప్రస్తావించింది. 1985లో వెలువడిన కె.సి. వసంత్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక తీర్పులో భాగంగా జస్టిస్ చిన్నప్పరెడ్డి ప్రతిభ పేరుతో అగ్రవర్ణాలు రచించే కుట్రలను ఎండగట్టారు. రిజర్వేషన్ ద్వారా ఉద్యోగంలో చేరిన వారు సమర్థంగా పనిచేయలేరన్నది ఒక తప్పుడు ఊహ మాత్రమే. తమకే పరిమితమైన ఒక పవిత్రపు ఆవరణలోకి ఇతరులు ప్రవేశిస్తే కలుషితమవుతుందంటూ స్వార్థపర వర్గాలు ప్రచారంలో పెడుతున్న ఒక దుర్మార్గపు ఆలోచన మాత్రమే అది. రిజర్వేషన్ల పరిమితి 50 శాతానికి మించితే ప్రతిభ దెబ్బతింటుందనడానికి సైతం ఎలాంటి శాస్త్రీయ ప్రాతిపదిక లేదు! అంటూ తేల్చేసాడాయన.

ఎప్పుడో 50 శాతం దాటేసింది!

ఆర్టికల్ 16 ప్రకారం.. తగిన ప్రాతినిధ్యం లేని వెనుకబడిన తరగతి పౌరుల నియామకాల కోసం రిజర్వేషన్ నిబంధనను రాజ్యం రూపొందించాలి. 78 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత సైతం వెనుకబడిన తరగతులకు ఇంకా ప్రభుత్వ ఉద్యోగాల్లో తగిన ప్రాతినిధ్యం లేదన్నది సుస్పష్టం. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు 90 మంది ఉంటే అందులో కేవలం ముగ్గురే ఓబీసీలు ఉన్నారని పోయిన ఏడాది సెప్టెంబర్‌లో పార్లమెంటులో ఇవ్వబడిన సమాచారం తేల్చి చెప్పింది. స్వార్థపర వర్గాలు అమలుపరిచిన అమానుష కులవివక్ష కారణంగా వెనుకకు నెట్టివేయబడిన వర్గాలకు నేటికీ తగిన పాతినిధ్యం లేదనడానికి.. వారి న్యాయమైన వాటా వారికి దక్కడం లేదనడానికి ఇంతకు మించిన దాఖలా ఏమున్నది. ఈ మధ్యనే వెలువడిన వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్ సంస్థ వెలువరించిన నివేదిక ప్రకారం.. భారతదేశంలోని శతకోటీశ్వరుల్లో 90 శాతం మంది అగ్రవర్ణాల వారే ఉన్నారు. దురదృష్టవశాత్తూ.. ఈ చేదు వాస్తవాలేవీ తీర్పులచ్చే పెద్దలకు కనిపించడం లేదు. 2019లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్రవర్ణ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ద్వారా 50% పరిమితి ఎప్పుడో ఉల్లంఘించబడింది. అంతకు ముందు 49.5%గా ఉన్న రిజర్వేషన్లు.. ఈడబ్ల్యూఎస్‌తో కలిపి 59.5 శాతానికి చేరింది. ఆ అగ్రవర్ణ రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధమేనంటూ తీర్పులిచ్చిన న్యాయమూర్తులకు.. 50% పరిమితి గుర్తుకు రాలేదు. వేల సంవత్సరాల వివక్షకు గురైన వర్గాలకు సమన్యాయం అందించాలనే అంశం ముందుకు వచ్చినప్పుడు మాత్రమే.. పరిమితి.. ప్రతిభ అనేవి పెద్దలకు గుర్తుకొస్తుంటాయి! ఏదేమైనా.. సామాజిక న్యాయం ఈ దేశపు బిడ్డలకు ఇంకా అందని ద్రాక్ష గానే మిగిలి ఉన్నది! సమభావం, సౌభ్రాత్రం, పునాదులై ఇల్లు లేచి, జనావళికి శుభం పూసే రోజు కోసం నిరీక్షణ ఇంకా కొనసాగుతూనే ఉన్నది!

ఆర్. రాజేశమ్,

కన్వీనర్, సామాజిక న్యాయ వేదిక,

94404 43183

Tags:    

Similar News