అభిప్రాయం

తెలంగాణలో ఉన్న జనగామ జిల్లా పేరు మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Update: 2024-07-08 23:04 GMT

జిల్లాల పేర్లు మార్చడం అంటే... తేనె తుట్టెను కదిపినట్లే

తెలంగాణలో ఉన్న జనగామ జిల్లా పేరు మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. జనగామకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని వివిధ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయని, దానికనుగుణంగా పేరు మార్పు చేస్తామని ప్రభుత్వం హామీలు ఇవ్వడం జరిగిందని వార్తలొస్తున్నాయి. అయితే ఎంతో ఘన చరిత్ర ఉన్న జనగామకు ఒక యోధుడి పేరు పెట్టి ఎంతోమంది జిల్లాకు చెందిన యోధులను విస్మరించడం సరైంది కాదు. జనగామ జిల్లాలో పుట్టిన బమ్మెర పోతన, పాల్కురికి సోమనాథుడు, తెలంగాణ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య, వీరనారి చాకలి ఐలమ్మ, బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న, గౌడ్ షేక్ బంధవి, ఒగ్గు కథ పితామహుడు చుక్క సత్తయ్య లాంటి ఎందరో చరిత్రకారులు గుర్తుకు వస్తారు. ఇలాంటి నేపథ్యం ఉన్న జిల్లాకు ఏ ఒక్క పేరులో పెట్టి మిగతా యోధులను అవమానపరచవద్దని ప్రజాభిప్రాయం.

జనగామ చరిత్ర

11వ శతాబ్దంలో కళ్యాణ చాళుక్యుల రెండవ రాజధాని ప్రాంతం జనగామ. 50 సంవత్సరాల పాలన తర్వాత ఈ ప్రాంతం 1195-1323 వరకు కాకతీయ రాజవంశం పాలనలో ఉండేది. జనగామ ప్రాంతం భోనాగిర్ పరిపాలన ప్రాంతంలో ఉండేది. జనగామను 1854 పటంలో జుంగావ్ అని పేర్కొన్నారు. 1866లో దీనిని బోనాగిర్ సర్కార్ నుండి వరంగల్ జిల్లాకు బదిలీ చేయడం జరిగింది. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు వరంగల్ జిల్లాలో జనగామ ఒక భాగం. జనగాం అనే పేరు జైనగావ్ నుండి ఉద్భవించింది. దీని అర్థం జైనులు నివసించే గ్రామం. ఈ జిల్లా యాదాద్రి, భువనగిరి, సిద్దిపేట, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాలతో సరిహద్దులను పంచుకుంటుంది. తెలంగాణ రైతంగ సాయుధ పోరాటానికి వేదికగా నక్సల్స్ ఉద్యమానికి వెన్నుదన్నుగా ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమానికి ముహూర్తంగా నిలిచిన ఘనచరిత్ర జనగామది.

మరో జలియన్ వాలాబాగ్‌గా పేరుగాంచిన వీర బైరంపల్లి హస్తకళలకు విశ్వ విఖ్యాతి గాంచిన పెంబర్తి గ్రామం జనగామ ప్రాంతానివే. బమ్మెర పోతన, పాల్కురికి సోమనాథుడు, తెలంగాణ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య, వీరనారి చాకలి ఐలమ్మ, బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న, గౌడ్ షేక్ బంధవి, ఒగ్గు కథ పితామహుడు చుక్క సత్తయ్య వంటి ఎంతో మంది మహనీయులు జన్మించిన నేల జనగామ ప్రాంతం కావున ఎవరి పోరాటాలను తక్కువ చేయకుండా ఒకరు పేరు పెట్టి మరొకరిని విస్మరించరాదు. కాబట్టి జనగామ పేరును మార్చి చారిత్రక తప్పిదం చేయరాదు.

ఈ మధ్యకాలంలో ములుగు జిల్లాను సమ్మక్క సారక్క జిల్లాగా మార్చాలని డిమాండ్ కూడా వస్తోంది. అదేవిధంగా జిల్లాల పేర్లు మార్పు చేయవలసి వస్తే ఆదిలాబాద్‌ను ఏదిలాపురంగా, నిజామాబాద్‌ను హింద్‌బాద్గార, జహీరాబాద్ ను పెద్దెక్కిలిగా, కరీంనగర్‌ను ఎలగందలగా, సికింద్రాబాద్‌ను లష్కర్‌గా, మహబూబ్ నగర్‌ను పాలమూరుగా, మహబూబాబాద్‌ను మానుకోటగా, వరంగల్‌ను ఓరుగల్లుగా, రంగారెడ్డిని స్వతంత్ర సమరయోధుడు పండుగ సాయన్నగా మార్చాలని ఇంతకుమునుపే వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్ చేయడం జరిగింది.

పేరు మారిస్తే అభివృద్ధి జరిగిపోతుందా?

అయితే జిల్లాల పేర్లు మార్చినంత మాత్రాన ఏమైనా ఎక్కువగా అభివృద్ధి జరుగుతుందా? కాబట్టి జిల్లాల పేర్లు మార్పు చేయకుండా ఉండాలి. ఒకవేళ చేయవలసి వస్తే అన్ని జిల్లాల నుండి పేర్ల మార్పు డిమాండ్ తెరపైకి వచ్చి ప్రజా ఉద్యమాలుగా మారే అవకాశం ఉంటుంది. ఏ జిల్లాల పేర్లూ మార్చకుండా పాత వాటిని కొనసాగిస్తే మంచిదని నా అభిప్రాయం. అదేవిధంగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలాంటి మార్పుల ప్రతిపాదనలు చేయడం అంటే ప్రజలను అయోమయానికి గురి చేయడమే అవుతుంది. పైగా పలుమార్లు జిల్లాల పేర్లు మార్చడం వలన అనేకమంది ధ్రువీకరణ పత్రాలలో జిల్లాల పేరు మార్పు చేయడంలో పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

కట్ట ప్రశాంత్ కుమార్

93932 57697


Similar News