ఓటరు చైతన్యమైతేనే…

Only if the voter is conscious...defection can be prevented!

Update: 2024-03-09 01:00 GMT

పాత తరం నాయకులు ఉన్నతమైన భావాలతో, సైద్ధాంతిక నిబద్ధతతో రాజకీయాల్లో కొనసాగారు. ఇప్పుడు ఆ పరిస్థితులు మచ్చుకైనా కనిపించడం లేదు. గతంలో పార్టీ ఫిరాయించే వారిని సమాజం చులకనగా చూసేది. కానీ ఇప్పుడు అవేమీ పట్టించుకోవడం లేదు. వారంలోపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో, రాజకీయం వాతావరణం వేడెక్కి జెండాలు, కండువాలు మారుస్తూ గోడలు దూకేస్తున్నారు. ఫిరాయించేవారికి, చేర్చుకునేవారికి ఇద్దరికీ విలువలు లేకుండా పోయాయి. గతంలో ఒకరిపై ఒకరు తీవ్రమైన విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు చేసుకున్నప్పటికీ తమ పార్టీలో చేరగానే వారు పునీతులు అవుతున్నారు. వారిని పరమ పవిత్రంగా చూస్తున్నారు.

ఎన్నికలు సమీపించే కొద్ది రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గాలి ఎటు వీస్తే అటు నాయకులు దూకుతున్నారు. రాజకీయాలు గాలివాటంగా మారిన నేపథ్యంలో సిద్ధాంతాలకు, విలువలకు స్థానం లేకుండా పోయింది. ఏదో ఒక పార్టీ తరపున టికెట్ దక్కించుకుని పోటీ చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. ప్రస్తుతం అవకాశవాదాన్నే అస్త్రంగా చేసుకుని అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అన్ని పార్టీలు ఫిరాయింపులను యథేచ్ఛగా, నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. ఇందుకు ఎవరూ అతీతులు కాదు. ఎంతో కష్టపడి, మరెంతో ఇష్టంతో గెలిపించిన తమ నాయకులు పార్టీలు ఫిరాయిస్తుంటే ప్రజలు కళ్లప్పగించి చూస్తున్నారు. అధికారమే ధ్యేయంగా ఫిరాయింపులను ప్రోత్సహించడంతో రాజకీయ స్వరూప, స్వభావాలే మారిపోతున్నాయి. వీటిని ప్రోత్సహించడంలో జాతీయ పార్టీలే ముందు వరుసలో ఉన్నాయి. ఇందులో బీజేపీ బాగా ఆరితేరింది. అభ్యర్థుల అవసరాలు, బలహీనతలే ఫిరాయింపులకు మూలం.

అభివృద్ధిని గాలికొదిలేసి..

ఎన్నికల బరిలో ప్రతిభకు, సమర్థతకు స్థానం లేకుండా పోయింది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే సామాన్యులు, స్వతంత్ర అభ్యర్థుల ఉత్సాహాన్ని ప్రస్తుత పరిస్థితులు నీరుగారుస్తున్నాయి. మన రాజ్యాంగంలో రాజకీయ అసమానతలు లేవు కానీ.. కులం, డబ్బే కొలమానాలై ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తున్నాయి. ఎన్నికలు చాలా ఖరీదైపోయాయి. పోటీ చేసే ఔత్సాహికులు ఆర్థిక అంశాల్లో వెనకడుగు వేస్తున్నారు. తగినంత ఆర్థిక స్తోమత లేకపోతే ఏ పార్టీ తరపున కనీసం టికెట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. సగటున ఒక్కో నియోజకవర్గానికి రూ.50 కోట్ల పైమాటే. రిజర్వ్ నియోజకవర్గాలకు ఇందుకు మినహాయింపేమీ లేదు. పార్లమెంట్ అభ్యర్థుల సంగతి సరేసరి. కనీసం రూ.150 కోట్లు పైమాటే. కొంతమంది అభ్యర్థులు టికెట్ తెచ్చుకునేందుకు అన్ని కోట్లు ఖర్చుపెడతాం, ఇన్ని కోట్లు ఖర్చు పెడతామంటూ పార్టీలను నమ్మించి తీరా చేతులెత్తేస్తున్నారు. దీంతో పార్టీలు కూడా అప్రమత్తమై ఏకంగా వారితో డిపాజిట్లు చేయిస్తున్నారు.

సంక్షేమ పథకాలు ఓటర్లు తమ హక్కుగా భావిస్తున్నారు. ఎవరు గెలిచినా సంక్షేమ పథకాలకు ఢోకా ఉండదనే ధీమాలో ఓటర్లు ఉన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పథకాల పేర్లు మారతాయే తప్ప వాటిని కొనసాగిస్తారని భావిస్తున్నారు. అన్ని రాజకీయ పక్షాలు కూడా అభివృద్ధిని గాలికి వదిలేసి కేవలం ఉచిత పథకాల పైనే మొగ్గు చూపుతున్నాయి. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమదృష్టితో చూసే ముఖ్యమంత్రి ఎన్నికైతే బాగుంటుందని చైతన్యవంతమైన ఓటరు ఆలోచిస్తున్నారు. అందుకు భిన్నంగా ఓటరు బలహీనతలపై మాత్రమే రాజకీయ పక్షాలు దృష్టి పెడుతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాలను అటు పార్టీలు, ఇటు ప్రజలు పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు.

కులం, డబ్బే ప్రామాణికంగా..

ఎన్నికల ప్రచారం, ఓటరు స్లిప్పుల పంపిణీ, పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్ల వరకు రోజువారీ కూలీలతోనే నడిపిస్తున్నారు. కార్పొరేట్ ఎన్నికల సంస్కృతిలో భాగంగా ఓటర్లకు అలవాటు చేసినట్లే ఆయా పార్టీల కార్యకర్తలకు కూడా అన్ని అవలక్షణాలను అలవాటు చేశారు. గతంలో ఆయా పార్టీ కార్యకర్తలే అన్ని బాధ్యతలు చూసుకుంటూ తమ తమ పార్టీ అభ్యర్థుల విజయానికి చిత్తశుద్ధితో పని చేసేవారు. అలా పనిచేసేవారు క్రమేణా అన్ని పార్టీల్లో కూడా దూరం అవుతున్నారు. ప్రతి పనికి విలువ కట్టి కొనుక్కుంటున్నారు. పని సంస్కృతికి, శ్రమకు గుర్తింపు లేకుండా పోయింది. దీంతో నాయకులు, కార్యకర్తలు అభద్రతాభావానికి లోనవుతున్నారు. ప్రజల ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా డబ్బు, కులమే ప్రామాణికంగా అభ్యర్థులను ఎంపిక చేసి వారి నెత్తిన రుద్దుతున్నారు.

ఎన్నికల వ్యాపారంలోకి పారిశ్రామికవేత్తలు ప్రవేశించి కోట్లు పెట్టుబడులుగా పెట్టి, అధికారాన్ని హస్తగతం చేసుకుని లాభాలు ఆర్జిస్తున్నారు. దీంతో రాజకీయాలు ఫక్తు వ్యాపారంగా మారిపోయాయి. గతంలో ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాల గురించి ఆలోచించేవారు. కానీ ఇప్పుడు ఓడిన, గెలిచిన పార్టీలు రెండూ నిత్యం ఎన్నికల కోణంలోనే పనిచేస్తున్నాయి. ఎంతసేపు ఓటర్లను ఎలా ప్రలోభపెట్టాలి, వారి బలహీనతలను ఎలా సొమ్ము చేసుకోవాలని ఆలోచిస్తున్నాయి.

లిస్టులనే రిగ్గింగ్ చేస్తూ..

ఎన్నికలు ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే పండుగలాగా ఓటర్లు చూస్తున్నారు. ఆ సమయంలో అందే తాత్కాలిక తాయిలాల కోసం ఎదురుచూస్తున్నారే తప్ప.. తమ భవిష్యత్ ను మార్చే ఎన్నికలుగా వాటిని చూడటం లేదు. దీంతో ఓటు అమ్మకపు వస్తువుగా మారిపోయింది. దీనికితోడు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలాంటి ఒత్తిడులకు లోనుకాకుండా ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితులు లేవు. అధికార, ధన బలం ఉన్నవారే ఎన్నికలను శాసిస్తున్నారు. స్వయంప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘాన్ని రాజ్యాంగం మనకు అందించింది. కానీ క్రమేణా అది తన స్వయంప్రతిపత్తిని కోల్పోయింది.

గతంలో ఎన్నికల సమయంలో బూతుల్లో ఓట్ల రిగ్గింగులు జరిగేవి. ఇప్పుడు ఏకంగా ఓటర్ల లిస్టులనే రిగ్గింగ్ చేస్తున్నారు. కులం, మతం, ప్రాంతం, డబ్బు అన్నింటిని ప్రయోగించడంతో ఎన్నికల వాతావరణం పూర్తిగా కలుషితమై పోయింది. ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయ రంగంలో ప్రవేశం చేసేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. దీంతో స్వచ్ఛందంగా పనిచేసే నాయకులు, కార్యకర్తలు దాదాపు అన్ని రాజకీయ పార్టీల్లో కనుమరుగై పోయారు. ఉన్నతమైన భావాలు, పారదర్శకత, జవాబుదారీతనంతో ఉండే నాయకత్వం రావాలి. తద్వారా రాజకీయాలు కార్పొరేట్ కబంధ హస్తాల్లో నుంచి బయటపడతాయి. బీటలు వారిన ప్రజాస్వామ్య సౌథం కుప్పకూలకుండా మరమ్మతులు చేసి ప్రజలే పునర్ నిర్మించాలి. ప్రతి ఎన్నికల్లో ప్రజాస్వామ్యం, ప్రజలే గెలవాలి. అందుకు ఓటర్లు విజ్ఞతను ప్రదర్శించాలి. ఓటరు చైతన్యవంతమైతే ఫిరాయింపులకు అడ్డుకట్టి పడి మంచి అభ్యర్థులను ఎన్నుకునే అవకాశం ఉంటుంది. ఎన్నికలు కూడా సజావుగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగుతాయి. మార్పు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.

మన్నవ సుబ్బారావు

99497 77727

Tags:    

Similar News