పేదల వ్యతిరేక విద్యా విధానం

NEP-2020 is an anti-poor education policy

Update: 2024-02-03 00:30 GMT

ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం- 2020 దేశాన్ని మధ్య యుగాల నాటి మూఢనమ్మకాల్లో ముంచెత్తడమే కాకుండా, విద్యను పేద విద్యార్థులకు అందకుండా చేసే కుట్రను లక్ష్యంగా కలిగి ఉంది. విద్యను మరింత కాషాయీకరణ, కార్పొరేటీకరణ చేయడానికి, విద్యార్థులు మెదళ్ళను కలుషితం చేసి, మొద్దుబార్చి సామాజిక స్పృహను దెబ్బతీయడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది.

శాస్త్ర సాంకేతిక రంగాల్లో గత వందేళ్లలో సాధించిన అభివృద్ధిని వెనక్కి కొట్టే విధంగా నూతన జాతీయ విద్యా విధానం ఉంది. అంతే కాకుండా విద్యార్థి ఉన్నత చదువులను ఎప్పుడైనా ముగించి వృత్తి విద్యలను నేర్చుకునే అవకాశం కల్పించారని అంటున్నారు. కానీ వృత్తి విద్యను నేర్చుకోవడం అంటే ఈ దేశంలో తరతరాలుగా ఉన్న కుల వ్యవస్థను మరింత స్థిరీకరించడమే. వృత్తి విద్యా ద్వారా కుల వృత్తులను ప్రోత్సహించడం అంటే కుల వ్యవస్థను కాపాడడమే. వృత్తి విద్య పేరుతో పేద బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు కింది కులాల వారిని చదువులకు దూరం చేయడమే.

తెలంగాణ లాంటి కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఇక్కడ విద్యార్థులు, యువతకు ఈ రాష్ట్రానికి అవసరమయ్యే నిర్దిష్ట విద్యా విధానం ఉండాలి. సామాజిక పోరాటాలు, ప్రజల చరిత్రలను విద్యార్థులకు యువతకు విప్పి చెప్పే విద్యా విధానం ప్రత్యేకంగా తయారు చేసుకోవాలి. కానీ గత 10 ఏండ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరించింది. బీజేపీ పార్టీతో చెట్టపట్టాలేసుకుని పని చేసింది. తమ రాజకీయ ప్రయోజనాలనే ఆశించింది. ఫలితంగా తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా బేషరతుగా వీటిని అమలు చేయడానికి పూనుకున్నది. ఈ పచ్చి అవకాశవాదం కారణంగానే బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది.

నేడు రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రాష్ట్ర స్థాయిలో నూతన విద్యా విధానం అమలును నిలిపివేయాలి. తెలంగాణ రాష్ట్రం కూడా కేరళ, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్ లాగానే వ్యవహరించాలి. తెలంగాణ రాష్ట్ర నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా విద్యా, ఉపాధి, వైద్య అవకాశాలు మరింత ప్రజలకు చేరువయ్యే విధంగా ఉండే విద్యా విధానాన్ని ప్రత్యేకంగా రూపొందించుకోవాలి. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును రద్దు చేస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. నూతన విద్యా విధానం అమలు కారణంగా చాలా తీవ్రమైన దుష్పరిణామాలు ఎదురవుతాయి. పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతారు. దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు, మేధావులు, టీచర్స్, ప్రొఫెసర్స్ అన్ని వర్గాల ప్రజలు పోరాడి నూతన జాతీయ విద్యా విధానం 2020 ను వెనక్కి కొట్టాలి. దేశ విద్యారంగాన్ని కాపాడుకోవాలి. దుర్మార్గమైన నూతన జాతీయ విద్యా విధానంకి వ్యతిరేకంగా పోరాడాలి.

( నేడు అఖిల భారత విద్యా హక్కుల వేదిక ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన)

-పి. మహేష్,

తెలంగాణ పీడీఎస్‌యు అధ్యక్షుడు

97003 46942

Tags:    

Similar News