NDA VS I.N.D.I.A: ఎవరు భయపడుతున్నారు?

NDA vs I.N.D.I.A Ready for Election battle 2024

Update: 2023-07-21 00:30 GMT

భారతదేశ రాజకీయాల్లో నూతన శకం ప్రారంభమైంది. దేశంలో ఎమర్జెన్సీ కాలంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా విపక్షాలు ఒక్కటి అయిన రోజులు ప్రస్తుతం గుర్తుకు వస్తున్నాయి. ఇప్పుడు ప్రధాని మోడీకి వ్యతిరేకంగా జట్టు కట్టారు. ఆయనను గద్దె దించడమే ధ్యేయం అంటున్నారు. దేశానికి స్వతంత్రం వచ్చిన కొత్తలో ఒక వృద్ధ మహిళ అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ కాలర్ పట్టుకుని, స్వాతంత్య్రం వచ్చింది సరే, మరి నాకేమి వచ్చింది అని అడిగిందట, అప్పుడు నెహ్రు నీకు ఒక ప్రధాన మంత్రిని కాలర్ పట్టి అడిగే హక్కు, స్వతంత్రం వచ్చిందని సమాధానమిచ్చారట. మరి ఇప్పుడు ఆ పరిస్థితి దేశంలో ఉందా?

ధీమాతో ఉన్నా.. భయమే!

ప్రజాస్వామ్యానికి మన దేశం తల్లి లాంటిది అంటారు, తండ్రి అనే అధికారం, మన దేశంలోని ప్రజాస్వామ్యాన్ని ఎలా అణిచి వేస్తుందో చూస్తున్నం. సామాన్య జనం పీఎం, సీఎంలను కాలర్ పట్టి తమ హక్కును అడగడం సంగతి పక్కన పెడితే, వారు దూరం నుంచి కనబడడమే గగనంగా ఉంది. ఈ నేపథ్యంలో అమెరికాకు మన ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళినపుడు అక్కడ ఒక మహిళా జర్నలిస్ట్ మన దేశంలో ప్రజాస్వామ్యం గురించి, ఒక సామాజిక వర్గం అణచివేత కోసం ప్రశ్నించినప్పుడు పీఎం మాట్లాడుతూ ప్రజాస్వామ్యం భారతదేశం డిఎన్ఏలో ఉందని, అన్ని సామాజిక వర్గాలకు సమాన న్యాయం ఉందని పేర్కొన్నారు. అయితే పీఎం తన తొమ్మిదేళ్ల పాలనలో ఇండియాలో ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు, అమెరికాలో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనే పరిస్థితి రావడంతో పీఎం కొంత ఇబ్బంది పడ్డారని అనక తప్పదు. ఒకవైపు మే 3 నుంచి మణిపూర్ మండిపోతుంది.. అక్కడికి నేటికీ వెళ్లకపోగా, కనీసం ఒక శాంతి సందేశం కూడా ఇవ్వలేదు. దీనిపై అసలు నోరు తెరవలేదు. దేశంలో వరదలు వచ్చి భారీగా ప్రాణ నష్టం, ఆస్తుల నష్టం జరిగింది. లక్షల కుటుంబాలు ఇల్లు విడిచి క్యాంపుల్లో ఉండే పరిస్థితి ఉంటే, ప్రధాని ఫ్రాన్స్ వెళ్లి వచ్చారు. పైగా ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తారు. ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వాములతో మీటింగ్‌లో పాల్గొన్నారు. కానీ మణిపూర్‌ని సందర్శించలేదు.

వచ్చే 2024 ఎన్నికలలోనూ గెలుపు తమదే అనే ధీమాతో పీఎం ఉన్నా, ఎక్కడో భయం విపక్షాల ఐక్య కూటమి మీద ఉంది. ఇక ఇండియా వర్సెస్ ఎన్డీఏ రాజకీయ పోరును 2024లో చూడనున్నాము. బెంగళూరులో రెండు రోజుల పాటు జరిగిన కాంగ్రెస్ సహా 26 విపక్ష నేతల కీలక సమావేశంలో ఇండియా (ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్) అని కూటమి పేరు పెట్టారు. ఈ కూటమి సమన్వయ కమిటీలో 11 మంది ఉంటారు. ఇక యూపీఏ ఉండదని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే అధికారికంగా ప్రకటించారు. తదుపరి సమావేశంను ముంబైలో ఏర్పాటు చేయనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 2024 లో ఇండియా (కూటమి) కలిసి పోటీ చేస్తుంది. బీజేపీని ఓడించడానికే తాము ఒక్కటి అయ్యామని, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం క్రేజీవాల్, శివసేన నేత మాజీ సీఎం ఉద్దవ్ థాక్రేలు పేర్కొన్నారు. ఈ మీటింగ్‌లో నేతలు అందరూ చాలా ఉత్సాహంగా కనిపించారు. ఎన్నికల్లో సీట్ల పంపిణీతో పాటు కామన్ ఎజెండా విషయంలో ముంబై సమావేశంలో నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంది. వన్ టూ వన్ బీజేపీ వర్సెస్ ఇండియా కూటమి పోటీ ఉండే అవకాశం ఉంది.

కేసుల భయం లేని కూటమి!

అయితే, ఈ కూటమి సమావేశం వల్ల బీజేపీ నేతల్లో, ముఖ్యంగా పీఎం నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా‌లలో ఆందోళన చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. అవినీతి పరులుగా చెబుతూ విపక్షాలను తూర్పారబట్టిన పీఎం నరేంద్ర మోడీ ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఎన్డిఏ భాగస్వాముల మీటింగ్‌లో అవినీతి ఆరోపణల కేసులున్న వారు ఎందరు ఉన్నారో చెప్పగలరా? పీఎం మాటలకు చేతలకు అసలు పొంతనే ఉండదు, ఇది జగమెరిగిన విషయం. ప్రధాని మోడీ గ్రాఫ్ పడిపోవడం, ఏక కాలంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరగడం కూడా ఇప్పుడు బీజేపీకి మింగుడు పడని విషయం అయిపోయింది. విపక్షాలను విమర్శించడం, టార్గెట్ చేసి నేతల గురించి మాట్లాడడం మినహా పీఎం మోడీ ఉపన్యాసంలో పంచ్ లేకుండా పోయింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, ఆ తర్వాత పార్లమెంట్‌లో అయన సభ్యత్వం రద్దు, ఇల్లు ఖాళీ చేయించడం వల్ల వంటి చర్యలు రాహుల్‌కు ప్లస్ అయ్యాయి. రాహుల్ సుప్రీంకోర్ట్‌లో పెట్టుకున్న అర్జీ మీద విచారణ ఈ నెల 21న ఉన్నది. దీంతో సుప్రీంకోర్టు మీదే అందరి దృష్టి ఉన్నది. మరోవైపు మణిపూర్‌పై పీఎం ఒక్క మాట మాట్లాడకపోవడం, అక్కడికి వెళ్ళకపోవడం, ఇదే నేపథ్యంలో మణిపూర్‌కు రాహుల్ గాంధీ వెళ్లి 36 గంటలు బాధితులతో కలిసి వారి కష్టాలు వినడంతో పాటు అతి సామాన్యుడిగా అందరితో కలిసిపోవడం పీఎం మోడీకి ఇరకాటంలో పడే మాటే వచ్చిందంటే అతిశయోక్తి కాదు. పీఎం తానాషాహీ గిరి ఆయనకు శత్రువుగా పరిణమించింది.

మొత్తానికి విపక్షాల మీటింగ్ సక్సెస్ అయ్యింది. ఇందుకు కారణాలు చాలా ఉన్నాయి. అందులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మమతా బెనర్జీ, కేజ్రీవాల్, స్టాలిన్, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, హేమంత్ సోరైన్‌లతో పాటు సీపీఎం నేత సీతారాం ఏచురి, సీపీఐ నేత డి.రాజా, పెద్ద ఎస్సెట్‌గా పేర్కొనవచ్చు. ఇంత సీన్ ఢిల్లీలో ఎన్డిఏ మీటింగ్‌కు లేదు. ఎందుకంటే ఇందులో పీఎం ఒక్కడే బిగ్ ఫిగర్ కావడమే. ఇక భవిష్యత్తులో జంకు, బొంకు లేకుండా, ఎలాంటి ఈడీ, సీబీఐ, ఐటీ కేసుల భయం లేకుండా భారత్ కూటమి బలోపేతం అయ్యే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నది! ఒక పీఎం మోడీ తప్ప ఎన్డీఏ పక్షంలో ఎవరు ఉద్దండులు లేరు. బీజేపీలో ఎవరైనా ఉన్నా మోడీ ముందు వారు లెక్కల్లోకి రారు! అయితే ఇక్కడ ఏ కూటమి జట్టు ఎవరికి భయపడుతున్నది? ఎందుకు? అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది!.

ఎండి.మునీర్

సీనియర్ జర్నలిస్ట్,విశ్లేషకులు

99518 65223

Tags:    

Similar News