ఉపాధ్యాయులు.. నవసమాజ నిర్మాతలు!

National Teachers’ Day History and Significance

Update: 2023-09-04 23:45 GMT

గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరహ, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః"

మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ, ప్రతిక్షణంలోనూ అతను ఏదో క్రొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాగి వుంటాడు. కానీ ఆ గురువుని మనమందరం ప్రత్యక్షంగా చూడగలిగేది తరగతి గదిలో విద్యనభ్యసించినప్పుడే..! ప్రతి విద్యార్థి గురువును దైవంగా భావిస్తూ.. తన భవిష్యత్తుకు ఆయన అనుభవాన్ని వారధిగా చేసుకుని ముందుకు సాగుతాడు. జీవితంలో ఎవరికీ కేటాయించనంత సమయాన్ని గురువువద్ద గడుపుతాడు. అలా తమ జీవితాలకు ఓ రూపం కల్పించి, తీర్చిదిద్దే గురువులనే ప్రత్యక్ష దైవాలుగా భావిస్తుంటారు. గురువు శిష్యులలో జ్ఞాన నిర్మాణం కావిస్తాడు. వారిలోని అజ్ఞానాన్ని తొలగిస్తాడు.

ఉపాధ్యాయ వృత్తి ఎంతో విలువైనది, ఉన్నతమైనది. ఉపాధ్యాయుల వైఖరి, ప్రవర్తన, ఆదర్శాలు సమాజానికి మార్గనిర్దేశనం చేస్తాయి. ఉపాధ్యాయులు విలువలకు ప్రాధాన్యమిచ్చి పిల్లలకు వారి సామర్థ్యాలకు అనుగుణంగా విద్యాబుద్దులు నేర్పించి వారిని సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే. ఉపాధ్యాయులుగా జీవితాన్ని ఆరంభించి ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రశంసలు అందుకున్న సర్వేపల్లి రాధాకృష్ణన్, ద్రౌపది ముర్ము వంటి వారు ఉపాధ్యాయ వర్గానికి ప్రతిరూపాలు, ఆదర్శమూర్తులు.

విలువలకు తిలోదకాలిచ్చే బోధనాలయాలు..

ఎంతో గొప్పగా ఉన్నతంగా కీర్తించబడిన ఉపాధ్యాయుల గౌరవం సమాజంలో నానాటికి దిగజారిపోతున్నది. దీనికి కొంతమంది ఉపాధ్యాయుల ప్రవర్తన, బాధ్యతరాహిత్యం కూడా కారణం. దీనికి తోడు పాలకులకు అధికారులకు టీచర్ల పట్ల ఉండే చులకన భావన, వారు అనుసరిస్తున్న విధానాలు, తల్లిదండ్రుల ప్రవర్తన, మీడియా ప్రచారాలు, సమాజ పోకడలను కారణాలుగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు చదువు అనేది విలువలతో కూడిన వ్యక్తిత్వ వికాసానికి, సమగ్ర మూర్తిమత్వ నిర్మాణానికి దోహదపడేలా ఉండేది. ఆ కాలంలో విద్యాబుద్దులు నేర్పిన ఉపాధ్యాయులకు సమాజంలో ఎంతో గౌరవం ఉండేది. ప్రస్తుత కాలంలో చదువంటే మార్కులు, ర్యాంకులు, గ్రేడుల సాధనంగా మారిపోయింది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఏమి చదివితే ఏ ఉద్యోగం వస్తుంది? ఎన్ని లక్షల రూపాయలు సంపాదన వస్తుందనే ఆలోచిస్తున్నారే తప్ప పిల్లల్లో ఎటువంటి విలువలు పెంపొందాయని, వ్యక్తిత్వ వికాసం ఏ మేరకు అభివృద్ధి చెందినదనే విషయానికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఈ విధంగా మార్కులు, ర్యాంకులు, గ్రేడులు, ఉద్యోగం లక్షల సంపాదన ధ్యేయంగా విద్యా లక్ష్యాలు మారిపోవడంతో విద్యాలయాలన్నీ క్రమంగా విలువలకు తిలోదకాలిచ్చి యాంత్రిక బోధనాలయాలుగా మారినాయనడంలో సందేహం లేదు.

ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ విద్యను అందించి భావి ఉపాధ్యాయులను తయారు చేయవలసిన కళాశాలలో కూడా మార్కులు, ర్యాంకులు, ఉద్యోగ సాధన వంటి లక్ష్యాలతో బోధన కొనసాగించడం జరుగుతున్నది. బోధనా వ్యవస్థలో టీచర్లకు సహాయ సహకారాలు అందిస్తూ విద్యాభివృద్ధికి సహకరించాల్సిన విద్యాధికారులే టీచర్లను వేలెత్తి చూపడం దురదృష్టకరం. పిల్లలకు నాణ్యమైన విలువలతో కూడిన గుణాత్మక విద్యను అందించే క్రమంలోనే టీచర్లు పనిచేస్తున్నారు. అక్కడక్కడ కొన్ని లోపాలు,వెనుకబాటుతనం ఉండవచ్చు. దానిని అధిగమించడానికి టీచర్లకు కావలసిన మద్దతు లభించడం లేదనేది వాస్తవం. మేము పిల్లల చదువు గురించి ఆలోచిస్తాం, టీచర్లు పని దొంగలు అన్నట్లుగా విద్యాశాఖాధికారుల వ్యవహార శైలి ఉన్నది. బోధనాపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీచర్లకు ఏమి అవసరమో గుర్తించకుండా అధికారులు రకరకాల బోధనా కార్యక్రమాలను రూపొందించి టీచర్ల మీదకు వదిలి పని ఒత్తిడి పెంచడంలో సఫలీకృతులయ్యారనేది నిర్వివాదాంశం.

అవార్డులలోనూ ఫైరవీలా?

ఇక పాలకులు పాఠశాల విద్యలో ఉన్న సమస్యలు,టీచర్ల సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ పాలకులు, అధికారులు తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల ఇరుసులో పడి నలిగిపోతూ కూడా ఉపాధ్యాయులు విద్యా బోధన చేస్తూ ఉండడం వారి అంకితభావానికి నిదర్శనం. ప్రతి ఏటా సెప్టెంబర్ 5 న ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించడం ఆనవాయితీగా వస్తునే ఉంది. అయితే ఉపాధ్యాయుల్లో ఉత్తములు ఎవరనేది వారి బోధనా విధానం, సమయ పాలన, పాఠశాల అభివృద్ధిలో సహకారం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అధికారులు ఎంపిక చేయాలి. కానీ నేనే ఉత్తమున్ని నాకు అవార్డు ఇవ్వండి అని దరఖాస్తు చేసుకోవడం ఎంతవరకు సమంజసమో పాలకులు, అధికారులే ఆలోచించాలి. ఉత్తముల ఎంపికలో కూడా పైరవీలతో అనర్హులకు అవార్డులు దక్కుతుండడంతో వాటిపట్ల మెజారిటీ ఉపాధ్యాయులు ఆసక్తి చూపడం లేదు. ఉపాధ్యాయులను అవహేళన చేస్తూ కొన్ని సినిమాలలో టీచర్లను కించపరుస్తూ, తక్కువ చేస్తూ చిత్రీకరిస్తూ హాస్యం రూపొందించడం వల్ల కూడా సమాజంలో ఉపాధ్యాయులు చులకన అవుతున్నారు.

పతనానికి అదే తొలిమెట్టు

అలాగే పిల్లలకు నాణ్యమైన విద్యా బోధన చేయడం ఉపాధ్యాయుల కర్తవ్యం. దానిని ఎవరూ కాదనరు. కానీ అది ఒక టీచర్ తోనే సాధ్యం కాదు. దానికి తల్లిదండ్రుల తోడ్పాటు అవసరం. పిల్లల విద్యాభ్యాసంలో తల్లిదండ్రులు భాగస్వాములవ్వాలి. అలాగే స్వచ్ఛంద సంస్థలు పిల్లలకు చదువు రావట్లేదు అంటూ సర్వేలు నిర్వహించడం కన్నా పాఠశాలల్లో టీచర్లకు అవసరమైన బోధన వనరులు సమకూర్చడంలో, మానవ వనరులను అందించడంలో తోడ్పడాలి. పిల్లలకు చదువు రాకపోవడానికి టీచర్లనే ప్రధాన దోషులుగా చేస్తూ వారిని కించపరచడం విద్యా వ్యవస్థ పతనానికి తొలిమెట్టుగా భావించాలి. ఉపాధ్యాయులకు తగిన బోధనాపరమైన స్వేచ్ఛ లేకుండా, మేము చెప్పాం మీరు అదే చేయండి అనే ఆధిపత్య ధోరణి పోవాలి. శిక్షణలు శిక్షలు కాకూడదు. సమస్యలతో సతమతమవుతూ, ఎవరి సహకారం లేకున్నా, అధికారులు రోజుకొక కొత్త కార్యక్రమం రూపొందించి తమ మీదకి వదులుతున్న అన్నింటినీ మౌనంగా భరిస్తూ పిల్లల విద్యపై చిత్తశుద్ధితో శ్రమిస్తున్న జాతి నిర్మాతలైన ఉపాధ్యాయులకు వందనాలు.

(నేడు ఉపాధ్యాయ దినోత్సవం)

- సుధాకర్ ఏ.వి

- అసోసియేట్ అధ్యక్షులు STUTS

- 90006 74747

Tags:    

Similar News