లోకేష్ - ద ట్రబుల్ షూటర్

ఒక రాజకీయ పార్టీకి వూహించని ప్రతికూల పరిస్థితి ఎదురైనప్పుడు, సంక్షోభం చుట్టుముట్టినప్పుడు, పెను సవాలులు ఎదురైనప్పుడు

Update: 2023-10-10 00:45 GMT

ఒక రాజకీయ పార్టీకి వూహించని ప్రతికూల పరిస్థితి ఎదురైనప్పుడు, సంక్షోభం చుట్టుముట్టినప్పుడు, పెను సవాలులు ఎదురైనప్పుడు నాయకుడు స్పందించే తీరు, తీసుకునే చర్యలను అనుసరించి పార్టీ శ్రేణులు, ప్రజలలో నాయకత్వంపై సానుకూలత, విశ్వాసం ఏర్పడతాయి. తద్వారా నాయకుని విలువ, గౌరవం పెరుగుతాయి. వారసత్వంగానో, అదృష్టం కలసివచ్చో అనేక మంది నాయకత్వ బాధ్యతలు చేపట్టే స్థాయికి ఎదిగినా, సంక్షోభ సమయంలో విఫలం అవుతారు. సమస్యను విభిన్న మార్గాల ద్వారా చక్కదిద్దేందుకు, కొత్త ప్రయోగాలు చేసేందుకు సంక్షోభాలు గొప్ప అవకాశాలు కల్పిస్తాయి. ఒక్క పెద్ద సంక్షోభం వారసత్వంగా వచ్చిన నాయకునికి, సంక్షోభ నాయకునికి మధ్య తేడాను బట్టబయలు చేస్తుంది. బహుముఖ విధానాల ద్వారా ఏర్పడిన ఇబ్బందులను ఎదుర్కొని, సమస్యను సానుకూలంగా పరిష్కరించడంలోనే నాయకుని వ్యూహ చాతుర్యం, సామర్థ్యం నిరూపితం అవుతుంది. అవహేళనలు ప్రశంసలుగా మారతాయి. సెప్టెంబర్ 9వ తేదీన నిరాధారమైన స్కిల్ డెవలప్మెంట్ స్కాం ఆరోపణలతో ఏపీ సీఐడీ చేసిన నారా చంద్రబాబు నాయుడు అరెస్టు వలన తెలుగుదేశం పార్టీలో ఏర్పడిన అతిపెద్ద నాయకత్వ సంక్షోభంలో అన్ని తానై నిలచి బలమైన నాయకత్వం ఇవ్వగల భవిష్యత్ నేతగా పార్టీ శ్రేణులకు భరోసా కల్పించారు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.

సంక్షోభం మలిచిన యువనేత

నిజానికి నాయకత్వ పరంగా, వ్యక్తిత్వ పరంగా గత తొమ్మిది ఏళ్లుగా వైసీపీ చేతిలో లోకేష్ గురైన అవహేళన, బాడీ షేమింగ్ తట్టుకుని నాయకునిగా నిలబడాలంటే ఎంతో దృఢమైన వ్యక్తిత్వం, మానసిక పరిపక్వత ఉంటేనే సాధ్యం అవుతుంది. రాజకీయ ప్రత్యర్థులు, వైసీపీ నాయకులు.ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి ప్రసార మాధ్యమాలలో, సామాజిక మాధ్యమాలలోనూ సకల ప్రయత్నాలు చేశారు. కానీ అపజయానికి, వ్యక్తిత్వ హననానికి లొంగకుండా స్థిరచిత్తంతో, ధృఢ సంకల్పంతో తన కార్యకలాపాలను కొనసాగించారు లోకేష్. ఎన్నికల్లో మంగళగిరిలో తనకు ఓటమి ఎదురైనా స్థైర్యం కోల్పోకుండా ప్రజలతో నిరంతర సంబంధాలు కొనసాగించి ప్రజాసేవకు గెలుపోటములు ప్రామాణికం కాదని లోకేష్ నిరూపించారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్య యాత్ర ద్వారా ప్రజలతో మమేకమౌతుంటే తాను కూడా ప్రత్యక్షంగా ప్రజల సాధకబాధకాలు తెలుసుకోవాలని, యువత ఆకాంక్షలకు రూపు తేవాలని, పార్టీ శ్రేణులకు ఉత్తేజం కల్పించాలనే లక్ష్యంతో అధినేత చంద్రబాబు, పార్టీ పెద్దల ఆమోదంతో, కుటుంబ సభ్యుల సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని సంకల్పించారు నారా లోకేష్.

జనవరి 27,2023న కుప్పం నియోజకవర్గం నుండి ఇచ్ఛాపురం వరకు 400 రోజులు 4000 కీమీ 'యువగళం' పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. తొలి నాళ్లలో యువగళం పాదయాత్రను అడ్డుకోవడానికి జగన్ రెడ్డి ప్రభుత్వం శత విధాలా ప్రయత్నించింది. పాదయాత్రలో ప్రజలకు కనబడటం కోసం లోకేష్ బల్ల ఎక్కితే దానిని కూడా పోలీసులు బలవంతంగా స్వాధీనం చేసుకున్న పరిస్థితిని ప్రజలందరు గమనించారు. యువగళం అట్టర్ ఫ్లాప్ దిశగా అడుగులు వేస్తోందని తన పత్రికలో దుష్ప్రచారం చేశారు. అడుగడుగునా ప్రభుత్వ నిర్బంధాలను అధిగమించి 'అనుమతిస్తే పాదయాత్ర లేకపోతే దండయాత్ర' అంటూ పాదయాత్ర కొనసాగించిన యువనేత వజ్ర సంకల్పానికి ప్రజలు అండగా నిలిచారు.

తనను తానూ నిరూపించుకొని..

ధీరుడి పోరాటం ముందు ప్రభుత్వం తలవంచింది, 'యువగళం ప్రజాగళం' అయ్యింది. తనను కలిసేందుకు వస్తున్న అన్ని వర్గాల ప్రజలను అక్కున చేర్చుకుంటూ, వారి సమస్యలను అవగాహన చేసుకుంటూ, సమస్యల పరిష్కారానికి భరోసా ఇస్తూ వారిలో ఆత్మస్థైర్యం నింపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ జనజీవనం ఇంతగా సంక్షుభితం కావడానికి జగన్ అసమర్థ, అరాచక పరిపాలనే కారణమని అర్ధవంతంగా ప్రజలకు వివరించడంలో సఫలీకృతం అవుతున్నారు లోకేష్. ఏ విషయాన్నైనా సమగ్రంగా అర్థం చేసుకుని స్పష్టమైన అవగాహనతో మాట్లాడుతూ, అమలు చెయ్యగల హామీలనే ఇస్తున్నారు. ప్రజా సమస్యలపై గళం ఎత్తి, ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడే తత్వంతో లోకేష్ తాను లక్ష్య సాధకుడిగా నిరూపించుకొన్నారు. రైతన్నతో లోకేష్, మహాశక్తితో లోకేష్, పల్లె ప్రగతి కోసం మీ లోకేష్, హాల్లో లోకేష్ వంటి వివిధ కార్యక్రమాల ద్వారా రైతన్నలు,మహిళలు, గ్రామీణ ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి కష్టసుఖాలు అవగాహన చేసుకుంటున్నారు. పాదయాత్ర చేస్తున్న జిల్లాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాల వారితో సమావేశమై గతంలో చంద్రబాబు ప్రభుత్వం వారి సంక్షేమం కోసం అమలు చేసిన పథకాలు గుర్తు చేసి, సంక్షేమం పేరుతో జగన్ రెడ్డి వారికి చేస్తున్న ద్రోహాన్ని వివరించి, తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడితే వారి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, సాధికారత కోసం అమలు చేయాలనుకున్న పథకాలను వారికి విశదీకరించి ఆయా వర్గాల మన్ననలు చూరగొంటున్నారు. మిషన్ రాయలసీమ పేరుతో రాయలసీమ అభివృద్ధికి తెలుగుదేశం ఏమి చేస్తుందో రాయలసీమ వాసులకు వివరించారు. రాష్ట్ర ప్రజల సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా పాటుపడతానన్న లోకేష్ వాగ్దానం ప్రజలను ఆకట్టుకొన్నది. లోకేష్ ప్రజా నాయకుడిగా గుర్తింపు తెచ్చుకొన్నారనడానికి యువగళం పాదయాత్రలో ప్రజలు అతని పట్ల చూపిస్తున్న ఆదరాభిమానాలే తార్కాణం.

కుట్రను దీటుగా ఎదుర్కొని...

నారా చంద్రబాబు నాయుడు 'భవిష్యత్తుకు గ్యారంటీ' బస్సు యాత్ర, లోకేష్ 'యువ గళం' పాదయాత్రతో ప్రజలను చైతన్య పరచడంలో సఫలం అవుతున్న సందర్భంగా తన అధికార పీఠానికి బీటలు వారుతున్నాయన్న ఆందోళనతో కుట్రలకు తెరలేపారు జగన్ రెడ్డి. ఎటువంటి అప్రజాస్వామిక విధాలనైనా అనుసరించి తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకులను నిర్బంధించి తెలుగుదేశం శ్రేణులను భయభ్రాంతులకు గురిచేయడం ద్వారా నిర్వీర్యం చేయాలని దుష్ట పథకం పన్నారు. కానీ ఇక్కడే నారా లోకేష్‌ను, టిడిపి నాయకత్వాన్ని, కార్యకర్తలను అంచనా వేయడంలో ఘోర వైఫల్యం చెందారు జగన్. అసలు స్కామే లేని ఫ్యాబ్రికేటెడ్ ' స్కిల్ డెవలప్మెంట్" కేసులో అక్రమంగా అరెస్టు చేసి చంద్రబాబును జైలుకు పంపడంతో యావత్ టీడీపీ శ్రేణులు, ప్రజాస్వామ్య వాదులు అవాక్కయ్యారు. అటువంటి క్లిష్ట తరుణంలో న్యాయపోరాటం ద్వారా తన నేతకు అండగా నిలవడానికి, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడానికి అప్పటికే 208 రోజులుగా చేస్తున్న 2818.4 కిమీ యువ గళం పాదయాత్రకు విరామం ప్రకటించి కార్యక్షేత్రంలోకి దూకారు లోకేష్. ఆధారాలు లేకుండా అన్యాయంగా చంద్రబాబుని నిందితుడిగా చేర్చారని. నిధులు ఎవరికి అందాయో నిర్ధారణ చెయ్యకుండా చంద్రబాబును దోషిగా సీఐడీ ఎలా చూపుతుందని, ప్రాథమిక ఆధారాలు ఉంటే రిమాండ్ రిపోర్టులో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. నేరస్థులు రాజ్యమేలుతున్నారని, నిజాయతీపరుని జైలు పాలు చేసి పైశాచిక ఆనందం పొందుతున్న ఏపీ సీఎం మాయోపాయాలను ప్రజలు ముక్త కంఠంతో ఖండించాలని లోకేశ్ ప్రజలకు పిలుపు ఇచ్చారు.

సమర్థ భవిష్యత్ నేత అనేలా..

జాతీయ స్థాయి కలిగిన చంద్రబాబు లాంటి నాయకుని అక్రమ కేసులతో అరెస్టు చేసిన విధానాన్ని, రాజ్యాంగ హక్కుల హననాన్ని జాతీయ మీడియాకు వివరించిన తీరుతో, అర్నాబ్ గోస్వామి, రాజ్దీప్ సర్దేశాయ్ వంటి ప్రముఖ జర్నలిస్టుల ప్రశ్నలకు నిజాయతీగా, నిక్కచ్చిగా, ఇచ్చిన సమాధానాలతో జరిగిన అన్యాయాన్ని జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రచారం చేయడంలో నిస్సందేహంగా లోకేష్ కృతకృత్యులయ్యారు. ఢిల్లీలో వివిధ పార్టీల నాయకులను కలిసి జరుగుతున్న అన్యాయాన్ని వివరించి చంద్రబాబుకు అనుకూలంగా వారి మద్దతు సాధించారు. పార్టీ ఎంపీలతో భారత రాష్ట్రపతి గారిని సైతం కలిసి చంద్రబాబు అక్రమ అరెస్టుపై వివరించారు. ప్రభుత్వ అక్రమ విధానాలకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం రూపు దిద్దుకుంటున్న ప్రమాదాన్ని గ్రహించి హైదరాబాద్‌లో, న్యూఢిల్లీలో ప్రభుత్వ ప్రోద్బలంతో సిఐడి అధికారి, ఏఏజి నిర్వహించిన పత్రికా సమావేశాలు జాతీయ స్థాయిలో నవ్వుల పాలైనాయి. చంద్రబాబు, లోకేష్ తదితర అగ్ర నాయకులను అరెస్టు చేస్తే టీడీపీ శ్రేణుల నైతిక స్థైర్యం దెబ్బతింటుందని తద్వారా తన పార్టీ లాభపడొచ్చని జగన్ వేసిన అంచనాలు లోకేష్ స్థిర చిత్తం వల్ల తలకిందులయ్యాయి. చంద్రబాబును కటకటాల వెనక్కి నెట్టి తనపై పెరుగుతున్న వ్యతిరేకతను దారి మళ్లించాలన్న జగన్ ప్లాన్ బూమెరాంగ్ అయ్యింది. చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రేరేపిత అరెస్ట్‌తో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం కొత్త శిఖరాన్ని తాకింది. అరెస్ట్ చేసిన విధానం మొత్తం భారత రాజకీయ వ్యవస్థను గందరగోళానికి గురి చేయడమే కాక, అన్ని వర్గాల ప్రజలలో ఆగ్రహాన్ని కూడా రేకెత్తించింది. ఇది ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్, పోలింగ్ సరళిలో నిర్ణయాత్మక అంశం కాగల టీడీపీ, జనసేన పొత్తు ప్రకటనను కూడా ప్రేరేపించింది. పార్టీ సంక్షోభ సమయంలో ఢిల్లీలో టీడీపీ ఎంపీ లందరిని సమన్వయం చేసుకుని ఒక వైపు లాయర్లతో సంప్రదింపులు, మరో వైపు పార్టీ ఏర్పాటు చేసిన పోలిటికల్ యాక్షన్ కమిటీతో చర్చలు, ఇంకో వైపు మీడియా సమావేశాలతో చేస్తున్న అవిశ్రాంత కృషి.. సంక్షోభ నిర్వహణలో లోకేష్ ప్రతిభను బహిర్గతం చేయడమే కాక, సుదీర్ఘ కాలం తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించగల సమర్థ భవిష్యత్ నేతను పరిచయం చేసింది.

- లింగమనేని శివరామ ప్రసాద్

79814 20543

Tags:    

Similar News