తిరిగి వెలుగొందిన నలందా వర్సిటీ!

జ్ఞానానికి పుట్టినిల్లుగా ఎన్నో ఏళ్ల పాటు ఇండియా విరాజిల్లింది. ఇక్కడ ఉన్న ఎన్నో పురాతన దేవాలయాలు, విశ్వ విద్యాలయాలు అనంతమైన

Update: 2024-08-17 00:45 GMT

జ్ఞానానికి పుట్టినిల్లుగా ఎన్నో ఏళ్ల పాటు ఇండియా విరాజిల్లింది. ఇక్కడ ఉన్న ఎన్నో పురాతన దేవాలయాలు, విశ్వ విద్యాలయాలు అనంతమైన జ్ఞానానికి ప్రతీకలు.. అలాంటి వాటిల్లో అతి ముఖ్యమైనది నలంద విశ్వవిద్యాలయం. ఆ విశ్వవిద్యాలయ గ్రంథాలయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్రీ.శ 427 సంవత్సరంలో ప్రస్తుతం - పాట్నా సమీపంలో ఈ విశ్వవిద్యాలయాన్ని కుమార గుప్తా-1 అనే రాజు కట్టించారు. ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయంగా కూడా నలంద చరిత్రలో నిలిచిపోయింది. నలంద అనేది సంస్కృతంలోని మూడు పదాల కలయిక. న, ఆలం, ద, అనే మూడు సంస్కృత పదాల ద్వారా ఆ విశ్వవిద్యాలయంకి ఆ పేరు వచ్చింది. న, ఆలం, ద.. అంటే ధారాళంగా ప్రవహిస్తున్న జ్ఞానం అని అర్థం.

ఇస్లాంకు పోటీ వస్తుందని..

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల వారు ఈ విశ్వవిద్యాలయానికి వచ్చి చదువుకునేవారు. ప్రపంచానికే సున్నాను పరిచయం చేసి, ఖగోళ రహస్యాలను ప్రపంచానికి తెలిపిన ఆర్యభట్ట లాంటి ఎంతోమంది గొప్పవాళ్లకు ఇది నిలయం. నాగార్జునాచార్యుడు ఇందులో బోధించాడు. అలాం టి ఆచార్యులు 2000 మంది ఈ విశ్వ విద్యాలయంలో ఉండేవారు. ఇస్లాం మతానికి నలంద విశ్వవిద్యలయం పోటీ గా మారుతుందని భావించడం వల్ల ఖిల్జీ అతడి అనుచరులు దీన్ని నాశనం చేశా రు. ఖిల్జీ దాడిలో జరిగిన వినాశనం తరువాత ఆరు శతాబ్దాల కాలంలో నలంద క్రమంగా మరుగున పడిపోయింది.

1812లో స్కాట్లాండ్‌కు చెందిన పురావస్తు అధ్యయనకర్త ఫ్రాన్సిస్ బుచానన్ హామిల్టన్ దీన్ని కనుగొనే వరకు ఆ గురుతులు వెలుగు చూడలేదు. భారతదేశంలోని అతి ప్రాచీనమైన విశ్వవిద్యాలయాల్లో ఒకటైన నలందా విశ్వవిద్యాల యం 1600 సంవత్సరాల తర్వాత తిరిగి ప్రారంభమైంది. గ్రంథాలయాన్ని కూడా తిరిగి పునరుద్ధరించడం జరిగింది.

90 లక్షల గ్రంథాలతో..

ఈ విశ్వవిద్యాలయంలో వైద్యం, తర్కం, గణితం నేర్చుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన పోటీ ఉండేది. దాని కోసం విద్యార్థులకు పరీక్షలు పెట్టి, మౌఖిక పరీక్షలు నిర్వహించి విశ్వవిద్యాలయంలోకి ప్రవేశం ఇచ్చేవారు. మాస్టర్స్ ప్యానెల్‌లో కౌటిల్య (అర్థశాస్త్ర రచయిత), పాణిని (సంస్కృతాన్ని నేటి రూపంలోకి క్రోడీకరించేవారు), జీవక్ (ఔషధం), విష్ణు శర్మ (పంచతంత్రం) బుద్ధ కళృతి, కాండ్రోగోథిన్, నాగార్జున, ఆర్యదేవ, వసుబంధు, అసంగ, స్థిరమతి. ధర్మపాలుడు, శిలభద్ర, శాంతిదేవ, శాంతరక్షిత, పద్మసహిబిహావ, కామశిలవంటి ప్రఖ్యాత పేర్లు ఉన్నాయి. అక్కడ ప్రవేశం పొందిన విద్యార్థులకు ధర్మ పాల, సిలభద్ర వంటి బౌద్ధ గురువుల మార్గదర్శకత్వంలో పండితుల బృందం మార్గ దర్శకత్వం వహించింది. ఇక్కడి గ్రంథాలయం ప్రపంచంలోనే పెద్ద గ్రంథాలయంగా వర్ధిల్లింది. ఈ గ్రంథా లయం తొమ్మిది మిలియన్ల కొద్దీ చేతితో రాసిన తాళపత్ర వ్రాతప్రతులకు, పుస్తకాలకు నిలయంగా ఉండేది. దీనిని 'ధర్మ గంజ్' లేదా 'సత్య పర్వతం' మౌంటైన్ ఆఫ్ ట్రూత్ అని పిలుస్తారు, ఇది బౌద్ధ విజ్ఞానపు గొప్ప సంపదగా మారింది. వీటిని మట్టి పలకలలో తాటి ఆకు పత్రాలు పాడవకుండా భద్రపరిచేవారు.

గ్రంథాలయాన్ని తగలబెట్టడానికి..

క్రీ.శ 1193లో ఈ విజ్ఞానం భారతదేశంలోని భావితరాల వారికి అందకూడదనే ఉద్దేశంతో అల్లావుద్దీన్ ఖిల్జీ నలందపై దండెత్తి ధ్వంసం చేశాడు. గ్రంథాలయంలోని లక్షలాది గ్రంథాలను, దాదాపు 90 లక్షల రాతప్రతులు, మాన్యుస్క్రిప్ట్‌ (Manuscript)లను కాల్చాడు. ఈ గ్రంథాలయాన్ని పూర్తిగా తగులబెట్టడానికి, ఆ మంటలు ఆరడానికి మూడు నెలల సమయం పట్టిందట.

డా. రవి కుమార్ చేగోని

జనరల్ సెక్రటరీ, తెలంగాణ గ్రంథాలయ సంఘం

98669 28327

Tags:    

Similar News