తెలుగు కథలలో 'అమ్మ' గొప్పదనం

Mother’s greatness in Telugu stories

Update: 2023-05-14 00:30 GMT

అనంతమైన తెలుగు సాహిత్యంలో నాటి నుండి నేటి వరకు అమ్మను గురించి రాసిన కథకులెందరో! కుటుంబంలో, సమాజంలో అమ్మ పాత్రను భిన్న కోణాలలో చిత్రించారు వీరు. సింగమనేని నారాయణ గారి 'తరగతి గదిలో తల్లి' అద్భుతమైన కథ. కొత్తగా స్కూలుకి వచ్చిన తెలుగు మాస్టారు ప్రభాకరం తరగతి గదిలో పిల్లలందరిని పరిచయం చేసుకుంటూ తెలుగు భాషను తల్లి భాష అని ఎందుకంటారో చెబుతూ క్రమంగా సమాజంలో, కుటుంబంలో తల్లి ప్రాధాన్యతను చెపుతారు. అటువంటి తల్లికి పిల్లలు ఇంటి పనులలో సాయం చేయాలనీ, ఆడపిల్లలే కాక మగపిల్లలు కూడా సాయం చేయాలనీ, అప్పుడే ఆడ, మగ సమానత్వం సాధ్యమవుతుందని చెపుతారు. ఇది చాలా గొప్ప కథ. చిన్నతనం నుంచే పిల్లలంతా అమ్మ శ్రమను పంచుకోవాలని తల్లి విలువను చాటి చెప్పే కథ.

ముదిగంటి సుజాతా రెడ్డి 'బందీ' కథ ఎగువ మధ్య తరగతికి చెందిన నేపథ్యం. కూతురు పుట్టింటికి కాన్పుకు వస్తే అమ్మకు చాకిరీ అంతా ఇంతా కాదు. కూతురు పని, ఆమెకు పుట్టిన బిడ్డల ఆలనా పాలన, ఇంకా ఇంటికి వచ్చిపోయే చుట్టాల మర్యాదలతో అమ్మ క్షణం తీరిక లేని యంత్రం అయ్యేది. మారిన పరిస్థితులు, పెంపకపు పద్ధతులు చెపుతూ కొత్త పరిస్థితుల్లో తల్లి అన్నపూర్ణ కూతురి కాన్పు కోసం అమెరికా వెళ్లి, అక్కడ కూతురింట్లో ఎలా బందీ అయిపోయిందో రచయిత్రి చెప్పారు. అప్పటివరకు రెక్కలు విప్పుకుని స్వేచ్ఛగా ఎగిరేపక్షిలా వుండే అమ్మాయికి,పెళ్లితో కొంత స్వేచ్ఛ హరించుకుపోతుంది. తల్లయ్యాక తనను తానే పిల్లలకు అంకితం చేసేసుకుంటుంది. ఈ బంధనంలో ఆమె ఆనందాన్ని పొందుతుంది. కానీ, బాధ్యతలు తీరాక, తమ జీవితాన్ని ఇష్టమొచ్చినట్లు మలచుకోగలవారెందరు? విహారి రాసిన 'దోసిట్లో నీరు' తన శేష జీవితాన్ని తన ఇష్టప్రకారం మలచుకున్న ఒక తల్లి కథ. ఆమె స్కూల్ టీచర్‌గా చేసి రిటైర్ అయ్యింది. ఆమెకు సేవా భావం ఎక్కువ. ఐదారేళ్ళ నుంచి కొడుకు భాస్కరం తనతో తల్లిని తీసుకెళ్లాలని ప్రయత్నిస్తూ విఫలమవుతున్నాడు. విరామం లేకుండా తల్లి చేసే పనులు చూసి ఆశ్చర్యపోతాడు. ఎన్ని ఇచ్చినా ఎంత చేసినా పిల్లలకు తృప్తి ఉండదు. బాధ్యతల నుంచి బైటపడి తమకు తృప్తి కలిగించే విధంగా అమ్మలు జీవితాన్ని మలచుకోవాలని ఈ కథా సందేశం.

పి. వి.బి.శ్రీరామమూర్తి రాసిన 'దేవుడు బజ్జున్నాడు' కథలో దేవుడు పిల్లాడి పేరు. స్కూల్లో మాస్టారు చెప్పిన నీతి పాఠాలకు భిన్నంగా ఇంటి వాతావరణం ఉంటే పసి మనసులో సంఘర్షణ ఎలా ఉంటుంది? ఊరి పెద్దగా ఉన్న తండ్రి, ఇరు పక్షాల దగ్గర డబ్బు తీసుకుని ఒకరి దగ్గర తీసుకోలేదని అబద్ధం చెపుతాడు. అదే సమయంలో స్కూల్లో విద్యార్థి, పక్క పిల్లాడి పుస్తకంలో పెట్టిన డబ్బులు తీసేసి, తీయలేదని అబద్ధం చెపుతాడు. దేవుడి మీద ప్రమాణం చేసి, అబద్ధం చెపితే వాళ్ళు చచ్చిపోతారని మాస్టారు చెప్పారు. నాన్న, వాసు, కిషోర్ చచ్చిపోతారా అని దేవుడు వాళ్ళ అమ్మని అడిగాడు. దేవుడున్నాడని చెప్పాలా? లేడని చెప్పాలా? లేడని చెపితే ఏ తప్పు చేయటానికి భయపడడు. దేవుడి తల్లి అలోచించి 'దేవుడు కొంత వరకు క్షమిస్తాడు. ప్రమాణాలు చేసి ఎక్కువ తప్పులు చేస్తే వాళ్ళకి జబ్బుల రూపంలో శిక్షిస్తాడు. నువ్వు మాత్రం ఎప్పుడూ తప్పులు చేయకూడదు. అబద్ధాలాడకూడదు. అప్పుడు దేవుడు నీకంతా మంచే చేస్తాడు' అని అనునయిస్తూ చెప్పింది. పిల్లల తలల్లో పుట్టే సందేహాలకు ఒక్కోసారి సమాధానం చెప్పటం చాలా కష్టం. కానీ, అమ్మ మాత్రమే సమయోచితంగా వాళ్ళ చిన్న మనసులకు హత్తుకునేలా చెప్పగలదు. అందుకే, తల్లే ప్రథమ గురువు అన్నారు.

అమ్మబరువు తగ్గిపోవటం గమనించిన ఇద్దరు కూతుళ్లు ఆమె ఆరోగ్యం కోసం తపన పడి, అమ్మను మామూలు మనిషిగా, చైతన్యవంతంగా చేసిన ఒక విలక్షణమైన కథ, గొప్ప కథ డాక్టర్ లక్ష్మీ సుహాసిని రాసిన 'మూత పడని రెప్పలు'. ఇందులో అమ్మది ఒక ప్రత్యేకమైన సమస్య. నిద్రపోలేని సమస్య. ఆమె ఆరోగ్యం బాగుపడి, నిద్రపోవటమే కాక, ఆటలలో పాల్గొనేలా అమ్మను తయారుచేయటం ఆ కూతుళ్లు సాధించిన విజయం. ఇది నిజంగా స్ఫూర్తివంతమైన కథ. తమకోసం ఎంతో చేసిన అమ్మను కాపాడుకోవటం పిల్లల కర్తవ్యం. అయితే ఇలాంటివాళ్ళు అరుదుగా ఉంటారు.

పిల్లలు, వాళ్ళ కుటుంబాలు వారికేర్పడ్డాక, వారి వ్యక్తిగత విషయాలను అమ్మతో పంచుకోరు. పెళ్లికాకముందు తన చుట్టూనే తిరుగుతూ, తనమీదే ఆధారపడిన, పిల్లలు పెళ్లయ్యాక కూడా కొత్తలో అన్నింటికీ సలహాల నడిగే పిల్లలు, తమ శక్తి ఉడిగిపోయాక విలువ తగ్గిపోవటం అమ్మలు జీర్ణించుకోలేరు. తాము పిల్లలకు భారమైనట్లు బాధపడతారు. ఆర్థిక వెసులుబాటు, పెన్షన్, ఇల్లు వంటి సౌకర్యాలున్న తల్లుల పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. ఏ విధమైన ఆధారం లేక పిల్లల మీద ఆధారపడటం తప్ప గత్యంతరం లేని ఒంటరి అమ్మల మనసుల సంఘర్షణను చిత్రించే కథలు రావాలి. కొన్ని వచ్చి ఉండవచ్చు. ఇంకా బలంగా రావాలి. సాహిత్యం పాఠకులలో ఎంతో కొంత మార్పు తెస్తుంది.

(నేడు మాతృదినోత్సవం సందర్భంగా)

డా. చెంగల్వ రామలక్ష్మి

63027 38678

Tags:    

Similar News