మోడీ ఆరాటం వారికోసమేనా?
సామాన్యుల బతుకులలో వెలుగులు తీసుకొచ్చే ప్రయత్నాలు వారికి అవసరం లేదు. దళితులపై బీజేపీ పాలిత రాష్ట్రాలలో పెరుగుతున్న దాడులు వారికి
సామాన్యుల బతుకులలో వెలుగులు తీసుకొచ్చే ప్రయత్నాలు వారికి అవసరం లేదు. దళితులపై బీజేపీ పాలిత రాష్ట్రాలలో పెరుగుతున్న దాడులు వారికి పట్టవు. ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో దళితులపై విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. అయినా అవి వారికి పట్టవు. సామాన్యుల బతుకుల కంటే, వారికి సంపన్నుల మేలే అవసరం. మోడీ సర్కారు సంపన్నుల కోసం చేసినంత గొప్ప కృషి సామాన్యుల కోసం చేయడం లేదు.
వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను మాఫీ చేసి ఆ పేద సంపన్నులను ఆదుకున్నారు. అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడే అవి ఎవరికి మేలు చేస్తున్నాయో పసిగట్టాల్సి ఉండే కానీ పసిగట్టలేకపోయాం. బీజేపీ అవినీతి అంతం అంటూ చెప్పుకొచ్చినా, అవినీతిని అంతం చేయకపోగా, బతుకులను మార్చే చర్యలు కాకుండా బీజేపీ పూర్తిగా అధికారం చుట్టే తిరుగుతోంది. ప్రభుత్వాలను పడగొట్టడం లాంటి కుట్రలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. తెలంగాణలోనూ ఎలాగైనా అధికారంలోకి రావాలనే ధ్యేయమే ఎక్కువగా కన్పిస్తున్నది. అందులో భాగంగా వలసలను ప్రోత్సహిస్తున్నది.
అందుకే ఆయన ఆదర్శం
కేసీఆర్ నాయకత్వాన్ని బదనాం చేయాలని, తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నది. అయినప్పటికీ ఉద్యమ రథసారథి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుంచేలా కృషి చేస్తున్నారు. కేసీఆర్ తీసుకునే నిర్ణయమేదైనా సంపూర్ణ సమగ్రత తో కూడుకున్నదై, గుణాత్మకత కలిగి ఉంటుంది ఆయన రాజకీయంగా ఎంతో చాణక్యతతో ఉంటారు. పోరాటంలోనూ అంతే పటిమను ప్రదర్శిస్తారు. అందుకే ఆయనంటే అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శం.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎంతటి త్యాగంతో కూడుకున్న పోరాట పటిమను చూపారో యావత్తు తెలంగాణ సమాజానికి తెలిసిందే. నాడు తెలంగాణ కోసం సుమారు 14 సంవత్సరాలు అలుపెరగని పోరాటంతో ఢిల్లీ మెడలు వంచేలా చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షను సాకారం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఇద్దరే ఎంపీలు ఉన్నప్పటికీ ఆయన పార్లమెంటులో మాట్లాడిన తీరు అమోఘం. జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వివిధ పార్టీల మద్దతును కూడగట్టడంలో విజయం సాధించారు. సబ్బండ వర్గాలను ఉద్యమంలో భాగస్వామ్యం చేయడంతో పాటు. ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమ తత్వాన్ని చూపగలిగారు.
రైతులకు భరోసా
2014లో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు, సంస్కరణలతో, దశాబ్ధాలుగా పేరుకుపోయిన సమస్యలను సక్కదిద్దుతూ పరిపాలనలో అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం అంటేనే దండగ అనే రోజుల నుంచి వ్యవసాయాన్ని పండగలా మార్చి నెర్రలు బారిన బీడు భూములన్నీ నేడు పచ్చదనాన్ని పరచుకుంటున్నాయి.
ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు సంక్షేమం కోసం సాగు కోసం మిషన్ కాకతీయలో చెరువులు తవ్వించి భూగర్భ జలాల అభివృద్ధి కి కృషి చేశారు. ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. రైతులకు పెట్టుబడి తిప్పలు, అప్పులు ఉండొద్దని పెట్టుబడి సాయం కింద ఎకరాకి ఐదు వేల చొప్పున ఖరీఫ్ యాసంగిలో అందిస్తున్నారు. అలాగే అకాల మరణాలతో ఆగమవుతున్న రైతన్నల కుటుంబాలకు భరోసాగా నిలిచేందుకు రైతు బీమా కింద 5 లక్షలు పరిహారం అందించి అండగా నిలుస్తున్నారు.
వారు ఎవరి పక్షం?
దశాబ్దాల తరబడి అన్యాయానికి గురైన నేలను అభివృద్ధి చేయడానికి బడుగు, బలహీన వర్గాల శ్రేయస్సు కోసం అనేక సంస్కరణలతో కేసీఆర్ సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తుంటే కేంద్ర బీజేపీ సర్కారు మాత్రం పన్నుల భారం మోపుతూ సామాన్యులు బతకలేని పరిస్థితుల్లోకి నెట్టింది. కార్పోరేట్‌లకు రెడ్ కార్పెట్ పరిచి వారిని మరింత సుసంపన్నులను చేస్తున్నది. చిన్న పిల్లలు కొనుగోలు చేసే చాక్లెట్ నుంచి మొదలుకొని, శవం కాలాలన్నా జీఎస్టీ కట్టాల్సిన పరిస్థితుల్లోకి తెచ్చారు. యేటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న కేంద్ర సర్కారు ఎనిమిది సంవత్సరాలలో కల్పించింది 22 లక్షలు మాత్రమే అని స్వయంగా పార్లమెంటులో ప్రకటించిన సంగతి తెలిసిందే.
దేశంలో నిరుద్యోగం, పేదరికం రోజు రోజుకు పెరిగిపోతున్నా కేంద్ర సర్కారు వాటిని నిర్మూలించడానికి చర్యలు చేపట్టడం లేదు. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళిత వర్గాలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. రాజస్తాన్‌లో ఓ బాలుడు కుండలో నీరు తాగినందుకు చావబాదగా చనిపోయిన సంగతి తెలిసిందే. గుజరాత్ లోని అత్యాచారం కేసులో నిందితులను విడుదల చేయడం కేంద్ర మోడీ సర్కారు ఎవరి పక్షమో సుస్పష్టంగా అర్థం అవుతుంది.
గుణపాఠం చెప్పాలి
తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీ కోట్ల కాంట్రాక్టులు ఇచ్చి ఉప ఎన్నికలు తెచ్చి కాంట్రాక్టు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అతి భయంకర ఫ్లోరోసిస్ రక్కసి పంజా విసిరింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2015లో మిషన్ భగీరథ ఏర్పాటు చేసి ఫ్లోరిసిస్ రక్కసిని నియంత్రించడంలో విజయం సాధించారు. అధికారాన్ని సంపూర్ణంగా వాడుకొని ప్యాకేజీలతో పార్టీ మారిన సంపన్నుడు- తెలంగాణ బతుకులు మార్చేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న తెలంగాణ అభివృద్ధి పోరాటానికి మధ్య మునుగోడు ఉప ఎన్నిక జరగనుంది. అందులో గులాబీ పార్టీ అభ్యర్థిని గెలిపించి భవిష్యత్తులో భారత్‌ను గుణాత్మకంగా తీర్చబోయేది బీఆర్‌ఎస్ అనే సత్యాన్ని చూపాల్సిన అవసరం ఉంది. కార్పొరేటు కనుసన్నల్లో నడిచే పార్టీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది.
సంపత్ గడ్డం
దళిత విద్యార్థి ఉద్యమ నాయకుడు
కామారెడ్డి
78933 03516