గాన కళకే కళ మెహ్‌దీ హసన్‌

మీ గొంతులో దేవుడు పలుకుతున్నాడు" అని మెహ్‌దీహసన్‌తో గాయని లతామంగేష్కర్ అన్నారు. "మనల్ని మనం గాయకులమనుకుంటున్నాం,‌ కానీ గాయకుడంటే మెహ్‌దీహసనే" అని గాయకుడు మన్నాడే అన్నారు.‌

Update: 2024-07-18 00:30 GMT

"మీ గొంతులో దేవుడు పలుకుతున్నాడు" అని మెహ్‌దీహసన్‌తో గాయని లతామంగేష్కర్ అన్నారు. "మనల్ని మనం గాయకులమనుకుంటున్నాం,‌ కానీ గాయకుడంటే మెహ్‌దీహసనే" అని గాయకుడు మన్నాడే అన్నారు.‌ మెహ్‌దీహసన్‌ను గాయని నూర్జహాన్ "తాన్‌సేన్" అన్నారు. వీణ మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి, వైఅలిన్ విద్వాంసుడు లాల్‌గుడి జయరామన్ వంటి కర్ణాటక సంగీత నిష్ణాతులు మెహ్‌దీహసన్‌కు ప్రత్యేకమైన స్థానాన్ని, విలువను ఇచ్చారు. కర్ణాటక‌, హిందూస్థానీ సంగీత విద్వాంసులు‌ మెహ్‌దీహసన్‌ గాత్ర, గానాలకు జోహార్లర్పించారు‌.

మహోచ్చమైన గజల్ గాయకుడు మెహ్‌దీహసన్ జయంతి ఇవాళ(18/7). సాంద్రమైన గాత్రంతో, సాంద్రమైన గానంతో మెహ్‌దీహసన్ గజల్ గానం అంతర్జాతీయంగా కొనియాడబడుతోంది. ఆయనకు ముందూ, తరువాత పలువురు గజల్ గాయకులున్నా మెహ్‌దీహసన్ మాత్రమే షహిన్‌షాహ్-ఎ-గజల్ గాయ్‌కీ.

గొప్ప గాత్రం, అతి గొప్ప గానవిధానం‌

గానకళకే కళ మెహ్‌దీహసన్. అత్యంత గొప్ప గాత్రం, అత్యంత గొప్ప గానవిధానం‌ ఆయనవి. Rounded even warm baritone with verve and clear resonance మెహ్‌దీహసన్‌ది. గాన కళ మెరుగుపడుతూ వెళ్లి ఒక ఉచ్చస్థితిని చేరుకుంటే అది మెహ్‌దీహసన్‌ గానమౌతుంది. గానంలో తనకు మునుపులేని వైశిష్ట్యం తనవల్ల తనరారేట్టు గానం చేశారు మెహ్‌దీహసన్‌. విశేషమైన ఫణితి ఆయనది. గాత్ర, గానాల్లో బిగి, పొంకం విద్వత్, మాధుర్యం వీటికి సాకారం మెహ్‌దీహసన్‌. ప్రత్యేకమైన, ప్రశస్తమైన గాన సృజనాత్మకత మెహ్‌దీహసన్‌ది.

చెట్టుపై కూర్చుని పాడుతూ..

కలావంత్ అన్న శాస్త్రీయ సంగీత కళాకారుల వంశంలో‌ 16వ తరం‌‌ మెహ్‌దీహసన్‌ది. రాజస్థాన్‌లోని లునా అనే ఊళ్లో 1927లో పుట్టారు మెహ్‌దీహసన్‌. ద్రుపద్, ఖయాల్, ఠుమ్రీ, దాద్రా‌ వంటి హిందూస్థానీ సంగీత సంప్రదాయాలను మెహ్‌దీహసన్‌ తన 8వ యేట నుంచే అభ్యసించారు. తన 20వ యేట అప్పుడు‌ ఏర్పడ్డ పాకిస్తాన్‌కు వెళ్లిపోయారు. అక్కడ ఒక సైకిల్ కొట్లోనూ, కార్ మెకానిక్ గానూ పొట్టకూటి కోసం పనిచేశారు. ఎవరూ చూడని సమయాల్లో ఏ చెట్టు పైనో కూర్చుని‌ పాడుకునే వారట. 1952లో రేడియో కరాచీలో ఠుమ్రీ గాయకుడయ్యారు. ఆపై ఆ దేశ చలన చిత్రగాయకుడు, ఉర్దూ గజల్‌ గాయకుడు అయ్యారు. గజల్ గానాన్ని విశ్వవ్యాప్తం‌ చేశారు.

అనితరసాధ్యమైన నాదం

శ్రుతికి సరైన అభివ్యక్తి మెహ్‌దీహసన్‌ నాదం. "ఆయన నాదం పెట్టుకుని తంబూరాను శ్రుతి‌ చేసుకోవచ్చు" అని సంగీత విజ్ఞులు అంటారు. మెహ్‌దీహసన్‌ నాదం స్వరంలో ఒదిగే విధానం అనితరసాధ్యం. అందువల్ల ఆయన గానంలో స్వర సమం (తాళ సమం కాదు) విశిష్టంగా ఉంటుంది. Balance, musical gap, relief-note, note-perfection ఈ నాలుగు విశేషమైన అంశాలూ మెహ్‌దీహసన్‌ గానంలో తొణికసలాడుతూ ఉంటాయి.

విశిష్టమైన గజల్ గానం

ఖయాల్, ఠుమ్రీ, దాద్రా గాన విధానాలను ఉర్దూ‌ గజల్ గానానికి ప్రాతిపదికగా చేసుకున్న తొలిదశ‌ గాయకుల్లో ఒకరు మెహ్‌దీహసన్‌. భావావిష్కరణ మనోధర్మం, ఉచ్చారణ పరంగా విశిష్టమైన గజల్ గానం మెహ్‌దీహసన్‌ గానం. "అర్‌జ్-ఎ-నియాజ్-ఎ ఇష్క్ కే కాబిల్ నహీన్..." అంటూ తొలిదశలో పాడిన గజల్ ఎంతో జనరంజకమై మెహ్‌దీహసన్‌ను ఒక గజల్ గాయకుడుగా నిలబెట్టింది. "కైసీ చుపాఉన్ రాజె గం...", "దేఖ్ తో దిల్..." , "పత్తా పత్తా బూటా బూటా...", " ఆయే కుచ్ అబ్ర్ కుచ్ షరాబ్ ఆయేన్..", "క్యా‌ బలా ముఝ్ కో...", ‌" షో‌లాతా జల్ భుజా...",‌ "గులో మే రంగ్ భరే...", " గుల్షన్ గుల్షన్ షోలా-ఎ-గుల్ కి...", "ఓకే హర్ ఎహ్దే ముహబత్ ముకర్తా జాయే...", " జిందగీ మేతొ సభీ ప్యార్ కియా...", "క్యా టూటాహే అందర్ అందర్...", "పరీ షా‌ హోకే మేరీ...", "యూనమిల్ ముఝే కఫా హో జేసే..." వంటి ఎన్నో, ఎన్నో గొప్ప గజళ్లు గానం చేశారు; నాత్, ద్రుపద్, ఖయాల్, ఠుమ్రీ గానం, పంజాబీ, రాజస్థానీ‌ జానపద గానం, హీర్ అన్న పంజాబీ సూఫీ గానం చేశారు మెహ్‌దీహసన్‌.

బాపు అభిమాన గానం

దర్శకుడు బాపు మెహ్‌దీహసన్‌ అభిమాని. మెహ్‌దీహసన్‌ "రఫ్ తా రఫ్‌ తా..." గజల్ ఆధారంగా తూర్పు వెళ్ళే రైలు సినిమాలో "చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా..." పాట చేయించుకున్నారు బాపు. ఈ రఫ్‌తా రఫ్‌తా వో మేరే గజల్ మొదట్లో సినిమా పాటే. 1975లో విడుదలైన జీనత్ అనే పాకిస్తానీ సినిమాలో సంగీత దర్శకుడు నాషాద్ (షౌకత్ హైదరి) చేసిన పాట అది. సినిమాలోనూ మెహ్‌దీహసనే పాడారు. ముత్యాలముగ్గు‌ సినిమాలో "ఏదో‌ ఏదో‌ అన్నది‌‌ ఈ మసక‌ మసక‌ వెలుతురు.." పాట కూడా మెహ్‌దీహసన్ గజల్ గానం ప్రభావంతో రూపు దిద్దుకున్న పాటే. పెండ్యాల చేసిన "నీలి మేఘాలలో గాలి కెరటాలలో..." పాటను 1966లో హిందీ మేరాసాయా సినిమాలో మదన్మోహన్ వాడారు. లతా మంగేష్కర్ పాడిన "నేనో మె బద్ రా.." పాట అది. అదే బాణిని 1972లో పర్‌దేశీ అన్న పాకిస్తానీ సినిమాలో "పాయల్ ఝనన్ ఝన్ కే నగ్మా బన్ కే..." అంటూ మెహ్‌దీహసన్ పాడారు!‌ 1977లో హైదరాబాద్, చెన్నై, ముంబైలలో మెహ్‌దీహసన్ గజల్ కచేరిలు జరిగాయి.‌ 1994లో మన దేశంలో చెన్నైతో సహా కొన్ని నగరాల్లో ఆయన కచేరీలు జరిగాయి. 2012 జూన్ 13న తన శారీరాన్ని (గాత్రాన్ని)‌ లోకానికి ఇచ్చేసి శరీరంగా వెళ్లిపోయారు‌ మెహ్‌దీహసన్. మెహ్‌దీహసన్‌ ప్రాణం ఆయన గానంగా మన దగ్గరే ఉంది.

గానమే ధ్యానం.. ధ్యానమే గానం

మెహ్‌దీహసన్‌ గానం ఆనందరసం! ఎందరో అద్భుతమైన‌ గాయకులున్నారు కానీ ఆనంద‌రసం అద్భుతం కన్నా మిన్న; మెహ్‌దీహసన్‌ ఇతర గాయకుల కన్నా మిన్న. గానాన్ని ధ్యానంగానూ, ధ్యానాన్ని గానంగానూ చేశారు మెహ్‌దీహసన్‌. మెహ్‌దీహసన్‌ గాత్రం, గానం‌ అత్యుదాత్తమైనవి అని అవగతమౌడమే ఒక అర్హత. మెహ్‌దీహసన్‌ గాత్రాన్ని, గానాన్ని ఆస్వాదించగలగడం ఒక ఉదాత్తమైన, ఉత్తమమైన అభిరుచి.

రోచిష్మాన్

94440 12279


Similar News