అమృతానంద పదం అమ్మ
అవిశ్రాంత శ్రమజీవి అమ్మ
త్యాగానికి ప్రతిరూపం అమ్మ
ప్రేమకు చిరునామా అమ్మ
స్పర్శకు మారు పేరేగా అమ్మ !
గూటికి గుండెకాయ అమ్మ
అనంత ఆనంద నిధి అమ్మ
గృహసీమ సౌభాగ్యం అమ్మ
జన్మ కోసం పునర్జన్మ అమ్మ
తొలి పలుకుల గురువేగా అమ్మ !
మమతల కోవెల అమ్మ
అనురాగ దేవత అమ్మ
బంధాలకు పుణాది అమ్మ
నాన్న ప్రాణ నేస్తం అమ్మ
కుటుంబ శ్వాసేగా అమ్మ !
పిల్లల మది దేవత అమ్మ
ఆకలి ఎరిగిన నేర్పరి అమ్మ
కన్నీళ్లకు అడ్డుకట్ట అమ్మ
ఇంటికి దీపస్తంభం అమ్మ
పెరటి తులసి మెుక్కేగా అమ్మ !
గడప పసుపు పారాణి అమ్మ
కోకిల గానపు లాలన అమ్మ
చిరునవ్వుల చిరునామా అమ్మ
ఉగ్గుపాల తీపి రుచి అమ్మ
పేగు తెగిన తీపి నొప్పేగా అమ్మ !
వెన్నెలంత చల్లని చూపు అమ్మ
వెన్నంత మృదు మనసు అమ్మ
ఆకాశమంత ఆరాటం అమ్మ
అంతరిక్షమంత ప్రేమ అమ్మ
మల్లెల సుగంధ మాటలే అమ్మ !
సడలని మనో ధైర్యం అమ్మ
వర్షించే సంక్షేమ మబ్బు అమ్మ
మండుటెండలో హిమ క్రీమ్ అమ్మ
చలి కాలంలో భోగి మంట అమ్మ
జోరు వానలో రక్షణ గొడుగేగా అమ్మ !
రక్తాన్ని చనుబాలుగా మార్చేది అమ్మ
ఆకలి మరిచి అన్నం పంచేది అమ్మ
పిల్లల జీవన నడకకు కందెన అమ్మ
బతుకు బండి ఇంధనం అమ్మ
అందరికీ తొలి పలుకేగా అమ్మ..!
(14న ‘మాతృదినోత్సవం’ సందర్భంగా)
డా. బుర్ర మధుసూదన్ రెడ్డి
కరీంనగర్ - 9949700037