అమ్మకు మించిన దైవం ఉందా..?

Update: 2023-05-13 23:30 GMT

'అమ్మ అన్నది ఒక కమ్మని మాట అన్నది సినీకవుల మాట .సృష్టిలో తీయనిది అమ్మ. అమ్మను మించిన దైవం లేదని భారతీయ స్మృతులు చెబుతున్నాయి. ఆమెది పూజనీయ స్థానం. తల్లి కడుపులో 9మాసాలు ఉండి పేగు తెంచుకుని పుట్టిన బిడ్డకు పాలు ఇచ్చి పెద్దచేస్తుంది. ఆ బిడ్డ ఆటపాటలు చూసి మురిసిపోతుంది మాతృహృదయం. పిల్లల ఆలనాపాలనే తన జీవితమనుకుంటుంది. బిడ్డకు ఎన్నిఏళ్లు వచ్చినా తల్లికి పసిపాపే. ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే. అదే అమ్మతనం. మాతృత్వం అనేది మహిళలకు వరం. దానిలోని మాధుర్యం ఆమెకే తెలుసు.తాను తినక పోయినా బిడ్డలకు పెట్టి తృప్తిపడుతుంది. అంతటి త్యాగమూర్తి అమ్మ. స్త్రీకి వివాహం కాగానే భర్తకు కావలసినవి సమకూర్చుతుంది. బిడ్డ పుట్టగానే భర్త ప్రేమనూ బిడ్డకోసం కేటాయిస్తుంది. పిల్లలు తనను పట్టించుకోకపోయినా ఆమె ప్రేమలో మార్పురాదు. అదే మాతృత్వమంటే. భారతీయ పురాణాలు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నాయి. అంటే అమ్మ తర్వాతే ఎవరైనా. మాతృ రుణం తీర్చుకోలేనిది.


సన్యాసం పుచ్చుకున్న వ్యక్తి పీఠాధిపతి అయినా అతని వద్దకు తండ్రి వస్తే లేచి గౌరవించనవసరం లేదు. తండ్రి నమస్కారం పెట్టినా స్వీకరించవచ్చు. కానీ తల్లి వస్తే లేవాలి. ఆమెకు నమస్కారం చేయాలని దీక్షాధర్మాలు చెబుతున్నాయి. ఆదిగురువు శంకరాచార్యులు సన్యాస దీక్ష స్వీకరించినా తల్లి చనిపోతే కర్మకాండను చేసి తల్లి రుణం తీర్చుకున్నాడు. తల్లి విషయంలో ఏ శాస్ర్తం కూడా నిషేధాన్ని చెప్పదన్నారు. ఆర్షధర్మంలో తల్లిని ఎలా గౌరవించాలో ఆచరించి చూపారు.

తల్లి ప్రేమకు నిదర్శనంగా ఒక వాస్తవ సంఘటన గుర్తుకు వస్తున్నది. ఓ తల్లి పిల్లల కోసం నోములు వ్రతాలు చేసింది, గుళ్లుగోపురాలు తిరిగింది.పెళ్లి అయిన 22సంవత్సరాలకు పిల్లవాడు పుట్టాడు. గారాబంగా పెంచింది. మంచిచదువు చెప్పించారు. పెళ్లిచేశారు. ఇంతలో తండ్రి చనిపోయాడు. ఆ తల్లి కొడుకుకు బరువైంది. ఆమెను వదిలించుకోవాలనే ఆలోచన చేసాడు. తన తల్లి అని చెప్పక అనాధ ఆశ్రమానికి ఫోన్ చేసి తెలిసినవారు ఉన్నారు, వారికి ఎవరులేరు, మీ ఆశ్రమంలో చేర్చాలని చెప్పాడు. తల్లిని తీసుకుని వచ్చి ఆశ్రమం బయట దించి ఇప్పుడే వస్తాను ఇక్కడ ఉండమని చెప్పి వెళ్లిపోయాడు. మళ్లీ తిరిగిరాలేదు. ఎంతకీ రాకపోయేసరికి ఆశ్రమాధికారులు ఆమెను చేరదీశారు. కొడుకు రాకపోయేసరికి ఆమెకు మతి చలించింది. రోజూ కొడుకు తనను ఆశ్రమానికి తీసువచ్చిన సమయంలో పెట్టెపట్టుకుని బయట నుంచుటుంది. మతి చలించిన ఆ పిచ్చితల్లి కొడుకుమీద ప్రేమతో వస్తాడని, తనను తీసుకు వెళతాడని ఆశతో ఎదురుచూస్తుంది. ఆ సమయంలో వర్షం వచ్చినా, ఎండగా ఉన్నా అక్కడే నుంచుని ఉంటుంది. తల్లి ప్రేమ అంటే అదే మరి. కొడుకు చెడ్డవాడు ఉంటాడు. కూతురు చెడ్డది. తండ్రి చెడ్డవాడు ఉంటాడు. కానీ చెడ్డతల్లి మాత్రం ఉండదు. అదే మాతృత్వ మహిమ.


సృష్టిలో ఏ ఇతర జీవులకైనా మాతృత్వంలో తేడా ఉండదు. కోడి అప్పుడే పుట్టిన పిల్లలను గద్దనుంచి రక్షించేందుకు తన రెక్కలతో కప్పి ఉంచుతుంది. శునకం అయినా ఈనిన తరువాత తన బిడ్డల రక్షణకోసం ఎవరినీ దగ్గరకు రానీయదు. అదే అమ్మదనం. తల్లితనం నేర్పడానికి శిక్షణా కేంద్రాలు ఉండవు. అది సహజత్వం. బిడ్డకు ఆపద కలిగితే నా ఆయుష్సు పోసుకుని బతకమని దీవిస్తుంది. ప్రతి స్త్రీలో మాతృత్వం అలా నిలిచి ఉంటుంది. భారతజాతిలో స్త్రీలకు గౌరవం,విశిష్టత ఉంటుంది.

పురాణాలు ,వేదాలు స్త్రీలకు ఎంతో గౌరవం ఇచ్చి మాతృత్వానికి పట్టాభిషేకం చేశాయి. బిడ్డను కనే సమయంలో తల్లి ప్రసవవేదన పునర్జన్మతో సమానం అంటారు. బిడ్డ బయటకు రాగానే అప్పటి వరకూ పడిన బాధను మరచి ప్రేమతో హృదయానికి హత్తుకుంటుంది. ఆదే తల్లిహృదయం. మాతృత్వంతో పాటు బిడ్డల కడుపు తడిమి ఆకలి చూసే అన్నపూర్ణ అమ్మ.


మాతృదినోత్సవం ప్రతిఏడాది మేనెల రెండో ఆదివారం జరుపుకుంటారు. మొత్తం 40దేశాలకు పైగా ఆరోజు మాతృదినోత్సవం జరుపుకుంటారు. అరబ్ దేశాల్లో మార్చి21న, ఇంగ్లండ్, ఐర్లాండ్‌లలో మే 4వ తేదీన ఆదివారం నిర్వహిస్తారు. భారత్‌లో మే ఆదివారం రెండోరోజు జరుపుకుంటారు. మాతృదినోత్సవం మాతృమూర్తి పట్ల ప్రేమ,మాతృత్వంపై గౌరవం కోసం నిర్వహిస్తారు. అన్నా జార్విస్ అనే మహిళ తన తల్లి సంస్మరణార్థం 1908లో మొదటిసారిగా బ్రిటన్‌లో నిర్వహించింది. తల్లి చనిపోయిన మూడు సంవత్సరాలకు బంధువులను పిలిచి ఉత్సవం జరిపింది. ఆహ్వాన టెలిగ్రామ్‌లో మాతృదినోత్సవ పాముఖ్యతను వివరించింది. తల్లిపట్ల ప్రేమను వ్యక్తం చేయడానికి ఈ ఉత్సవం జరుపుకుంటారు. ఆరోజు ఆమెతో గడపడంతో ఆమెకు సంతోషం కలిగిస్తుందని భావిస్తారు. అలాగే తల్లి గొప్పదనాన్ని గుర్తు చేసుకోవడం కోసం నిర్వహిస్తారు.

ప్రాచీన కాలంలో మదర్ ఆఫ్ గాడ్ గా పిలిచే రియా దేవతకు నివాళి అర్పించే పండుగగా గ్రీస్ దేశంలో నిర్వహించేవారు. పాశ్చాత్య దేశాల్లో పిల్లలు ఎదగగానే తల్లిదండ్రులను వదిలి స్వతంత్రంగా జీవిస్తారు. అమ్మను రోజు చూసుకునే అవకాశం లేనందువల్ల అమ్మ కోసం ఒక రోజు మాతృదినోత్సవంగా నిర్ణయించారు. ఈస్టర్ తరువాత 40 రోజులను లెంట్ రోజులుగా భావిస్తారు.17వ శతాబ్దంలో తల్లులకు గౌరవపూర్వకంగా మదరింగ్ సండే పేరుతో ఇంగ్లండ్‌లో జరిపేవారు.1872లో అమెరికాలో జూలియా అనే మహిళ ప్రపంచ శాంతి కోసం మాతృదినోత్సవం ప్రతిపాదించింది. మాతృదినోత్సవ ప్రాముఖ్యతను ప్రచారం చేసింది. 1911 నాటికి అమెరికాలోని అన్ని రాష్ట్రాలలో ఇది సంప్రదాయమైంది. 1914లో అప్పటి అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ మాతృదినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించారు. కాలక్రమేణ ప్రపంచమంతా జరుపుకునే ఆనవాయితీగా మారింది. తల్లిపట్ల కృతజ్ఞతగా ఉండడమే బిడ్డల కర్తవ్యం. మాతృదినోత్సవ సంప్రదాయం ఎవరిది అయినా అమ్మను గౌరవించడం మనకూ గర్వకారణమేగా...

(మే 14న మాతృదినోత్సవం సందర్భంగా)

యం.వి. రామారావు, సీనియర్ జర్నలిస్టు

80741 29668




Tags:    

Similar News