మరోకోణం:నిరుద్యోగుల ఓటు ఎటువైపు?

Update: 2022-04-09 18:45 GMT

ఢిల్లీలో ఇటీవల టీపీసీసీ నేతలతో రాహుల్ గాంధీ సమావేశమైన సందర్భంగా ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు టీం ఒక నివేదిక సమర్పించింది. తెలంగాణలో ప్రస్తుతం నెలకొనివున్న రాజకీయ పరిస్థితులను ఇందులో అంచనా వేశారు. ఇప్పటికిప్పుడు శాసనసభ ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయని తాము చేసిన విస్తృత సర్వే వివరాలను తెలియపరచారు. ఈ సర్వే వివరాలను గోప్యంగా ఉంచినా, అందులో పాల్గొన్న ఓ నాయకుడి సమాచారం మేరకు టీఆర్ఎస్‌కు 38 శాతానికి తగ్గకుండా 42 శాతానికి మించకుండా ఓట్లు పడతాయని తెలిసింది.

కాంగ్రెస్ పార్టీకి 25 నుంచి 27 శాతం మధ్యలో ఓట్లు వస్తాయని, బీజేపీకి పడేది కేవలం 13 నుంచి 15 శాతమేనని తేలింది. మిగతా చిన్నాచితకా పార్టీలకు కలిపి 3-5 శాతం పడవచ్చని అంచనా వేశారు. గమనించాల్సిన విషయమేమిటంటే, ఓటర్లలో సుమారు 15 శాతంగా ఉన్న నిరుద్యోగులు ఇప్పటికీ ఏ పార్టీకి ఓటు వేయాలో నిర్ణయించుకోలేదని, వీరిని ఎవరు తమ వైపు తిప్పుకుంటారో, వచ్చే ఎన్నికలలో ఆ పార్టీదే విజయమని కుండబద్దలు కొట్టారు. ఈ వర్గాలను కాంగ్రెస్ పార్టీ వైపునకు తిప్పుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు.

అధికార పార్టీ మీద వ్యతిరేకత

సునీల్ టీం నిర్వహించిన సర్వే, ఇచ్చిన నివేదిక ఎంతటి శాస్త్రీయత, విశ్వసనీయత కలిగివున్నదని బేరీజు వేసుకునే కంటే ముందు మనం ఒక విషయాన్ని ఒప్పుకుని తీరాలి. తెలంగాణలో మొత్తం 3 కోట్ల 3 లక్షల మంది ఓటర్లు ఉండగా, వీరిలో సుమారు 40 లక్షలకు పైగానే చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారు. 2018లో వెబ్‌సైట్‌కు లాక్ వేయకముందే టీఎస్‌పీఎస్‌సీలో నమోదు చేసుకున్న నిరుద్యోగులు 24.61 లక్షలు కాగా, ప్రస్తుతం మళ్లీ ఓపెన్ చేశారు కనుక ఈ సంఖ్య 30 లక్షలకు చేరే అవకాశముందని అంచనా వేస్తున్నారు. వీరంతా డిగ్రీ, ఆ పైన విద్యార్హతలు కలిగినవారు. డిగ్రీ చదవకుండా టెన్త్, ఇంటర్‌ వాళ్లు, ఐటీఐ వంటి డిప్లొమా హోల్డర్లు మరో పది లక్షల వరకు ఉంటారు. (పని లేకుండా ఉన్న నిరక్షరాస్యులను ఇక్కడ లెక్కించడం లేదు) ఈ 40 లక్షల మంది కూడా 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి చిన్నదో పెద్దదో ప్రభుత్వోద్యోగాన్ని ఆశిస్తున్నారు. ఎనిమిదేండ్లు కావస్తున్నా ఆ అవకాశం రాక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు.

సర్కార్ మీద నమ్మకం లేదు

ఇది గమనించిన సీఎం కేసీఆర్ గత కొన్ని నెలలుగా ప్రభుత్వ విభాగాలలో ఉన్న మొత్తం ఖాళీలను గుర్తించే ప్రక్రియను చేపట్టి ఇటీవలే ఒక ప్రకటన చేశారు. వివిధ విభాగాలు, వివిధ గ్రూప్‌లకు చెందిన 80 వేల ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటించారు. ఇందులో 30 వేల 453 పోస్టులకు ఆర్థిక శాఖ ఇప్పటికే అనుమతులు కూడా మంజూరు చేసింది. అయితే, ప్రభుత్వ ప్రకటనలపై నిరుద్యోగులలో నమ్మకం లేని పరిస్థితి ఉంది. 'నీళ్లు-నిధులు-నియామకాలు' అనే నినాదంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చేపట్టిన కేసీఆర్, అధికారం చేపట్టాక తమ గోడును పట్టించుకోవడం లేదనే ఆవేదన మెజారిటీ నిరుద్యోగులలో ఉంది.

ఈ ఎనిమిదేండ్లలో అనేకమార్లు ఆయన హామీల వరాలివ్వడం, ఎన్నికలలో ఓట్లు వేయించుకోవడం తప్ప చేసిందేమీ లేదనే భావంతో వాళ్లున్నారు. కేవలం 36 వేల పైచిలుకు ఉద్యోగాలను నింపి లక్షా ముప్పై వేలకు పైగా అంటూ చెప్పుకోవడం పట్ల ఆగ్రహిస్తున్నారు. 2018 ఎన్నికలకు ముందు కూడా ఇలాగే ఉద్యోగాలంటూ ఊరించారని, ఇప్పుడు కూడా ఎన్నికలు సమీపిస్తున్నాయి కనుకనే మళ్లీ ఉద్యోగ రాగం అందుకున్నారని వాళ్లంటున్నారు. ప్రకటించిన ఉద్యోగాలను కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందే పరీక్షలు నిర్వహించి, కోర్టు కేసుల గండం నుంచి గట్టెక్కించి, అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తారనే నమ్మకం తమకెంత మాత్రం లేదని పలువురు నిరుద్యోగులు వాపోతున్నారు.

విపక్షాలకు అదే బలం

ఈ పరిస్థితి ప్రతిపక్ష పార్టీలకు ఉపయోగపడడం ఖాయం. ఇప్పటికే అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ నిరుద్యోగ సమస్యపై పోటాపోటీగా ఆందోళనలు నిర్వహించాయి. కాంగ్రెస్ పలు జిల్లాలలో నిరుద్యోగ భేరి సభలు పెట్టి సోనియా ఇచ్చిన తెలంగాణ ఫలాలను కేసీఆర్ కుటుంబం మాత్రమే పొందుతోందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో ఉన్న అన్ని ఖాళీలనూ యుద్ధప్రాతిపదికన నింపేస్తుందని హామీ ఇస్తోంది. బీజేపీ కూడా వచ్చే ప్రభుత్వం తమదేనని, డబుల్ ఇంజన్ బలంతో నిరుద్యోగ సమస్యను నిర్మూలిస్తామని చెబుతోంది. ఈ పార్టీల మాటలు నిరుద్యోగ వర్గాలు ఎంతమేరకు విశ్వసిస్తాయన్నది ఇక్కడ కీలకం.

వారే నిర్ణాయక శక్తి

ఓటు బ్యాంకులో 15 శాతంగా ఉన్న నిరుద్యోగులే వచ్చే ఎన్నికలలో నిర్ణాయక శక్తిగా మారతారన్న సునీల్ టీం అంచనాను దృష్టిలో ఉంచుకుంటే కొన్ని విషయాలను మనం గ్రహించవచ్చు. ఇప్పటికే, 38 నుంచి 42 శాతం ఓటు షేర్ కలిగివున్న టీఆర్ఎస్ దానిని కోల్పోకుండా నిరుద్యోగుల నుంచి కనీసం 3-5 శాతం కనుక తమ వైపు తిప్పుకోగలిగితే ఆ పార్టీకి విజయం సొంతమవుతుంది. అలాకాకుండా, ఈ వర్గాలలో 10 శాతానికి పైగా కాంగ్రెస్ వైపు మొగ్గితే, ఓటింగ్ శాతం 35 కు మించి ఆ పార్టీకి ఖచ్చితంగా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు టీఆర్ఎస్ నుంచి నిరుద్యోగేతర వర్గాల ఓట్లు కొన్ని బీజేపీకి వెళితే కాంగ్రెస్ పూర్తి మెజారిటీ సాధించి అధికారం చేపట్టే అవకాశం కూడా ఉంది.

కీలకంగా మారతారా?

వచ్చే ఎన్నికల్లో కమలనాథుల పాత్ర చాలా కీలకంగా మారనుంది. నిరుద్యోగుల ఓట్లనే కాకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఆ పార్టీ ఎంత మేరకు చీల్చగలుగుతుందో ఆ మేరకు అధికార పార్టీకి లాభం జరుగుతుంది. బీజేపీ ఇప్పటికంటే ఇంకాస్త పుంజుకుని ఇప్పుడున్న 13-15 శాతం ఓట్లను 20-25 శాతంగా పెంచుకోగలిగితే, రాష్ట్రంలో మూడో దఫా టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని భావించవచ్చు. అలా కాకుండా టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటేనని, వాటి మధ్య రహస్య ఒప్పందముందని ఆరోపిస్తున్న రేవంత్‌రెడ్డి ఆరోపణలను కనుక జనం నమ్మితే అప్పుడు నిరుద్యోగులు సహా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ గంపగుత్తగా కాంగ్రెస్‌కు పడడం ఖాయం. అప్పుడు ఆ పార్టీ విజయాన్ని ఏ శక్తీ ఆపలేదు.

జవాబు లేని ప్రశ్నలు

సునీల్ కనుగోలు టీం నివేదికను కాంగ్రెస్ ఏ మేరకు సీరియస్‌గా తీసుకుంటుంది? నిరుద్యోగుల హృదయాలను గెలువడానికి ఏం చేస్తుంది? 80 వేల ఉద్యోగాలనూ ఎన్నికలలోపే కేసీఆర్ భర్తీ చేస్తారా? గత ఎన్నికలకు ముందు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని యువతీయువకుల 'హార్ట్ విన్నర్'గా అమలులోకి తెస్తారా? బీజేపీపై ఆయన ప్రకటించిన యుద్ధం ఏ రూపం తీసుకుంటుంది? కమలదళం ఎత్తుగడలు ఎలా ఉంటాయి? ఆప్, బీఎస్‌పీ వంటి పార్టీలు ఎవరి ఓట్లు చీల్చుతాయి? చివరకు అధికార పీఠం ఏ పార్టీకి దక్కుతుంది? ఇవన్నీ ఇప్పుడే సమాధానం దొరకని ప్రశ్నలు.

-డి మార్కండేయ

Tags:    

Similar News