ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓ విషయాన్ని స్పష్టంగా తేల్చేశాయి. ఇప్పటిదాకా ఒక జాతీయ పార్టీగా, దేశ ప్రజల ఎదుట భారతీయ జనతా పార్టీకి కనీస ప్రత్యామ్నాయంగా ఉందనుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలతో ఆ అర్హతను కోల్పోయింది. పవర్‌లో ఉన్న పంజాబ్‌తోపాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లో ఆ పార్టీ ఘోరంగా బొక్క బోర్లా పడింది. ఏ రాష్ట్రంలోనూ ప్రత్యర్థులకు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. అన్నాచెల్లెళ్లు రాహుల్, ప్రియాంక దృష్టి కేంద్రీకరించినా యూపీలో కేవలం రెండు సీట్లే రావడం వారి స్థాయిని దిగజార్చింది. రైతు ఉద్యమంతో ఏడాది పాటు కేంద్రంపై, బీజేపీ పై యుద్ధం చేసిన పంజాబ్ ఓటర్లు కూడా చివరకు కాంగ్రెస్‌ను కాదని ఆమ్ ఆద్మీ పార్టీ దరిన చేరడం ఆ పార్టీ ఎంతటి దీనావస్థలో ఉన్నదో తెలియజేస్తున్నది. ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లో ప్రభుత్వ వ్యతిరేక పవనాలున్నా వాటిని తన వైపు మరల్చుకోవడంలో ఘోరంగా విఫలమైంది. కేవలం రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో మాత్రమే అధికారం మిగిలి ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారింది.
ఆనాటి నుంచే పతనం
నిజానికి, కాంగ్రెస్ పతనం రాజీవ్‌గాంధీ హయాంలోనే మొదలైంది. అప్పటి నుంచే పోలైన ఓట్లలో కాంగ్రెస్‌కు పడే ఓట్ల శాతం క్రమంగా తగ్గుతూవస్తోంది. ఇందిరాగాంధీ హత్య అనంతరం 1984 డిసెంబర్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో 415 సీట్లు, 49.1 శాతం ఓట్లు సాధించి భారత చరిత్రలోనే అతి పెద్ద మెజారిటీతో రాజీవ్ అధికారంలోకి వచ్చారు. కానీ, అనుభవ శూన్యత, అంతర్గత కోటరీ తప్పుడు సలహాలు, అస్తవ్యస్త పాలన, అవినీతి కుంభకోణాల మూలంగా కేవలం ఐదేండ్లలోనే ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడి 1989 ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. కేవలం 39.5 శాతం ఓట్లతో 197 సీట్లు గెలుచుకున్నారు. ఇక ఆ తర్వాత నుంచి అధికారం చేజిక్కినా, కోల్పోయినా మొత్తం పోలైన ఓట్లలో కాంగ్రెస్‌కు పడిన ఓట్ల శాతం క్రమంగా క్షీణిస్తూనే వచ్చింది.
1991లో 35.6 శాతంతో 244 సీట్లు, 1996లో 28.8 శాతంతో 140 సీట్లు, 1998లో 25.8 శాతంతో 141 సీట్లు, 1999లో 28.3 శాతంతో 114 సీట్లు, 2004లో 26.7 శాతంతో 145 సీట్లు, 2009లో 28.5 శాతంతో 206 సీట్లు వచ్చాయి. వామపక్షాలు, కొన్ని ప్రాంతీయ పార్టీల సహకారంతో కూటమిగా ఏర్పడి మాత్రమే 1991, 2004, 2009లలో కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. ఇక, 2014 ఎన్నికలలో అతి తక్కువ 19.3 శాతం ఓట్లు మాత్రమే సాధించి, కేవలం 44 సీట్లతో సభలో ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని కోల్పోయిన స్థితికి చేరింది. 2019లో కూడా 19.5 శాతంతో 52 స్థానాలు మాత్రమే పొందగలిగింది.
ఒక్కొక్కటిగా చేజారుతూ
ఇదే కాలంలో కాంగ్రెస్ ఒక్కటొక్కటిగా రాష్ట్రాలను చేజార్చుకుంది. రాజీవ్ హయాం వరకూ కేవలం తమిళనాడు, జమ్మూ-కశ్మీర్, బెంగాల్, కేరళ తప్ప దాదాపు అన్ని రాష్ట్రాలలోనూ ఆ పార్టీ ప్రభుత్వాలే అధికారంలో ఉండేవి. మొదట ఉత్తరప్రదేశ్, బీహార్‌ను, ఆ తర్వాత క్రమంగా అన్ని ఉత్తరాది రాష్ట్రాలనూ, మహారాష్ట్ర, కర్ణాటకనూ, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి ఏపీ, తెలంగాణనూ కాంగ్రెస్ కోల్పోయింది. గత ఏడేండ్లలో ఈశాన్య భారతాన్నీ, ఇప్పుడు పంజాబ్‌నూ వదులుకుని కేవలం రెండంటే రెండు రాష్ట్రాలలోనే అధికారంలో ఉన్న దయనీయ స్థితికి చేరింది.
ఈ పతనావస్థకు ప్రధాన కారణం బలహీన నాయకత్వమే. నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత ఆ పార్టీకి ప్రజాకర్షణ ఉన్న నాయకుడి నేతృత్వం కరువైంది. రాజకీయ అనుభవం లేని రాజీవ్ తప్పుడు వ్యూహాలతో పార్టీ పతనానికి నాంది పలికితే, విదేశీ ముద్రతో పగ్గాలు చేపట్టిన సోనియా కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకోలేక ఊగిసలాడుతూవచ్చారు. సీనియర్ల విమర్శలను, అసంతృప్తులను, పార్టీ వ్యతిరేక చర్యలను కట్టడి చేయడంలో విఫలమయ్యారు. తనయుడు రాహుల్ రాజకీయాలలోకి తేవడంలోనూ తడబడ్డారు. 2004లో గత్యంతరం లేని స్థితిలో మన్మోహన్‌ను ప్రధాని చేసినా, అనుకూల పరిస్థితులుండి కూడా 2009లో ఆ స్థానానికి కొడుకును ప్రమోట్ చేయడానికి వెనుకాడారు.
విశ్వాసం కోల్పోయి
చివరకు, పార్టీ పరువు ప్రతిష్టలు బాగా దిగజారిన సమయంలో సోనియా రాహుల్‌కు 2017లో పగ్గాలు అందించారు. ఆ అవకాశాన్ని రాహుల్ సద్వినియోగం చేసుకోలేకపోయారు. సామాజికాంశాలలో తెలివైన, పరిపక్వత కలిగి ఉన్నవాడిలా కనిపించినా, అమాయకత్వంతో కూడిన అసమర్థతలను ప్రదర్శించి అభాసుపాలయ్యారు. 2019 ఓటమి తర్వాత యుద్ధరంగానికి వెన్ను చూపి దేశ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. సీనియర్ల తిరుగుబాటు, రాష్ట్రాలలో కీలక నేతల ఫిరాయింపుల నేపథ్యంలో చివరకు తిరిగి సోనియా పార్టీ పగ్గాలు చేపట్టాల్సివచ్చింది.
పేరుకు ఆమె ప్రెసిడెంటు అయినా అనారోగ్యం కారణంగా రాహుల్, ప్రియాంకనే పార్టీ వ్యవహారాలు నడిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురిలో ఏ ఒక్కరూ పూర్తి బాధ్యతలు నిర్వహించలేని గందరగోళ పరిస్థితి నెలకొన్నది. సీనియర్లందరూ మొహం చాటేసి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. హైకమాండ్ పార్టీపై పట్టు కోల్పోయింది. అన్ని రాష్ట్ర శాఖలలో క్రమశిక్షణ లోపించి అంతర్గత కలహాలు, గ్రూపు రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. పంజాబ్‌లో అధికారం కోల్పోయింది ఈ కారణాల వల్లనే. మన తెలంగాణ పీసీసీ వ్యవహారం కూడా ఇందుకు మినహాయింపు కాదు.
వారి స్థానాలు పెరిగే అవకాశం
ఈ పరిస్థితులలో జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం ఏమిటన్న ప్రశ్న ఇప్పుడు దేశ ప్రజలలో చర్చగా మారింది. వరస అవకాశాలను అందిపుచ్చుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఆ పార్టీ స్థానాన్ని స్థానికంగా ఏర్పడిన ప్రాంతీయ పార్టీలు ఎక్కడికక్కడ ఆక్రమించుకోవడం కనిపిస్తోంది. జమ్మూ-కాశ్మీర్ మినహా దేశంలో ఢిల్లీ సహా 28 రాష్ట్రాలుండగా, ఇందులో 15 రాష్ట్రాలు బీజేపీ పాలనలో ఉన్నాయి. కాంగ్రెస్ చేతిలో రెండు, లెఫ్ట్ చేతిలో కేరళ పోను మిగతా పది రాష్ట్రాలను ప్రాంతీయ పార్టీలే ఏలుతున్నాయి.
కమలనాథుల ఖాతాలో ఉన్న రాష్ట్రాలలో మొత్తం 207 లోక్‌సభ స్థానాలుండగా, ఈ ప్రాంతీయ పార్టీల పరిధిలో ఉన్న రాష్ట్రాలలో 265 స్థానాలుండడం గమనార్హం. పార్టీలవారీగా చూసినా, ప్రస్తుత లోక్‌సభలో బీజేపీకి 301 సీట్లు ఉంటే అన్ని ప్రాంతీయ పార్టీలకు కలిపి 180 సీట్లున్నాయి. కాంగ్రెస్ చేతిలో 53, సీపీఐ-సీపీఎం చేతిలో ఐదు సీట్లున్నాయి. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులను, పార్టీల బలాబలాలను పరిశీలిస్తే, వచ్చే ఎన్నికలలో ఈ సీట్ల సంఖ్య బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. పంజాబ్‌లో ఆప్, యూపీలో ఎస్‌పీ, బిహార్‌లో ఆర్‌జేడీ , తమిళనాడులో డీఎంకే, ఒడిశాలో బీజేడీ మరిన్ని ఎక్కువ స్థానాలు సాధించుకునే అవకాశముంది.
'ఆప్' ప్రభావం ఎంత?
ఈ కోణంలో ఆలోచిస్తే, వచ్చే ఎన్నికలలో ప్రాంతీయ పార్టీల కూటమినే బీజేపీకి ప్రధాన ప్రత్యామ్నాయంగా భావించవచ్చు. ఈ కూటమికి నాయకత్వం వహించే అవకాశం ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఉండింది. ఇప్పుడు ఆ పార్టీ చేతులెత్తేసింది కనుక ఆ స్థానాన్ని ఏ పార్టీ భర్తీ చేస్తుందన్నది ఆసక్తికర అంశం. సీపీఐ, సీపీఎం, బీఎస్‌పీ, ఎన్‌సీపీ, తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటిదాకా ఎన్నికల కమిషన్ లిస్టులో జాతీయపార్టీలుగా గుర్తింపు పొందినా ఒక్క తృణమూల్ తప్ప మరే పార్టీ ప్రస్తుతం ఫాంలో లేవు. తృణమూల్ ఇప్పటికే బిమరోకోణంహార్, అస్సాం, పంజాబ్, గోవా సహా పలు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలలో పోటీ చేసింది. ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ, శరద్‌పవార్, అఖిలేశ్, తేజస్వి సహా పలు ప్రాంతీయపార్టీల నేతలతో టచ్‌లో ఉన్నారు.
బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫ్రంట్ కోసం కృషి చేస్తున్నారు కూడా. ఇక, ఢిల్లీలో గెలిచి సంచలనం సృష్టించిన కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ జాతీయ పార్టీగా గుర్తింపు పొందక పోయినా, ఇప్పటికే 18 రాష్ట్రాలలో శాఖలను కలిగివుంది. అనేకచోట్ల ఎన్నికలలో సైతం పోటీ చేసింది. ఇప్పుడు పంజాబ్ రాష్ట్రాన్ని బంపర్ మెజారిటీతో ఊడ్చేసింది. ఈ గెలుపు స్ఫూర్తితో పనిచేస్తే, పలు రాష్ట్రాలలో కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేసి, జాతీయ పార్టీగా రూపుదిద్దుకునే అవకాశం దండిగా కనపడుతోంది.
వారే భాగస్వాములుగా
ఏమైనా వచ్చే ఎన్నికలలో దేశ ప్రజలు బీజేపీని కనుక ఎంచుకోకుంటే, ఆ స్థానం తప్పనిసరిగా ప్రాంతీయ పార్టీల కూటమికే చెందుతుందనేది నిర్వివాదాంశం. ఆప్ లేదంటే తృణమూల్ కీలకపాత్ర నిర్వహించే ఈ కూటమిలో ఎస్‌పీ, బీఎస్‌పీ, ఆర్‌జేడీ, జేఎంఎం, బీజేడీ, ఎన్‌సీపీ, శివసేన, డీఎంకే, జేడీ (ఎస్) తదితర పార్టీలు భాగస్వాములుగా ఉండవచ్చు. ఎలాగూ కాంగ్రెస్, వామపక్షాలు ఈ కూటమికి మద్దతివ్వక తప్పని పరిస్థితి ఉంటుంది. కాలం కలిసివస్తే, జేడీ(యూ), ఎల్‌జేపీ, వైసీపీ వంటి ఎన్‌డీఏ అనుకూల పార్టీలు సైతం ఇటువైపు జంప్ చేయవచ్చు. ఇక నేషనల్ పాలిటిక్స్ లోకి వెళ్ళడానికి నిర్ణయించుకున్న మన కేసీఆర్ కూడా పరిస్థితులను బేరీజు వేసుకుని ఏ కూటమి సర్కారు ఏర్పాటు చేస్తుందో అటువైపే మొగ్గ వచ్చు. కేటీఆర్‌ను సీఎం చేయడం ఆయనకు తప్పదు కనుక ఊసరవెల్లి వైఖరి అనివార్యం కూడా. చూద్దాం.. ఏం జరగనుందో..!?
-డి మార్కండేయ