మరోకోణం: కేసీఆర్‌లో ఓటమి భయం మొదలైందా?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ @పీకేతో అధికార టీఆర్ఎస్ చేసుకున్న ఒప్పందం గురించే ఇప్పుడు తెలంగాణలో చర్చ నడుస్తోంది..

Update: 2022-03-05 23:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ @పీకేతో అధికార టీఆర్ఎస్ చేసుకున్న ఒప్పందం గురించే ఇప్పుడు తెలంగాణలో చర్చ నడుస్తోంది. నటుడు ప్రకాశ్‌రాజ్‌తో కలిసి పీకే ఇటీవల గజ్వేల్ నియోజకవర్గంలో రహస్యంగా పర్యటించడం, కేసీఆర్ సర్కారు పాలనపై, పథకాలపై ప్రజల ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం, మల్లన్నసాగర్‌ను సందర్శించడం మీడియా దృష్టిని ఆకర్షించింది. బిహార్‌కు చెందిన పీకే తనవైన వ్యూహాలతో 2012 గుజరాత్ ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని మోడీని మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిపించి మొదటిసారి వార్తల్లో నిలిచారు. ఆ ఊపుతో 2014 లోక్‌సభ ఎన్నికల్లో సైతం మోడీకి అండగా నిలిచారు. చాయ్ పే చర్చ, మంథన్, రన్ ఫర్ యూనిటీ, 3డీ ర్యాలీలు, సోషల్ మీడియా కేంపెయిన్లు, కొత్త తరహా ప్రసంగపాఠాలతో ఆకట్టుకున్నారు. 2015లో బిహార్‌లో జేడీ(యు), 2017లో పంజాబ్‌లో కాంగ్రెస్‌, 2019లో ఏపీలో జగన్‌, 2020లో ఢిల్లీలో ఆప్‌, 2021లో బెంగాల్, తమిళనాడుల్లో తృణమూల్, డీఎంకే విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించారు. ఇలాంటి మంచి ట్రాక్ రికార్డు ఉన్న పీకేకు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్‌ను గెలిపించే బాధ్యతను కేసీఆర్ అప్పగించారు. అయితే, రాజకీయ ఎత్తులు-జిత్తులు వేయడంలో అపర చాణక్యుడిగా పేరున్న కేసీఆర్.. పీకే లాంటి కార్పొరేట్ నిపుణుడిని అరువు తెచ్చుకోవడంపై పరిశీలకుల్లో, ప్రజల్లో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. తన ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఇతరులపై ఆధారపడని తమ అధినేత ఇప్పుడు పీకే వైపు చూడడం పట్ల టీఆర్ఎస్ వర్గాలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. పీకేను తలదన్నే ఎన్నెన్నో రాజకీయ రణతంత్రాలను గతంలో తానే అనుసరించిన విషయాన్ని కేసీఆర్ మర్చిపోయారా? అనే టాక్ నడుస్తోంది.

నిజానికి, ఎత్తులు వేయడంలో, వ్యూహాలు పన్నడంలో ఎన్టీఆర్ కాలం నుంచీ కేసీఆర్‌కు మంచి పేరుంది. చంద్రబాబుకు సన్నిహితం కావడానికి కూడా ఈ సమర్థతలే కారణమని టీడీపీ వర్గాలు చెబుతుంటాయి. ఈ లక్షణం చూసే ప్రొఫెసర్ జయశంకర్ ఆయనను తెలంగాణ సాధన కోసం కొత్త పార్టీని స్థాపించేలా ప్రోత్సహించారని ఉద్యమకారులు అంటుంటారు. 2001లో టీఆర్ఎస్‌ను ఏర్పాటు చేసిన నాటి నుంచి 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే వరకూ కేసీఆర్ అనుసరించిన రాజకీయ వ్యూహాలు అన్నీ ఇన్నీ కావు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం ద్వారా తమకు ప్రజాబలం ఉందని ఎలా నిరూపించారో, అంతే వేగంగా కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న దమననీతిని నిరసిస్తూ బయటకు వచ్చి అన్ని వర్గాల మెప్పు పొందడం మనం గమనించవచ్చు. టీఆర్ఎస్ నుంచి ఫిరాయింపులను వైఎస్ ప్రోత్సహించినప్పుడూ, పార్టీ మొరేల్ సన్నగిల్లినప్పుడూ చెక్కుచెదరలేదు. 2009 వరకూ ఉద్యమం-ఆందోళనలు-ఉపఎన్నికలు-లాబీయింగ్‌ను మేళవించి, చివరకు తను ఆమరణ నిరాహారదీక్ష చేసి కేంద్రం మెడలు వంచగలిగారు.

చిదంబరం ప్రకటన, శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు నేపథ్యంలో మరో నాలుగేళ్ల పాటు ఉద్యమాన్ని ఆయన చాకచక్యంగా నడిపారు. కాస్త సానుకూల పరిస్థితులు ఏర్పడగానే యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీని ప్రభావితం చేశారు. తెలంగాణ ఇస్తే తాను ఆమె ఇంటి ముందు కాపలా కుక్కలా పడివుంటానని, తన పార్టీని బేషరతుగా కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని హామీ ఇచ్చారు. తనకు పదవులేమీ వద్దని, కొత్త రాష్ట్రానికి దళితుడే ముఖ్యమంత్రి అని కూడా ప్రకటించారు. చట్టసభల్లో ఏపీ పునర్విభజన బిల్లు ఆమోదం పొందిన తర్వాత వీటి ఊసు ఎత్తకపోయినా తెలంగాణ ప్రజలను ఆయన తన వెంటే ఉంచుకోగలిగారు. ఎన్నికల్లో 119 స్థానాలకు గాను 63 స్థానాల్లో గెలువగలిగారు. రాష్ట్రం ఇచ్చిన పార్టీ అయినా కాంగ్రెస్ కేవలం 21 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందంటే కేసీఆర్ తన వ్యూహ చతురతను ఎంతగా ప్రదర్శించారో అర్థం చేసుకోవచ్చు. 2018 ప్రారంభం కల్లా రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోందని గమనించి, రైతుబంధు స్కీంను అస్త్రంగా ప్రయోగించి ఆరు నెలల ముందే ముందస్తుకు వెళ్లి బంపర్ మెజారిటీ సాధించడం ఆయనకు తప్ప మరొకరికి సాధ్యం కాదేమో. అలాగే ఈ ఎనిమిదేళ్ల కాలంలో తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం వంటి పార్టీలపై కోలుకోని విధంగా దెబ్బతీయగలగడం ఆయనకే చెల్లు. ప్రత్యర్థి పార్టీలను, నేతలను మీడియా సమావేశాల్లో, బహిరంగసభల్లో చీల్చి చెండాడడం కేసీఆర్ కంటే బాగా ఇంకెవరూ చేయలేరు కూడా. ఎప్పుడు ఏ పార్టీతో శత్రుత్వం పెంచుకోవాలో, ఎప్పుడు ఏ పార్టీకి దగ్గర కావాలో వెంట వెంట రాజకీయ విన్యాసాలు చేయడంలో కూడా ఆయన దిట్ట.

అయినా కూడా కేసీఆర్ పీకేను ఆశ్రయించారంటే అందులో తప్పనిసరిగా ఏదో మతలబు ఉండే ఉంటుంది. మొదటిదఫా తెలంగాణ తెచ్చిన సెంటిమెంటుతో, రెండవదఫా రైతుబంధు వంటి స్కీములతో అధికారం దక్కించుకున్న ఆయన మూడవసారి హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడం అంత ఈజీ కాదని భయపడుతున్నారు. గత కొన్నేళ్లుగా ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత వేగంగా పెరుగుతోందని గమనించారు. ప్రైవేట్ సంస్థలతో, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో పలుమార్లు సర్వేలు చేయించారు. ఈ సర్వేల్లో టీఆర్ఎస్‌కు కేవలం 30 నుంచి 40 స్థానాల్లోనే విజయావకాశాలున్నాయని, కాంగ్రెస్ 40కి పైగా స్థానాల్లో ముందంజలో ఉందని, కమలనాథులకు 15 నుంచి 25 వరకు వస్తాయని బయటపడింది. కొత్తగా ప్రవేశపెట్టిన దళితబంధు వికటించడం, ధరణి ఫెయిల్ కావడం, రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఉద్యోగ నోటిఫికేషన్లు, కొత్త పింఛన్లు వంటి హామీలను నెరవేర్చకపోవడం వల్ల జనంలో నెగెటివ్ టాక్ మొదలైందని అర్థం చేసుకున్నారు. ఈసారి గెలవాలంటే అల్లావుద్దీన్ అద్భుతదీపం వంటి అనేక అస్త్రాలు అవసరమని గుర్తించారు.

ఇందులో భాగంగానే ఆయన తన రాజకీయ వ్యూహాన్ని మార్చారు. రాష్ట్రంలో దినదినం కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని, దేశవ్యాప్తంగా మోడీ సర్కారుకు, బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని గుర్తించారు. ఒక్క దెబ్బకు మూడు పిట్టలన్న తంత్రాన్ని ముందుకు తెచ్చారు. కమలనాథులపై ఆలౌట్ వార్ ప్రకటించారు. గత డెబ్బైఐదేళ్లలో పాలక పార్టీలు దేశాన్ని భ్రష్టు పట్టించాయంటూ కొత్త పల్లవిని అందుకున్నారు. జాతీయ రాజకీయాల్లోకి వస్తానని, అవసరమైతే రాజ్యాంగాన్ని మార్చి అయినా సరే.. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ప్రకటించారు. ఏడున్నరేళ్లలో బంగారు తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసిన తను ప్రజల ఆశీర్వాదం ఉంటే స్వర్ణభారత్‌ను సైతం రూపుదిద్దగలనని సెలవిస్తున్నారు. ఆ దిశలో ఆచరణను మొదటెట్టారు. కేంద్ర ప్రభుత్వ పెత్తందారీతనానికి వ్యతిరేకంగా కొత్త ప్రత్యామ్నాయ ఫ్రంట్‌కు పురుడు పోసేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే స్టాలిన్, ఉద్ధవ్ థాక్రే, హేమంత్ సొరేన్, శరద్ పవార్, సుబ్రమణ్యస్వామి వంటి ముఖ్యమంత్రులను, నేతలను కలిశారు. త్వరలోనే మరికొందరు ప్రాంతీయ నేతలను కలువబోతున్నారు.

ఈ ప్రయత్నాల్లో తను బిజీగా ఉంటారు కనుక టీఆర్ఎస్‌ను తెలంగాణలో గెలిపించే బాధ్యతను కేసీఆర్ బహుశా పీకేకు అప్పగించివుండవచ్చు. ఎలాగూ షెడ్యూల్డ్ ఎన్నికలకు ముందో, లేదంటే ముందస్తు ఎన్నికల తర్వాతనో రాష్ట్ర బాధ్యతలను తనయుడు కేటీఆర్‌కు అప్పగిస్తారనే టాక్ కూడా ఉంది కనుక ఆయన ఈ నిర్ణయం తీసుకునివుండవచ్చు. తన కంటే కేటీఆర్‌తో పీకేకు కంపాటిబులిటీ ఎక్కువ ఉంటుందని, భవిష్యత్తులో పనికి వస్తుందనే అభిప్రాయానికి వచ్చివుండచ్చు. అలాగే, దేశవ్యాప్తంగా అనేక మంది జాతీయ, ప్రాంతీయ నేతలతో పీకేకు ఉన్న పరిచయాలు ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటులో ఉపయోగపడతాయని భావించి వుండవచ్చు. హైదరాబాద్‌లో కేసీఆర్‌ను కలిసిన వెంటనే పీకే పట్నా వెళ్లి సీఎం నితీశ్‌కుమార్‌ను కలువడం ఈ విషయాన్నే ధ్రువీకరిస్తోంది. చివరగా, చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సిద్ధాంతాన్ని కేసీఆర్ సాధారణంగా అనుసరిస్తారు కనుక తన రణనీతికి పీకే కార్పొరేటిజాన్ని జోడిస్తే లాభమే తప్ప నష్టమేమీ లేదని అనుకుని వుండవచ్చు.

కేసీఆర్‌లో ఓటమి భయం నిజమేనా? పీకే ఎత్తుగడలు వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను గెలిపిస్తాయా? రాబోవు రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటుందా? కమలనాథులు ఎలాంటి ఎత్తులు వేస్తారు? యాదాద్రి ప్రారంభం తర్వాత కేటీఆర్‌ను సీఎం చేస్తారా? ముందస్తు ఉంటుందా? 2023 డిసెంబర్‌లోనే ఎన్నికలు జరుగుతాయా? జాతీయ రాజకీయాలు కేసీఆర్‌కు ఎంతమేరకు అనుకూలిస్తాయి? యాంటీ కాంగ్రెస్, యాంటీ బీజేపీ ఫ్రంట్ పెడతారా? థర్డ్ ఫ్రంట్‌లో చేరతారా? లేక యూపీ ఫలితాల తర్వాత సడన్‌గా ప్లేట్ ఫిరాయిస్తారా? ఇవన్నీ ఇకముందు ఆసక్తికరంగా మారనున్నాయి. 


- డి. మార్కండేయ


Tags:    

Similar News