పల్లెకు పోదాం చలో చలో

Update: 2021-05-29 07:45 GMT

మూడు రోజుల కిందట మా ఆఫీసు కొలీగ్స్ మధ్య ఓ చర్చ జరిగింది. '' సెకండ్ వేవ్ ఇంకా పోనే లేదు. థర్డ్ వేవ్ అంటున్నరు. మధ్యలో ఈ రంగు రంగుల ఫంగస్ గొడవ ఒకటి. అది కూడా మహమ్మారిలా మారి లక్షల మందిని చంపవచ్చునన్న వార్త ఇంకొకటి. ఇట్లైతే ఇంక బతుకుడెట్ల'' అన్నది ఆ చర్చ సారాంశం. ''ఈ సిటీల ఇట్ల ఉండుడు కంటే మన సొంతూళ్లకు వెళ్లిపోయి, ఓ ఏడాది గ్రాసం సమకూర్చుకుని బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండడం సేఫ్ అనుకుంట'' అన్నాడో మిత్రుడు. ''ఆ పల్లెలో కూడా ఊరి బయట పొలాల్లో ఓ నాలుగు గుంటలో, ఎకరమో మన స్తోమతను బట్టి కొనుక్కుని చిన్నగా రెండు రూంలు వేసుకుంటే ఇంకా బెస్ట్'' అన్నాడు మరో మిత్రుడు. ఒక వేవ్ వెంట మరో వేవ్, ఒక వైరస్ వెంట మరో ఫంగస్.. ఇలా మానవాళిపై దాడి చేస్తుంటే నాగరికత మళ్లీ వెనక్కి వెళ్లుతున్నదా.. ఆదిమ మానవుని జీవనసరళిని అనుసరించక తప్పదా.. అంటూ ఏవేవో చర్చించుకున్నాం. మాలో కొందరు ఈ చర్చను సీరియస్‌గా తీసుకునివుండచ్చు. మరికొందరు లైట్ తీసుకోవచ్చు. కానీ, విషయం మాత్రం చాలా గంభీరమైనది. మనిషి మనుగడకు, జీవన సరళికి సంబంధించినది. 2020 మార్చిలో కరోనా మహమ్మారి ఇక్కడ ప్రబలి ప్రభుత్వం దేశవ్యాప్త లాక్‌డౌన్ పెట్టినప్పుడు చాలామంది నగరాలు, పట్టణాలు విడిచి తమ సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఉపాధి కరువై కొందరు, భీతిల్లి మరికొందరు, వర్క్ ఫ్రం హోం ఫెసిలిటీతో ఇంకొందరు ఇలా పల్లెల బాటపట్టారు. ఫస్ట్ వేవ్ అంతమైపోగానే తిరిగివచ్చారు. మళ్లీ సెకండ్ వేవ్ వచ్చింది. ఏం చేయాలో తెలియక చాలామంది తలలు పట్టుకుంటున్నారు. కరోనా వైరస్ ఇప్పుడప్పుడే పోయేది కాదని, ఫ్యూచర్‌లో కూడా ఇలాంటి ఉపద్రవాలు రావచ్చుననే అంచనాతో కొంతమంది పల్లెటూళ్లలో ఇండ్లు, పొలాలు కొనుక్కోవడం, ఫాంహౌజులు నిర్మించుకోవడం మొదలైంది. తక్కువ ప్లేస్‌లో ఎక్కువ మంది ఉండే నగరాలు అంత సేఫ్ కాదని, ఎక్కువ ప్లేస్‌లో తక్కువ మంది ఉండే పల్లెలే రక్షణనిస్తాయని, పైగా అక్కడ స్వచ్ఛమైన వాతావరణం ఉంటుందని వాళ్ల భావన.

మారిన భావనలు

పల్లెలే పట్టుగొమ్మలుగా వర్థిల్లిన మన దేశంలో రాజీవ్‌గాంధీ, పీవీ నర్సింహారావు జమానాలో అమలు చేసిన ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాల మూలంగా నగరాలు, పట్టణాల చుట్టూతానే అభివృద్ధి అంతా కేంద్రీకృతమైంది. ఫలితంగా కూలీలే కాకుండా అంతో ఇంతో చదువుకున్న ప్రతి ఒక్కరూ ఉపాధి వేటలో నగరాలకు, పట్టణాలకు వచ్చి చేరారు. 1901లో దేశ జనాభాలో 11.4 శాతం మాత్రమే ఉన్న పట్టణ, నగర జనాభా 2021 (అంచనా) కల్లా 36 శాతం దాటింది. 2050 వరకు దేశజనాభా 164 కోట్లకు చేరుతుందని, అందులో 50శాతం అనగా 82 కోట్ల మంది నగరాలు, పట్టణాలలోనే ఉంటారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ప్రస్తుతం ముంబయి, కోలకతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాదు వంటి పది ప్రధాన నగరాలలోనే 11 కోట్లకు పైగా జనం నివసిస్తున్నారు. పల్లెల జనాభా క్రమంగా క్షీణిస్తుంటే నగరాలు, పట్టణాల జనాభా రాకెట్ వేగంతో పెరిగిపోతున్నది. భవనాలు, నివాసాలు అడ్డంగానూ నిలువుగానూ విచ్ఛలవిడిగా విస్తరిస్తున్నాయి. ఒక్కో అపార్ట్‌మెంట్‌లో నాలుగైదు గ్రామాల జనాభా నివసిస్తోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ పరిణామం సహజంగానే అనేక సమస్యలు సృష్టిస్తున్నది. పెరిగిన జనాభాకు తగిన మౌలిక సౌకర్యాలను కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతుండడంతో ప్రజల జీవనం నరకప్రాయంగా మారింది. అడుగడుగునా వాహనాలు, యంత్రాలు, కంప్యూటర్లు, జనరేటర్లు, ఏసీలు పెరిగి అన్ని రకాల కాలుష్యం భరించలేని స్థాయికి చేరింది. ట్రాఫిక్‌ జామ్‌లు కామనై వాహనంపై గంటకు పది కి.మీ. కూడా ప్రయాణించే పరిస్థితి లేదు. మాల్స్‌ లో, మాంసం, చేపల, కూరగాయల మార్కెట్లలో, వైన్స్ ల ముందు, సిటీబస్సులలో, లోకల్ ట్రెయిన్స్‌లో, రోడ్లపైన, ఇంకా ఎక్కడ చూసినా గుంపులుగా జనమే. లాఠీలు ఝళిపిస్తే తప్ప లాక్‌డౌన్ నిబంధనలు అమలు కావడం లేదు. ఇలాంటి పరిస్థితులలో మనుషుల మధ్య సోషల్ డిస్టెన్స్ పాటించడం అసాధ్యమన్న విషయం అందరికీ అర్థమవుతున్నది. అందుకే చాలామంది పల్లెబాట పడుతున్నారు.

జీవనసరళిలో మార్పులు

కరోనా చేస్తున్న చేటును పక్కన పెడితే, ఆ వైరస్‌తో సమాజానికి కొన్ని లాభాలు కూడా కలుగుతున్నాయి. మనుషుల ఆహారపు అలవాట్లలో, జీవనసరళిలో గొప్పమార్పు వచ్చింది. పోషక విలువలు కలిగిన, ఇంట్లో వండిన ఆహారాన్నే తీసుకుంటున్నారు. స్వీట్లు, చాట్లు మానేసి పండ్లు, ఫలాలు తింటున్నారు. సినిమాలు, షికార్లు ఆపేసారు. ప్రయాణాలూ తగ్గాయి. అయితే, మహమ్మారి పుణ్యమా అని మరొక్క మార్పు రావాల్సివుంది. నగరాలు, పట్టణాల నుంచి పల్లెటూళ్లకు రివర్స్ వలసలు పెరగాలి. రెండు ప్రాంతాల మధ్య జనాభా విషయంలో సమతుల్యత రావాలి. అప్పుడే దేశం ఎదుర్కొంటున్న అనేకానేక పర్యావరణ, సామాజిక, ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇందుకోసం ప్రభుత్వాలు కొత్తగా చట్టాలు తేనక్కరలేదు. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వస్తే చాలు. ఉపాధి కోసం నగరాలు, పట్టణాలకు వలస వచ్చినవాళ్లు ఇక్కడే సెటిలయ్యిపోకుండా కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలి. సాఫ్ట్‌‌వేర్ ఇంజనీర్ల నుంచి అడ్డాకూలీల దాకా తాము చేస్తున్న ఉద్యోగం నుంచి, పని నుంచి, దందా నుంచి రిటైర్ అవగానే తమ సొంతూళ్లకు వెళ్లిపోవాలి. తాము సంపాదించిన దాంతోనే చిన్న ఇల్లు కట్టుకుని, కొద్దిపాటి పొలం కొనుక్కుని ప్రశాంత జీవనం సాగించాలి. పల్లెల్లో కూడా ఈరోజు మొబైల్, ఇంటర్నెట్ మొదలుకొని గ్రాసరీ, మెడికల్ షాపుల వరకు అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. అత్యవపరమైతే జిల్లా కేంద్రానికో హైదరాబాదుకో రావడం కొన్ని గంటల పనే.

సో.. అందరూ ఆలోచించండి. ప్లాన్ చేసుకోండి. రిటైర్ అయినవాళ్లు, వర్క్ ఫ్రం హోం చేస్తున్నవాళ్లు, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నవాళ్లు.. ఒక్కమాటలో చెప్పాలంటే నగరంతో పనిలేని వారందరూ పల్లెలకు వెళ్లండి. మీ తల్లిదండ్రులు, చిన్ననాటి స్నేహితులు, బంధువులు, ఆప్తులతో హాయిగా గడపండి. స్వచ్ఛమైన గాలి పీల్చండి. ప్రశాంత వాతావరణంలో వాకింగ్ చేయండి. తాజా కూరగాయలు, పండ్లు తినండి. కల్లాల మీదే ధాన్యం కొనుక్కోండి. ఖాళీగా ఉండక్కర్లేదు. వ్యవసాయం చేయండి. చిన్నచిన్న వ్యాపారాలు చేయండి. వృత్తి పని చేయండి. మీకు వచ్చిన, నచ్చిన పని ఏదైనా చేయండి. పని వున్నప్పుడే పట్టణాలకు, నగరాలకు రండి. అప్పుడు సంపూర్ణారోగ్యం మీ సొంతమవుతుంది. ఎంతటి మహమ్మారి వచ్చినా మిమ్మల్ని ఏం చేయలేదు. బెస్ట్ ఆఫ్ లక్..

డి. మార్కండేయ

Tags:    

Similar News