రేవంత్.. టార్గెట్ 2023

Update: 2021-08-14 08:00 GMT

ఇప్పుడు బంతి రేవంత్ కోర్టులో ఉంది. గాంధీభవన్‌వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఆయన తన పని తాను సైలెంట్‌గా చేసుకుపోతున్నారు. పదవిని అప్పగించిన నుంచి సీనియర్లను, అసంతృప్తులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో పడ్డారు. ఇతర పార్టీల్లో ఉన్న పాత మిత్రులను కాంగ్రెస్‌లోకి రప్పించడానికి పావులు కదుపుతున్నారు. ప్రతి రోజూ ఠంఛనుగా ఆఫీసుకు వస్తూ నేతలను, కార్యకర్తలను కలుస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత కార్డు ప్లే చేస్తుండడంతో కౌంటర్‌గా తను కూడా దళిత-గిరిజన దండోరాను ప్రారంభించారు. ఇంద్రవెల్లిలో నిర్వహించిన మొదటి సభకు భారీగా జనం వచ్చి సక్సెస్ కావడం ఆయనలో ఉత్సాహం నింపింది. ఆ వెంటనే అసెంబ్లీ, పార్లమెంటు, జిల్లాల వారీగా 'దండోరా' ఇన్చార్జిలను ప్రకటించారు. ఒక అంచనా ఏమిటంటే ఈ ఇన్చార్జిల పనితీరును సమీక్షించిన తర్వాతే రేవంత్ 'తన టీం-2023'ని ఎంచుకుంటాడు.

మూడవది, అతి ముఖ్యమైనది బీజేపీని మూడవ స్థానానికి నెట్టడం. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి ప్రదర్శన చూపించి, ఈటలను చేర్చుకుని ఆ పార్టీ ఊపు మీదున్నది. గ్రూపుల మధ్య రాజకీయాల మూలంగా ఇటీవల ఆ ఉత్సాహం కొంత నీరుగారినప్పటికీ, కమలనాథులను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఇందుకోసం రేవంత్ చాలా చెమటోడ్చాలి. ఎంతో చాకచక్యంగా, వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. తను చాలా కాలంగా ఆరోపిస్తూ వస్తున్న టీఆర్ఎస్-బీజేపీ లోపాయికారీ కుమ్మక్కును ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అప్పుడే కాంగ్రెస్ తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా రూపుదిద్దుకుంటుంది. తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలన్న రేవంత్ కల నెరవేరుతుంది.

2018 ప్రారంభంలో నాకు తెలిసిన ఓ మేధావి మిత్రుడు రేవంత్‌రెడ్డిని కలిసారు. అప్పటికి ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరి మూడు, నాలుగు నెలలవుతోంది. ఆయనకు పీసీసీ సారథ్య బాధ్యతలు ఇస్తారని, ఎన్నికలలో కాంగ్రెస్ గెలిస్తే ఆయనే సీఎం అభ్యర్థి అని తెలుగు మీడియా కోడై కూస్తున్నది. అదే విషయాన్ని నా మిత్రుడు ప్రస్తావిస్తే, ప్రస్తుతం తన టైం రాలేదని, చేయాల్సిన పనులు చాలా మిగిలివున్నాయని అన్నారట. హైకమాండ్ వెంటనే తనకు ఆ పదవి ఇచ్చినా తీసుకోవడం ఇష్టం లేదన్నారట. ఈ ఎన్నికలను తాను లైట్ తీసుకుంటానని, కాంగ్రెస్ గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తానని, 2023 మాత్రం తనదేనని చెప్పారట. ఆరు నూరైనా ఆ ఎన్నికలలో తను సీఎం క్యాండిడేట్‌గా ఉంటానని ఢంకా భజాయించారట. కాంగ్రెస్‌లో ఆ అవకాశం దొరక్కపోతే మరో పార్టీని వెతుక్కుంటాను కానీ, కేసీఆర్‌కు ప్రధాన పోటీదారుగా నిలువడం మాత్రం ఖాయమని ఎంతో ఆత్మవిశ్వాసంతో అన్నారట.

అనుకున్నట్టే

చెప్పినట్లే, 2018 ఎన్నికలకు ముందు రేవంత్ పీసీసీ అధ్యక్షుడు కాలేదు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలోనే కాంగ్రెస్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు వెళ్లింది. వ్యూహాత్మక తప్పిదాల మూలంగా అనుకూల పరిస్థితులు కాస్తా అననుకూలంగా మారి ఘోర పరాజయాన్ని చవిచూసింది. తెలుగుదేశంతో అనైతిక కలయిక, చంద్రబాబు హైదరాబాదుకు వచ్చి ప్రచారసభలలో కేసీఆర్‌ను దూషించడం, ఇక తమదే అధికారం అంటూ గొప్పలు పోవడం బెడిసికొట్టింది. సరిగ్గా ఈ అంశాన్నే గులాబీ అధినేత ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు. కాంగ్రెస్-టీడీపీ కూటమిని గెలిపిస్తే తెలంగాణకు చంద్రబాబే సీఎం అవుతారని, మళ్లీ ఆంధ్ర పెత్తనం మొదలవుతుందని జనం భాషలో చెప్పారు. దాంతో ప్రభుత్వ వైఫల్యాల ఎజెండా కాస్తా తెలంగాణ సెంటిమెంటు వైపునకు మళ్లింది. ఓట్లు మళ్లీ కారు గుర్తుకే పడ్డాయి. ప్రతిపక్షాలన్నీ బొక్కబోర్లా పడ్డాయి. కాంగ్రెస్ కేవలం 19 సీట్లు గెలుచుకోగా, టీడీపీకి రెండు, బీజేపీకి ఒకటి మాత్రమే వచ్చాయి. వామపక్షాలు ఖాతా సైతం తెరువలేదు. చివరకు, రేవంత్ కూడా 'అధికార' ధాటికి కొడంగల్‌లో ఓడిపోయారు. పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్ తన పదవికి రాజీనామా చేసారు. ఇక, అప్పటినుంచి పీసీసీలో కుర్చీలాట మొదలైంది. రేవంత్‌కే పగ్గాలిస్తారని వార్తలు రావడం, ఆ వెంటనే సీనియర్లు విరుచుకుపడడం, సోనియా-రాహుల్ వెనక్కి తగ్గడం సాధారణమైంది. రెండున్నరేళ్ల తర్వాత ఎట్టకేలకు ఈ మధ్యనే కాంగ్రెస్ హైకమాండ్ ఓ నిర్ణయం తీసుకుని రేవంత్‌ను రాష్ట్రాధ్యక్షునిగా ప్రకటించింది.

బంతి తన కోర్టులో

ఇప్పుడు బంతి రేవంత్ కోర్టులో ఉంది. గాంధీభవన్‌వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఆయన తన పని తాను సైలెంట్‌గా చేసుకుపోతున్నారు. పదవిని అప్పగించిన నుంచి సీనియర్లను, అసంతృప్తులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో పడ్డారు. ఇతర పార్టీలలో ఉన్న పాత మిత్రులను కాంగ్రెస్‌లోకి రప్పించడానికి పావులు కదుపుతున్నారు. ప్రతి రోజూ ఠంఛనుగా ఆఫీసుకు వస్తూ నేతలను, కార్యకర్తలను కలుస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత కార్డు ప్లే చేస్తుండడంతో కౌంటర్‌గా తను కూడా దళిత-గిరిజన దండోరాను ప్రారంభించారు. ఆగస్టు 9న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహించిన మొదటి సభకు భారీగా జనం వచ్చి సక్సెస్ కావడం ఆయనలో ఉత్సాహం నింపింది. ఆ వెంటనే అసెంబ్లీ, పార్లమెంటు, జిల్లాలవారీగా 'దండోరా' ఇన్‌చార్జిలను ప్రకటించారు. ఆయా నియోజకవర్గాలలో, జిల్లాలలో దండోరా సభల నిర్వహణ బాధ్యతలను వీళ్లు చూసుకుంటారు. ఒక అంచనా ఏమిటంటే ఈ ఇన్‌చార్జిల పనితీరును సమీక్షించిన తర్వాతే రేవంత్ 'తన టీం-2023'ని ఎంచుకుంటారు. పార్లమెంటు స్థానాలలో అభ్యర్థులుగా ఎవరుండాలి? అసెంబ్లీకి ఎవరు పోటీ చేయాలి? ప్రజలలో ఎవరి బలం ఎంత? జిల్లా బాధ్యతలకు ఎవరు పనికివస్తారు? వంటి ప్రశ్నలకు దండోరా సభలే సమాధానం చెబుతాయని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

పాదయాత్ర ఇప్పుడే కాదు

మొదట అనుకున్నట్లుగా, రేవంత్ ఇప్పుడే పాదయాత్ర చేయబోవడంలేదు. అందుకు కారణాలు రెండు. ఒకటి, కేసీఆర్ ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరును బట్టి వచ్చే ఎన్నికలు 2023 డిసెంబరులో కాకుండా, అంతకుముందే వస్తాయి. బహుశా 2022లోనే రావచ్చునని రేవంత్ భావిస్తున్నారు. అలా జరిగిన పక్షంలో వీలైనంత త్వరగా తన ఎన్నికల టీంను సెట్ చేసుకోవాల్సివుంటుంది. తను పాదయాత్రలో నిమగ్నమైతే ఈ పని చేయడం కష్టం. రెండు, దళితబంధు ద్వారా తెలంగాణలో 16 శాతంగా ఉన్న ఎస్సీ ఓట్లను కొల్లగొట్టడానికి ముఖ్యమంత్రి వేసిన ఎత్తును చిత్తు చేయడం తక్షణావసరంగా ముందుకువచ్చింది. కాంగ్రెస్‌కు అనాదిగా ఓటుబ్యాంకుగా ఉన్న ఈ వర్గాలలో ఎలాగైనా పట్టు నిలబెట్టుకోవాలి. ఈ రెండు కారణాల రీత్యా రేవంత్ తన పాదయాత్రను వాయిదా వేసి దళిత-గిరిజన దండోరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సొంతింటిని చక్కదిద్దుకోవాలని

ఇక, హుజూరాబాద్ ఉపఎన్నికను కూడా రేవంత్ లైట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సొంతింటిని చక్కదిద్దుకోవడానికే ఆయన ప్రాధాన్యమిస్తున్నారు. ఎలాగూ ఆ నియోజకవర్గంలో అధికార పార్టీకి, ఈటలకు మధ్యే ప్రధాన పోరు జరుగనుంది కనుక మధ్యలో దూరి అభ్యర్థిని నిలబెట్టి ప్రతిష్టాత్మకంగా తీసుకుని చెడ్డపేరు మూటగట్టుకునే కంటే వదిలేయడమే బెటరనే అభిప్రాయంతో రేవంత్ ఉన్నారని కాంగ్రెస్‌వర్గాల సమాచారం. చివరికి ఎవరినో ఒకరిని బరిలో నిలిపినా గెలువడం కోసం మాత్రం కాదని, ఈటలకే పరోక్షంగా మద్దతిస్తారని వాళ్లు అభిప్రాయపడుతున్నారు.

అధికారం హస్త'గతం' కోసం

తర్వాతి ఎన్నికలు 2022లో వచ్చినా లేక 2023లో వచ్చినా అధికారం 'హస్త'గతం చేసుకోవాలంటే, తను సీఎం కావాలంటే రేవంత్ దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. మొదటగా పార్టీలో ఉన్న కోవర్టులను ఏరేయాలి. కీలక సమయంలో ఇష్టమున్నట్లు వ్యవహరించే, పాలసీకి భిన్నంగా మాట్లాడే సీనియర్ల నోటికి తాళం వేయాలి. పార్టీపై పూర్తి పట్టును సాధించాలి. ప్రతి నియోజకవర్గంలోనూ గెలుపు గుర్రాలను తయారుచేసుకోవాలి. జిల్లా నాయకత్వాన్ని డెవలప్ చేయాలి. అలాగే, గ్రామస్థాయిలో కార్యకర్తల నెట్వర్క్ ను పటిష్టం చేసుకోవాలి. పోలింగ్ బూత్ లెవెల్‌లో అంకితభావమున్న టీం లీడర్లను తయారుచేసుకోవాలి.

రెండవది: ప్రజలను ఆకట్టుకోగలిగిన, కేసీఆర్ సంక్షేమ పథకాలను మించిన రీతిలో ఒక మంచి ఎలక్షన్ మేనిఫెస్టో తయారుచేసుకోవాలి. ప్రజల నుంచే పన్నులు తదితర రూపాల్లో డబ్బులు వసూలు చేస్తూ, అవే డబ్బులను భిక్షగా వారికి ఎర వేయడాన్ని ఎండగట్టాలి. కేవలం భూములున్న రైతులకే కాకుండా వ్యవసాయం చేసే ప్రతి కుటుంబానికి ఊతమిచ్చే ఆలోచనలు చేయాలి. అన్ని వర్గాల ఓటర్లు కాంగ్రెస్ వైపు వచ్చేలా వ్యూహం పన్నాలి. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమన్న రీతిలో ప్రణాళిక ఉండాలి.

మూడవది, అతి ముఖ్యమైనది బీజేపీని మూడవ స్థానానికి నెట్టడం. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి ప్రదర్శన చూపించి, ఈటలను చేర్చుకుని ఆ పార్టీ ఊపు మీదున్నది. గ్రూపుల మధ్య రాజకీయాల మూలంగా ఇటీవల ఆ ఉత్సాహం కొంత నీరుగారినప్పటికీ, కమలనాథులను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఇందుకోసం రేవంత్ చాలా చెమటోడ్చాలి. ఎంతో చాకచక్యంగా, వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. తను చాలా కాలంగా ఆరోపిస్తూ వస్తున్న టీఆర్ఎస్-బీజేపీ లోపాయికారీ కుమ్మక్కును ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అప్పుడే కాంగ్రెస్ తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా రూపుదిద్దుకుంటుంది. తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలన్న రేవంత్ కల నెరవేరుతుంది.

డి. మార్కండేయ

Tags:    

Similar News