చరిత్ర దాచిన మన్యం వీరుడు

Manyam is a forgotten hero of history

Update: 2023-09-09 23:45 GMT

ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా మనదేశంకు స్వాతంత్ర్యం వచ్చింది. ఇనాటి భారతీయుల స్వేచ్ఛా వాణి వెనుక ఎందరో తమ రక్తాన్ని ధారపోశారు అలుపెరగని పోరాటం చేశారు. అందులో కొందరి చరిత్రలు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. కొందరి చరిత్ర బయటకు రాలేదు. అటువంటి వారిలో అగ్రగణ్యుడు ద్వారబంధాల చంద్రయ్య దొర!

ఆ వర్గాలను సంఘటితం చేసి..

మన్యంలో అల్లూరి సీతారామరాజు కంటే ముందుగానే ఓ మహోన్నత ఉద్యమానికి సారధ్యం వహించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పెకిలించే ప్రయత్నం చేశారు. అల్లూరి మన్యం పితూరి కంటే ముందుగానే రంప పితూరి నడిపినా వీరుడు. ఆయన 1853లో ప్రస్తుత విజయనగరం జిల్లా ‘బొబ్బిలి’ తెలగ వీధిలో మూలా నక్షత్రంలో జన్మించాడు. ఆరోజుల్లో మూలా నక్షత్రంలో పుట్టిన వారిని చంపేవారు. ఒకవేళ బ్రతికిన నష్టజాతకుడిగానే చూసేవారు. ఆయన తల్లి ఆయన పుట్టిన కొద్దికాలానికే మరణించింది. తండ్రి లక్ష్మయ్య సైనికాధికారిగా బ్రిటిష్ వారి తరపున 'ఆఫ్ఘనిస్థాన్'లో తిరుగుబాటు అణచడానికి వెళ్లి చనిపోయారు. దీంతో ఆయన మేనమామలు దగ్గర పెరిగారు. అక్కడే విద్యాబుద్ధులు, తుపాకీ కాల్చడం, విలువిద్య, కర్రసాము, గుర్రపు స్వారీలో ప్రావీణ్యం సంపాదించాడు.

అయితే చంద్రయ్య కొరకు యుక్త వయసు వచ్చినప్పుడు భీకరమైన కరువు రాజ్యమేలింది. కలరా, మశూచి, ప్లేగు వంటి ప్రాణాంతక వ్యాధులు వ్యాప్తి చెందాయి. సకాలంలో వైద్యం అందక వేలాది మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. అటువంటి సమయంలో కూడా సంస్థానాధీశులు పన్నుల కోసం ప్రజలను జలగల్లా పీల్చుకు తినేవారు. పన్ను కట్టని వారి పొలాలు, పశువులు, చివరికి వ్యవసాయ పనిముట్లను సైతం వేలం వేసేవారు. వీటన్నింటినీ చూసిన చంద్రయ్య రక్తం మరిగిపోయింది. అసలే పౌరుష వంతుడు కావడంతో వారిపై తిరగబడ్డాడు. తూర్పుగోదావరి మన్య ప్రాంతంలో ప్రారంభమైన చంద్రయ్య పోరాటం అటు ఖమ్మం, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాలతో పాటు అటు మధ్యప్రదేశ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల వరకూ విస్తరించింది. బలహీనవర్గాలను సంఘటితం చేసి చంద్రయ్య దొర బ్రిటీష్ వారిపై ఎన్నో పోరాటాలు చేసి విజయవంతమయ్యారు.

ఇలా ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేయడంతో రోజురోజుకూ చంద్రయ్య దొర ప్రాబల్యం పెరిగిపోయింది. ప్రజల మద్దతు కూడా పెరగడంతో పీడిత ప్రజలు చంద్రయ్య దొరను ఆరాధ్య దైవంగా చూడడం ప్రారంభించారు. దీంతో బ్రిటీష్ పాలకుల్లో కూడా భయం ప్రారంభమైంది. తమ పాలనకు చరమగీతం పాడతాడని భావించి చంద్రయ్య దొరకు పదవి, డబ్బు ఆశ చూపడం ప్రారంభించారు. దీంతో బ్రిటిషు వారు ఆయనను చంపాలని బురద కోటపై కాల్పులు జరిపారు. కానీ గాయాలతో చంద్రయ్య బయటపడ్డారు. రహస్యంగా ఉన్న చంద్రయ్య మారు వేషంలో తిరుగుతూ అడవి దారిలో ధాన్యం, పప్పుదినుసుల బండ్లను అడ్డగించి, వాటిని పేద ప్రజలకు పంపిణీ చేసేవాడు. దీంతో బ్రిటిష్ వారు బంధువులు సహకారంతో మత్తు మందు కలిపిన భోజనం తినిపించి స్పృహ కోల్పోయేలా చేసి రావి చెట్టుకు వేలాడదీసి ప్రజలందరి సమక్షంలో తుపాకులతో 1880, ఫిబ్రవరి 23న కాల్చి చంపారు. దీంతో ఓ మహోన్నత శిఖరం నెలకొరిగింది. కానీ ఆయన స్ఫూర్తి సజీవంగా నిలిచింది. అక్కడికి నాలుగు దశాబ్దాల తరువాత గిరిజనుల కొరకు అల్లూరి రూపంలో మరో చరిత్రకారుడు, యోధుడు, ఉద్యమకారుడు పుట్టుకొచ్చాడు. అయితే ఇంతటి మహోద్యమాన్ని నడిపిన చంద్రయ్య దొర చరిత్ర ఇంతవరకూ వెలుగులోకి రాకపోవడం దురదృష్టకరం. గిరిజన ప్రాంతములో అల్లూరి కంటే ముందుగానే భారతీయుల స్వేచ్ఛా వాణి కోసం ఒక యోధుడు పోరాడాడన్న విషయం భావితరాలకు సుపరిచితమైంది. క్రమంగా ప్రభుత్వాలు మేలుకొని మహోన్నత యోధుడుకు అంజలి ఘటించడం ప్రారంభించాయి. భారతీయ తపాలా శాఖ ఆయన చిత్రంతో కూడిన తపాలా చంద్రికను కూడా గత సంవత్సరం విడుదల చేసింది!

(నేడు చంద్రయ్య దొర జయంతి)

ఎన్. సీతారామయ్య

9440972048

Tags:    

Similar News