ఈ లైంగికదాడి వెనుక అదృశ్య హస్తాలెన్నో!

డాక్టర్ రథ్ గోవిందా కర్(ఆర్.జి.కర్) కలకత్తా హాస్పిటల్లో ఆగస్టు 9న ట్రైనీ డాక్టర్‌ను రేప్ చేసి, క్రూరాతి క్రూరంగా హత్య చేసిన

Update: 2024-08-30 01:30 GMT

డాక్టర్ రథ్ గోవిందా కర్(ఆర్.జి.కర్) కలకత్తా హాస్పిటల్లో ఆగస్టు 9న ట్రైనీ డాక్టర్‌ను రేప్ చేసి, క్రూరాతి క్రూరంగా హత్య చేసిన సంఘటన దేశ ప్రజలను కలవరపెడుతోంది. ఈ మెడికల్ కాలేజీని 1886లో స్థాపించారు. ఆసియా ఖండంలోని మొట్టమొదటి వైద్యాలయంగా పేరుగాంచినది. ఇంతటి పేరు ప్రఖ్యాతులు గడించిన ఆసుపత్రిలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం అత్యంత విచారకరం. 

ఈ ఘటన జరిగాక, ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను అదృశ్యం చేయడానికి వేల మంది టీఎంసీ కార్యకర్తలు హాస్పిటల్‌పై దాడి చేయడం, సీసీ కెమెరాలను ఆఫ్ చేయడం, ఈ సంఘటన జరిగిన సమయంలో ప్రిన్సిపల్‌గా ఉన్న సందీప్ కుమార్ ఘోష్‌ను ఆ స్థానం నుండి తొలగించి, ఉన్నత స్థానంలో పునర్ నియామకం చేయడం అంతుపట్టని విషయాలు. పైగా సాక్ష్యాలను తారుమారు చేయాలని రాష్ట్ర పోలీసు యంత్రాంగం ప్రయత్నించడం, ఇది ఆత్మహత్యగా చిత్రీకరించడం అత్యంత వివాదాస్పదంగా మారింది.

స్వయం ప్రకటిత మేధావులారా?

ఈ ఉదంతంపై వాస్తవాలు వెలికి తీయాలని, దోషులను గుర్తించాలని వైద్యరంగంలో ఉన్న సిబ్బంది, అనేక సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగడంతో ఈ ఉదంతాన్ని సీబీఐకి అప్పజెప్పడం, భారత సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి, విచారణ చేపట్టడంతో ఈ ఉదంతానికి అత్యంత ప్రాధాన్యత వచ్చినదనడంలో అతిశయోక్తి లేదు. ఈ కేసును నీరుగార్చడానికి మమతా బెనర్జీ ప్రభుత్వం 5 మంది మహిళా న్యాయవాదులను, ఎనిమిది మంది మగ న్యాయవాదులను, దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడిన దోషుల తరఫున వాదించడంలో పేరు ప్రఖ్యాతులు గడించిన మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబాల్‌ను తన ప్రభుత్వం తరఫున నియమించుకోవడం దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక ప్రభుత్వం ఉన్నందువలన ఈ ఉదంతాన్ని సున్నితమైనదిగా కొందరు మలుస్తున్నారని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇటువంటి సంఘటనలు జరగలేదా? అంటూ కొందరు స్వయం ప్రకటిత మేధావులు మీడియాలో రాస్తున్నారు. తప్పు ఏ ప్రభుత్వ హయాంలో జరిగింది అనేది కాదు ముఖ్యం, తప్పు చేసిన దోషులు ఎలాంటి వారైనా శిక్షించబడాలనేది ముఖ్యమైన విషయమని వీరు గ్రహిస్తే సమాజానికి కాస్తో, కూస్తో మేలు జరుగుతుంది.

ప్రిన్సిపల్‌పై తీవ్ర ఆరోపణలు

దొంగే - దొంగ, దొంగ అని అరచినట్లు ప్రభుత్వాన్ని నడిపే మమతా బెనర్జీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ర్యాలీ జరగడం అత్యంత విచారకరం. శోచనీయం. ఈ ఉదంతంతో సంబంధం ఉన్న వినయ్ రాయ్‌ని పోలీసులు అరెస్టు చేసి, సీబీఐకి అప్పజెప్పడం, సీబీఐ కోర్టు అనుమతితో పాలీగ్రాఫ్ టెస్టులు నిర్వహించడం జరిగింది. తాను నిర్దోషినని, తనను అనవసరంగా ఈ కేసులో ఇరికించారని జడ్జి ముందు వాపోవడం వాస్తవాలను దాచే విధంగా ఉంది. లైంగికదాడి చేసి క్రూరాతిక్రూరంగా,అమానుషంగా హత్య చేయడం వెనుక చనిపోయిన ట్రైనింగ్ డాక్టర్‌కూ, ఈ ఉదంతంలో ఇన్వాల్వ్ అయిన దోషులకూ మధ్య ప్రపంచానికి తెలియని విషయం ఏదో ఉంది. ఈ ఉదంతంలో పాలీగ్రాఫ్ టెస్టులకు గురైన ప్రిన్సిపల్ సందీప్ కుమార్ ఘోష్‌కి శరీర అవయవాలను అమ్మి సొమ్ము చేసుకునే అక్రమ వ్యాపారంతో సంబంధం ఉందని, ఆ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ కలకత్తా హైకోర్టుకు ఫిర్యాదు చేయడం తో ఈ కేసు అనేక మలుపులు తిరిగింది.

ఆ కెపాసిటీ బీజేపీకి లేదు

ఈ ఉదంతాన్ని సాకుగా చూపి, రాష్ట్రంలో గందరగోళాలు సృష్టించి, రాష్ట్రపతి పరిపాలన విధించి, రాజకీయ లబ్ధి పొందాలని కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతుందని మోడీ ప్రభుత్వ వ్యతిరేకులు కొందరు ఊహాగానాలు చేయడం జరుగుతోంది. ఈ కేసును రాద్ధాంతం చేసి, రాజకీయ లబ్ధిని పొందాలనుకుంటే అది జరగదు. ఇలాంటి 'కెపాసిటీ' బీజేపీ నాయకత్వానికి లేదు. కానీ కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉంటే తన కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో, కార్యకర్తలపై దాడులు చేసిన వారికి ఎలా బుద్ధి చెప్పాలో వారికి బాగా తెలుసు. కాంగ్రెసేతర ప్రభుత్వాలను కూల్చి, రాష్ట్రపతి పరిపాలన విధించి, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకోవడంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలిసినట్లు ఇంకెవరికీ తెలియదు.

మన దేశం న్యాయవ్యవస్థపై, విచారణ సంస్థలపై ప్రజలకు నమ్మకం పూర్తిగా సన్నగిల్లింది. అందుకు కారణం లేకపోలేదు. దేశభద్రతతో ముడిపడిన విషయాలను సైతం మన దేశాన్ని న్యాయవ్యవస్థ, విచారణ సంస్థలు త్వరగా నిగ్గు తేల్చి దోషులను శిక్షించిన దాఖలాలు లేవు. ఈ కేసు విషయంలోనైనా న్యాయవ్యవస్థ, దర్యాప్తు సంస్థలు త్వరిత గతిలో విచారించి, దోషులను తేల్చాలని ప్రజల ఆకాంక్ష! 

ఉల్లి బాలరంగయ్య,

సామాజిక, రాజకీయ విశ్లేషకులు

94417 37877

Tags:    

Similar News