తెలంగాణ 2024-2025 బడ్జెట్‌లో విద్యా, వైద్యానికి 20 శాతంలోపే కేటాయించారు. రాష్ట్ర బడ్జెట్ రూ.2,75,891 కోట్లైతే విద్యా శాఖకు రూ.21,383 కోట్లు, వైద్య శాఖకు రూ.11,500 కోట్లు మాత్రమే కేటాయించడం విచారకరం. విద్య వైద్య రంగాలకు 40 శాతం నిధులు కేటాయిస్తే ఆరు గ్యారంటీలు కాదు... అరవై గ్యారెంటీలు ఇచ్చిన ఫలితాన్ని ప్రజలు పొందుతారు. విద్య, వైద్యం ఉచితంగా లభించినప్పుడు మాత్రమే ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు, రాష్ట్రం అభివృద్ధి చెందినా.. ఈ రెండు ఉచితం చేయనంత కాలం ఎన్ని ఉచిత పథకాలు ఇచ్చినా మంచి ఫలితం ఉండదు.
ఈ రాష్ట్రంలో కోటి పది లక్షల కుటుంబాలు ఉంటే 93 లక్షల కుటుంబాలు ఇంకా రేషన్ బియ్యం తింటున్నాయి, ప్రతి సంవత్సరం లక్షల కుటుంబాలు విద్య, వైద్యం కోసం ఖర్చు చేసి పేదరికంలోకి వెళుతున్నాయి, కర్మ కాలి ఏదైనా రోగం వస్తే ప్రైవేటు వైద్యశాలలో వైద్యం పొందాలంటే ఒంట్లో వణుకు పుడుతుంది. ప్రైవేట్ బడులలో పిల్లలను చేర్పించాలంటే అప్పులు చేయక తప్పడం లేదు. అందుకే ప్రభుత్వ విద్యా వైద్య రంగాలను పటిష్ట పరిచి వాటిపై నమ్మకం కలిగిస్తే, ప్రజలకు సంపాదనలో 75 శాతం ఖర్చు తగ్గుతుంది. కావున ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్య రంగాలను పటిష్ట పర్చడానికి కృషి చేయాలని ఉచిత విద్య వైద్య సాధన సమితి కోరుతోంది.
- నారగొని ప్రవీణ్ కుమార్
ఉచిత విద్య వైద్య సాధన సమితి
98490 40195