ముక్కు సూటి మనిషి మహేష్ భట్

భారత చలన చిత్ర రంగంలో ఎంతో ప్రతిభ ఉండి వివాదస్పద చిత్రాలు, వ్యక్తిగత వ్యాఖ్యలతో ప్రసిద్ధి చెందిన చిత్ర నిర్మాత, దర్శకుడు, కథకుడు, స్క్రీన్ ప్లే రైటర్ మహేష్ భట్.

Update: 2024-09-20 09:04 GMT

భారత చలన చిత్ర రంగంలో ఎంతో ప్రతిభ ఉండి వివాదస్పద చిత్రాలు, వ్యక్తిగత వ్యాఖ్యలతో ప్రసిద్ధి చెందిన చిత్ర నిర్మాత, దర్శకుడు, కథకుడు, స్క్రీన్ ప్లే రైటర్ మహేష్ భట్. 1948 సెప్టెంబర్ 20న ముంబైలో జన్మించాడు. తండ్రి హిందువు. తల్లి ముస్లిం. ముంబైలోని మాతుంగాలో డాన్ బాస్కో స్కూల్లో చదివాడు. స్కూల్ లో చదువుతున్నప్పుడే వేసవి సెలవుల్లో ఉద్యోగాలు చేస్తూ వాణిజ్య ప్రకటనలు చేసాడు. 20 ఏళ్ల వయస్సులో కాలేజ్ చదువుతున్నప్పుడే అనాథ ఆశ్రమంలో ఉండి చదువుకుంటున్న "లోరియన్"అనే క్యాథలిక్ అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. తదనంతరం లోరియన్ కిరణ్‌గా పేరు మార్చుకుంది. వీరిద్దరి ప్రేమ ప్రేరణే ఈయన నిర్మించి దర్శకత్వం వహించిన మ్యూజికల్ కమర్షియల్ హిట్ చిత్రం 1990 దశకంలోని "ఆషికీ"చిత్రం.

మతాంతర వివాహాలే...

కిరణ్‌కు నటి పూజ భట్, రాహుల్ భట్ జన్మించిన తరువాత మహేష్ భట్, కిరణ్ విడిపోయి విడాకులు తీసుకోకుండా జీవించారు. ఆ సమయం లోనే ప్రముఖ బాలీవుడ్ నటి పర్వీన్ బాబితో సహజీవనం గడిపాడు. పర్వీన్ బాబీతో గడిపిన మధుర స్మృతులను "అర్థ్"అనే చిత్రంలో చూపించాడు. మహేష్ భట్ మొదటి సారిగా దర్శకత్వం వహించిన చిత్రం 1974లో విడుదలైన"మంజిల్ ఔర్ భీ హై" హిట్ కాలేదు.1979లో ఈయన దర్శకత్వంలో వినోద్ ఖన్నా నటించిన "లాహు కె దో రంగ్" హిట్ అయ్యింది. 1984లో 28 సంవత్సరాల వయస్సులో ఉన్న అనుపమ్ ఖేర్‌తో 65 సంవత్సరాల ముదుసలి పాత్రలో నటింప జేసి ఎంతో ప్రఖ్యాతులు సాధించాడు. కాల గమనంలో పర్వీన్ బాబి మానసిక చికిత్సకై అమెరికా వెళ్ళింది. 1986లో నటి సోనియా రజ్డాన్‌తో సన్నిహితంగా ఉంటూ ప్రేమించి పెండ్లి చేసుకోవాలని నిర్ణయించగా సోని రజ్డాన్ తండ్రి మొదటి భార్య కిరణ్‌కు విడాకులు ఇమ్మని కోరగా తిరస్కరించి ఇస్లాం మతంలోకి మారి వివాహం చేసుకున్నారు.

ఓషో రజనీష్, యు.జి. కృష్ణమూర్తి చింతనతో...

మహేష్, సోనీకి నేటి ప్రముఖ నటి అలియా, షాహీన్ జన్మించారు. మహేష్ భట్ సంజయ్ దత్‌తో "నామ్, సడక్", అమీర్ ఖాన్ తో"దిల్ హై కి మాన్త నహి", "హమ్ రహి ప్యార్ కె" చిత్రాలు ఎవర్ గ్రీన్ హిట్స్‌గా ఉన్నాయి. మహేష్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ నటించిన "జఖ్మ్" చిత్రానికి జాతీయ సమగ్రతా చిత్రంగా అవార్డ్ పొందింది. మహేష్ భట్ 1970 దశకంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఓషో రజనీష్ దగ్గర శిష్యరికం పొందాడు. తర్వాత తత్వవేత్త యు.జి.కృష్ణమూర్తి సాంగత్యం పొంది ఆయనే నా లైఫ్ లైన్ అని ప్రకటించాడు. ఎ టేస్ట్ ఆఫ్ లైఫ్, ఆల్ దట్ కుడ్ హప్పెన్, క్వబోన్ కా సఫర్, లాంటి పుస్తకాలు రచించాడు. ఈయన సోదరుడు ముఖేష్ భట్‌తో కలిసి "విశేష్ ఫిలిమ్స్" బ్యానర్ పై ఎన్నో హిట్ చిత్రాలు నిర్మించి నూతన తారలను సినిమా రంగానికి పరిచయం చేశారు. మహేష్ భట్ తెలుగులో నాగార్జున నటించిన "కిల్లర్'' చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఆమె నా కుమార్తె కాకపోతే....

ప్రముఖ నటుడు హిమ్రాన్ హష్మి మహేష్ భట్ మేనల్లుడే. ఒక సారి స్టార్ డస్ట్ మ్యాగజైన్ కవర్ పేజీ నిమిత్తం తన కూతురుతో లిప్ లాక్ సీన్‌లో "పూజా నా కుమార్తె కాక పోతే" అనే ఫోటో చాలా వివాదం సృష్టించి సంచలనం రేపింది. తరువాత తండ్రి, కూతురు ఇది ఫేక్ ఫోటో అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరు ఏమైనా అనుకోని ముక్కు సూటిగా తన అభిప్రాయం తెలిపే వారిలో ప్రముఖ స్థానం మహేష్ భట్‌కే దక్కుతుంది.

(సెప్టెంబర్ 20న మహేష్ భట్ జయంతి)










ఆళవందార్ వేణు మాధవ్

86860 51752


Similar News