మట్టి పునరుజ్జీవనానికి ఏకమవుదాం

మట్టికి, మనిషికి విడదీయలేని సంబంధం ఉంది. మట్టి లేకపోతే మనిషి మనుగడే లేదు. 'ఈషా ఫౌండేషన్' వ్యవస్థాపకులు, సద్గురు లేదా జగ్గీ వాసుదేవ్‌గా

Update: 2022-06-21 18:45 GMT

పెరుగుతున్న జనాభా, ఆహార, నీటి కొరత కారణంగా 2050 నాటికి దాదాపు 100 కోట్ల మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు లేదా దేశాలకు వలస పోయే పరిస్థితి ఉత్పన్నం కావచ్చు. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడే 27 వేల రకాల జీవులు ఏటా అంతరించిపోవడం ఆందోళన కలిగించే పరిణామం. దాదాపు 80 శాతం పురుగుల జీవపదార్థం అంతరించే స్థాయికి సంక్షోభం చేరుకుంది. కార్బన్‌ను సంగ్రహించడంలో మట్టి పాత్ర చాలా కీలకం. కార్బన్ మట్టిలో మొక్కలలో కంటే మూడు రెట్లు, వాతావరణంలో కంటే రెండు రెట్లు ఎక్కువగా నిల్వ ఉంటుంది. ఇప్పటికైనా మట్టి పునరుజ్జీవనానికి పటిష్టమైన చర్యలు చేపట్టకపోతే అది 850 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేసి వాతావరణాన్ని విషతుల్యం చేస్తుంది.

ట్టికి, మనిషికి విడదీయలేని సంబంధం ఉంది. మట్టి లేకపోతే మనిషి మనుగడే లేదు. 'ఈషా ఫౌండేషన్' వ్యవస్థాపకులు, సద్గురు లేదా జగ్గీ వాసుదేవ్‌గా చిరపరిచితులైన ప్రముఖ యోగా గురువు, ఆధ్యాత్మికవేత్త జగదీష్ వాసుదేవ్ 'మట్టిని రక్షించు' (Save Soil) అనే ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ప్రపంచం ఇప్పటికే 52 శాతం నేలలలో భూసారం కోల్పోయింది. ఆ తరుణంలో వివిధ దేశాధినేతలందరితో పాటు ప్రపంచంలోని ప్రతి ఒక్కరిని ఈ బృహత్కార్యంలో భాగస్వాములను చేసి భూసారాన్ని పటిష్టం చేసేందుకు సమాయత్తం చేయాలన్నది ఈ ఉద్యమం ముఖ్య ఉద్దేశం. సేంద్రియత కోల్పోయిన మట్టి ఇసుకతో సమానం.

గత 50 సంవత్సరాలుగా వ్యవసాయ రంగం ఎక్కువగా యంత్రాలపై ఆధారపడుతున్నది. ఈ పరిస్థితులలో మట్టిలోని సేంద్రియతను పునరుజ్జీవింపచేసేందుకు చర్యలు చేపట్టకపోవడంతో భూసారం గణనీయంగా క్షీణించిపోయింది. మట్టిని పునరుజ్జీవింపచేయడానికి మొక్కలు, పశువుల వ్యర్థాలు అత్యంతావశ్యకం. అత్యాధునిక యంత్రాలు సైతం మనుషులు, పశువులకు బదులుగా పని చేయగలవు తప్ప మట్టిలో సేంద్రియతను చొప్పించలేవు. అందుకే మట్టిని పునరుజ్జీవింపచేసే చర్యల మీద ప్రపంచం దృష్టి సారించాలి. తక్షణ పరిష్కారంగా మట్టిలో మూడు నుంచి ఆరు శాతం సేంద్రియత అభివృద్ధి అయ్యేలా చర్యలు చేపట్టాలి. అత్యధిక భూభాగం చెట్ల నీడలో ఉండేలా, చెట్లు, జంతువుల వ్యర్థాల ద్వారా సమృద్ధం చేయాలి.

అందరినీ ఏకం చేసి

'సద్గురు' ప్రారంభించిన 'మట్టిని రక్షించు' అనే మహోద్యమం ప్రపంచ ప్రజలనందరినీ ఏకం చేయడానికి యత్నిస్తుంది. తద్వారా మట్టి సంక్షోభాన్ని పరిష్కరించి, జాతీయ విధానాలు రూపొంది కార్యరూపం దాల్చడానికి అన్ని దేశాలకు తన మద్దతు అందిస్తుంది. 64 సంవత్సరాల సద్గురు ఒంటరిగా 21 మార్చ్ 2022న లండన్‌లోని ట్రాఫాల్గర్ స్క్వేర్ వద్ద 'సేవ్ సాయిల్' బైక్ ర్యాలీ ప్రారంభించారు. రోజుకు దాదాపు 300 కి. మీ. చొప్పున 100 రోజులలో 26 దేశాల గుండా 30,000 కి.మీ ప్రయాణించి 21 జూన్ 2022 కోయంబత్తూర్‌లో ముగించేలా కార్యక్రమం రూపొందించుకున్నారు.

ప్రపంచ మానవాళికి మట్టిలోని సేంద్రియత ప్రాముఖ్యతను, భూసారాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను, మట్టిని పునరుజ్జీవింపచేసే చర్యల గురించి చైతన్యం తీసుకువచ్చేలా విస్తృత ప్రచారం చేయడానికి పూనుకున్నారు. ఈ ప్రయాణంలో సద్గురు ప్రభావవంత వ్యక్తులతో చర్చలు నిర్వహిస్తారు. అన్ని దేశాల నాయకులతో సంప్రదింపులు జరుపుతారు. సద్గురు కృషికి ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు, ట్రెవర్ నోహ్, జో రోగన్ వంటి మీడియా వ్యక్తులు, ది లా సొసైటీ, యూకే పార్లమెంట్, నేపాల్ రాయబార కార్యాలయం వంటి విభాగాలతో పాటు చిన్న పిల్లలు, యువత, ఇలా సమాజంలోని అన్ని వర్గాల మద్దతు లభించింది. వివిధ దేశాల నేతలు 'సేవ్ సాయిల్' ఉద్యమంలో భాగస్వాములయ్యేందుకు, ఈషా ఫౌండేషన్‌తో క‌లిసి ముందుకు సాగేందుకు ఒప్పందాలపై సంత‌కాలు చేశారు.

వేలాది మొక్కలు నాటి

సద్గురు ప్రారంభించిన 'కావేరి కాలింగ్ ప్రాజెక్ట్' ద్వారా ఇప్పటివరకు 1,25,000 మంది రైతులు 62 మిలియన్ మొక్కలు నాటారు. తరిగిపోతున్న కావేరి నదీ జలాలను తిరిగి పెంచడానికి ఇది వీలు కల్పించిందని ఈషా ఫౌండేషన్ తెలిపింది. 'పెద్ద సంఖ్యలో పౌరులు పాల్గొన్నప్పుడు పర్యావరణ సమస్యలు ఎన్నికల సమస్యలుగా మారతాయి. ప్రభుత్వాలు విధానాలను అవలంబిస్తాయి. పర్యావరణ పరిష్కారాలను దీర్ఘకాలికంగా అమలు చేయడానికి బడ్జెట్‌ను కేటాయిస్తాయి' అని ఈ ఇనిషియేటివ్ అవుట్‌ రీచ్ పేజీ పేర్కొంది. 1994లో స్థాపించిన 'యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిసెర్టిఫికేషన్' (UNCCD) పర్యావరణం, అభివృద్ధిని స్థిర భూ నిర్వహణకు అనుసంధానించే ఏకైక చట్టబద్ధ అంతర్జాతీయ ఒప్పందం. UNCCD సేవ్ సాయిల్ ఉద్యమంలో ముఖ్య భాగస్వామి. ఈ సంస్థ ఇషా ఫౌండేషన్‌కు సహకరిస్తుంది.

అప్రమత్తం కాకపోతే

వచ్చే 20 ఏండ్లలో ప్రపంచ జనాభా దాదాపు 930 కోట్లకు చేరుతుంది. ఆహారం మాత్రం 40 శాతం తక్కువ ఉత్పత్తి అవుతుందని అంచనా. దీంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆహార సంక్షోభం ఏర్పడుతుంది. ఇప్పటికే 90 శాతం పోషక విలువలు కోల్పోయిన కూరగాయలు, సారం కోల్పోయిన మట్టి కారణంగా పోషక విలువలు లేని ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్ల మంది ప్రజలు దీంతో వివిధ జబ్బులకు లోనవుతున్నారు. మన పూర్వీకులు ఒక ఆరెంజ్ ద్వారా పొందిన పోషక విలువలను నేడు మనం పొందడానికి కనీసం ఎనిమిది ఆరెంజ్‌లు తినాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే పోషక విలువలు ఏ స్థాయిలో అంతరించిపోయాయో అర్థం చేసుకోవచ్చు. వాన నీరు భూగర్భానికి చేరకపోవడం, వాన నీటిని సంరక్షించకుండా యథేచ్చగా తోడేయడంతో అతివృష్టి, అనావృష్టికి దారి తీస్తుంది. పెట్టుబడులకు తగిన నాణ్యమైన దిగుబడులు రాక రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

పెరుగుతున్న జనాభా, ఆహార, నీటి కొరత కారణంగా 2050 నాటికి దాదాపు 100 కోట్ల మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు లేదా దేశాలకు వలస పోయే పరిస్థితి ఉత్పన్నం కావచ్చు. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడే 27 వేల రకాల జీవులు ఏటా అంతరించిపోవడం ఆందోళన కలిగించే పరిణామం. దాదాపు 80 శాతం పురుగుల జీవపదార్థం అంతరించే స్థాయికి సంక్షోభం చేరుకుంది. కార్బన్‌ను సంగ్రహించడంలో మట్టి పాత్ర చాలా కీలకం. కార్బన్ మట్టిలో మొక్కలలో కంటే మూడు రెట్లు, వాతావరణంలో కంటే రెండు రెట్లు ఎక్కువగా నిల్వ ఉంటుంది. ఇప్పటికైనా మట్టి పునరుజ్జీవనానికి పటిష్టమైన చర్యలు చేపట్టకపోతే అది 850 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేసి వాతావరణాన్ని విషతుల్యం చేస్తుంది. అందుకే మనం సద్గురు ప్రారంభించిన మట్టి పరిరక్షణ ఉద్యమానికి చేయూతనందించి మట్టి ఋణం తీర్చుకుందాం.

 యేచన్ చంద్రశేఖర్

హైదరాబాద్

88850 50822

Tags:    

Similar News