ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారి ఓట్లే కీలకం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారి ఓట్లే కీలకం... language pandits votes are crucial in MLC elections
వచ్చే నెలలో హైదరాబాద్, రంగారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటు హక్కు ఉన్నవారు కేవలం హైస్కూల్లో బోధించే స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు. ప్రాథమిక పాఠశాలలో బోధించే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఓటు హక్కు లేదు. అయితే వీరు ప్రస్తుత ఎమ్మెల్సీ మీద పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. ఉద్యోగస్తుల బదిలీల కోసం 317 జీవో రావడం, భాషా పండితుల అప్‌గ్రేడ్‌కు సంబంధించిన హామీలు నెరవేర్చలేదనే గుర్రుతోనే ఉన్నారు. వరుసగా రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా గెలిపించినా దశాబ్దాలుగా ఉన్నటువంటి భాషా పండితుల పదోన్నతులకు సహకరించలేదని ఆయన పట్ల పూర్తి వ్యతిరేకతో ఉన్నారు భాషా పండితులు.
ఓటింగ్ బహిష్కరించే దిశగా..
భాషా పండితులను కూరలో కరివేపాకు లాగా కేవలం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఇదిగో పదోన్నతులు, అదిగో భాషా పండితుల సమస్యలు క్లియర్, పండితుల కల సాకారం అంటూ పతాక శీర్షికలతో వార్తలు రావడం... వాటిని చూపి పండితుల వర్గాల్లో ఆశలు కలిగించి, ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని భాషా పండితుల సమస్యలు పట్టించుకోవడం లేదు. మరోవైపు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు హామీ ఇస్తూ, భాషా పండితుల సమస్యలు నెరవేరుస్తామని మాటలు చెబుతూ ఇద్దరి మధ్య వైరం పెంచేటట్లు చేశారు. దీంతో భాషా పండితుల పదోన్నతులలో మాకు సింహభాగం కావాలని ఎస్‌జీటీ మిత్రులు కోర్టుకు వెళ్ళడం, దానిపై కోర్టు స్టే విధించడం సర్వసాధారణమైపోయింది. ఈ సమస్యను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ తీర్చలేదు. కోర్టు కారణంగా ఈ సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. అందుకే వచ్చే నెలలో జరగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో భాషా పండితులు పాల్గొనకుండా ఎన్నికలను బహిష్కరించే ఆలోచనలో ఉన్నారు. ఈ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకోకుండా తమ నిరసన తెలపనున్నారు. పండితుల సమస్యలు పరిష్కరించకుండా కేవలం ఓట్లు, సీట్లు లక్ష్యంగా పనిచేసే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు ఇది చెంపపెట్టు. అందుకే ఎమ్మెల్సీ అభ్యర్థులు ముందుగా వారి సమస్యలు పరిష్కరించడంలో సహకరిస్తేనే ఓట్లు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికలలో వారి ఓట్లే కీలకంగా మారనున్నాయి. న్యాయబద్ధంగా అందరూ కలిసి భాషా పండితుల విషయంలో ముందుకు వస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. అందుకే అభ్యర్థులు ఎన్నికల కంటే ముందే పదోన్నతులు ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. ఈ విషయంలో అభ్యర్థులు సానుకూల దృక్పథంతో సమస్యను పరిష్కరిస్తారని సమస్త భాషా పండిత వర్గం కోరుకుంటుంది.
యాడవరం చంద్రకాంత్ గౌడ్
9441762105