'మా జీవితాల్లో ప్రేమలుండవు. త్యాగాలే ఉంటాయి. ఇక దొబ్బేయ్. నీ దారి నువ్వు చూసుకో...' తన నేపథ్యం ఏమిటో తెలియకుండా తనను ప్రేమించి వెంటబడిన కానిస్టేబుల్‌తో ఒక మహిళా నక్సలైట్ చెప్పిన మాట. 'నువ్వు పెట్టిన దొంగ సంతకం వల్ల నా జీవితం సంకనాకి పోయింది తెలుసా.. నేను కనబడితే మా వాళ్ళు కాల్చేస్తారు. మీ వాళ్లకు కనబడితే వాళ్లూ నన్నే కాల్చేస్తారు. ఎటునుంచి చూసినా బుల్లెట్ బంపర్ ఆఫర్ నాకే మరి. నన్ను కూడా తీసుకుపోండి మీతోపాటు.' ఇది తాను ప్రేమించిన మహిళా నక్సలైట్‌కు ఆ పోలీసు కానిస్టేబుల్ రూపంలోని ప్రేమ పిచ్చోడి అభ్యర్థన. 'సరే. ఒకటి గుర్తుంచుకో.. మళ్లీ ప్రేమా గీమా అన్నావనుకో. అడవిలో నిన్ను అక్కడే వదిలేసి వెళ్లిపోతాను సరేనా..' ఆ మహిళా నక్సలైట్ హెచ్చరిక..
పోలీస్ రైడ్‌లో దళం నుంచి వేరై పదిరోజులపాటు అడవిలోనే దాక్కోవలసి వచ్చిన ఆ పోలీసు, ఆ మహిళా నక్సలైట్ జీవితంలో ఏ మార్పులు చేసుకున్నాయి అని చూపే సినిమా 'లంబసింగి'. విశాఖ జిల్లా లంబసింగి అటవీ నిసర్గ సౌందర్యాన్ని ప్రారంభం నుంచే చూపిస్తూ ప్రేమ దృశ్యాలతో అల్లుకున్న సినిమాలో నిజానికి ఇలా జరుగుతుందా, పోలీసు కుర్రాడికి, మహిళా నక్సలైటుకు మధ్య ప్రేమ చిగురించడం సాధ్యమా? అనే సందేహాన్ని కాస్త పక్కన బెట్టి చూస్తే ఈ సినిమా ఎవరినైనా ఆకర్షిస్తుంది. భరత్ రాజా, బిగ్ బాస్ ఫేమ్ దివి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నవీన్ గాంధీ దర్శకత్వం వహించారు. హరిత పాత్రలో బిగ్ బాస్ దివ్య అద్భుత పాత్ర పోషణ లంబసింగి సినిమాకే హైలెట్. బలహీనమైన కథకు నిజంగానే పుష్టినిచ్చిన పాత్ర ఆమెది.
కథేమిటంటే..
లంబసింగి వీరబాబు, హరితల ప్రేమకథతో రూపొందింది. వీరబాబు అరకులోయ సమీపంలోని లంబసింగి అనే గ్రామానికి పోస్టింగ్ పొందే కానిస్టేబుల్. అతను గ్రామంలోని హరిత అనే అందమైన అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆమేమో లొంగిపోయి జనజీవితంలో బతుకుతున్న కోనప్ప అనే నక్సలైట్ కూతురు. ఆ గ్రామంలోనే నివసిస్తున్న నక్సలైట్లు ఈ గ్రామాన్ని తమ హాట్‌స్పాట్‌గా మార్చే వరకు జీవితం ప్రశాంతంగా ఉంటుంది. వారు పనిచేయడం ప్రారంభించి పోలీసు స్టేషన్‌పై దాడిచేసి వీరబాబును గాయపర్చి మరీ ఆయుధాలు పట్టుకుపోవడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది. ఇది గ్రామస్తుల జీవనోపాధిని కష్టతరం చేస్తుంది. స్టేషన్‌పై దాడిచేసిన దళంలో హరిత కూడా ఉండటం కళ్లారా చూసిన పోలీసు వీరబాబు సస్పెండ్ అయినప్పటికీ హరితను మర్చిపోలేక, దళం ఆచూకీ కోసం వెదుకులాడి ఎట్టకేలకు దళం ఉన్న చోటుకు చేరుకుంటాడు. తర్వాత జరిగేదేమిటన్నదే ‘లంబసింగి’ సినిమా.
కొన్ని సీన్లు సాగదీసినా..
మొత్తం మీద, లంబసింగి అనేది ప్రేమ, మానవ విముక్తికి సంబంధించిన పదునైన అన్వేషణను అందించే ఆకర్షణీయమైన రొమాంటిక్ డ్రామా. పూర్తిగా భిన్న ప్రయాణాలు కలిగిన ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ, వైరుధ్యాల సంక్లిష్టతను వివరించడానికి ప్రయత్నించిన సినిమా ఇది. వేసవిలో షూటింగ్ చేసినప్పుటికీ కె. బుజ్జి సినిమాటోగ్రఫీ లంబసింగి అందాలను పట్టిచూపింది, కథనంలోని శృంగార వాతావరణాన్ని పెంచుతుంది. ఆర్ఆర్ ధృవన్ సంగీతం విజువల్స్‌ను చక్కగా మలిచింది, మొత్తం సినిమా అనుభవాన్ని సంగీతం మెరుగుపరుస్తుంది. 'ఆకూ పచ్చ చీర కట్టూకున్నదట అందంగా ఈ చోటూ' పాట లంబసింగి ప్రాకృతిక సౌందర్యాన్ని ప్రారంభంలోనే అద్భుతంగా వర్ణించింది.దర్శకుడు నవీన్‌గాంధీ ఈ లోబడ్జెట్ సినిమాలో ఒక పదునైన కథను చెప్పడంలో విజయం సాధించాడు. ఈ చిత్రం ఖచ్చితంగా వినోదాన్ని పంచుతుంది కానీ తొలి నుంచి కథ స్లోగా నడవడం, కొన్ని సీన్లలో సాగదీత ప్రేక్షకులకు చికాకు కలిగించే విషయం.
అసంబద్ధ విషయాలను విస్మరించగలిగితే..
అయితే సినిమా చివర్లో విరాటపర్వం సినిమా తరహా ట్విస్టింగ్‌తో ఒక్కసారిగా వీక్షకుల మూడ్‌ని తారస్థాయికి తీసుకెళుతుంది. ‘దళానికి ద్రోహం తలపెట్టానంటూ తనపై చేసిన ఆరోపణలను నిరూపించండి. తర్వాత ఏ శిక్ష విధించినా భరిస్తాను’ అని చెప్పిన కన్నకూతురుని ఉద్యమ నాయకుడైన కన్నతండ్రి ఉన్నపళాన కాల్చి చంపడం ప్రేక్షకులకు షాక్ తెప్పిస్తుంది. కొన్ని అసంబద్ధ విషయాలను విస్మరించగలిగితే, లంబసింగి మూవీ అందరూ చూడాల్సిన ఎంటర్‌టైనర్. అడవి గూడెంలో ఈ జంటకు ఆశ్రయం ఇచ్చిన దంపతుల కామెడీ మాత్రం బ్రహ్మాండంగా పండించారీ సినిమాలో. ఇటీవలే డిస్నీ హాట్ స్టార్‌లో లంబసింగి సినిమా స్ట్రీమ్ అవుతోంది. దళనాయకుడు లొంగిపోయి కూడా పార్టీ పనులను రహస్యంగా చేస్తుండటం, అతడిపై నిఘా విషయంలో పోలీసుల పూర్తి వైఫల్యం, పార్టీ నాయకుడిని తొలగించి తాను నాయకుడుగా మారాలనే తలంపుతో సెకండ్ ప్లేస్‌లో ఉన్న దళ నాయకుడు కుట్రచేసి మహిళా నక్సలైటును కన్నతండ్రి స్వయంగా హతమార్చేలా చేయడం, దళసభ్యురాలు హరిత తన జీవితంలో తొలినుంచి దొరకని ప్రేమ కారణంగా కానిస్టేబుల్ వీరబాబు ప్రేమకు ఎట్టకేలకు ఒకే చెప్పడం... ఇన్ని అసంబద్ధతల మధ్య కూడా సినిమా చూడాలనిపిస్తుందంటే లంబసింగి అటవీ సౌందర్యం, చక్కటి సంగీతం, పేలిన డైలాగులు, ఒకటి రెండు మంచి పాటలు సూటిగా మనసును తాకడం ముఖ్యంగా హుందాను, గాంభీర్యాన్ని ఆద్యంతం చక్కగా పోషించిన దివ్య నటన వంటి ప్రత్యేకతలే కారణం.
నటీనటులు: దివి వద్యా, జై భారత్ రాజ్,
దర్శకులు: నవీన్ గాంధీ,
నిర్మాత: ఆనంద్ తన్నీరు
లభ్యం: డీస్నీ హాట్ స్టార్
కె. రాజశేఖరరాజు
73964 94557