లంబాడాలు ఎస్‌టీలు కాదా?
లంబాడాలు ఎస్‌టీలు కాదా?... Lambadas or not Scheduled tribes says vuke ramakrishna dora
ప్రాంతేతరుడు తప్పు చేస్తే ప్రాంతం దాటేదాక తరిమేద్దాం, ప్రాంతం వాడు తప్పు చేస్తే ప్రాంతంలోనే పాతరేస్తాం' అన్నారు కాళోజీ. 'తెలంగాణ ఒక రాష్ట్రం కావాలి. ఆదివాసీ ప్రాంతాలకు స్వయంపాలన రావాలి' అని ఆకాంక్షించారు ప్రొ. బియ్యాల జనార్దన్‌రావు. కానీ, నేడు తెలంగాణలో జరుగుతున్నదేమిటి? 'ఆంధ్రా వలసవాదులు తెలంగాణ సంస్కృతిని నాశనం చేసారు, అస్తిత్వ మూలాలను ధ్వంసం చేసారు. నీళ్లు, నిధులు, నియామకాలు దోచుకున్నారు' అంటూ 1969 నుంచి 2014 వరకు ఎందరో అమరవీరుల నెత్తుటి సాక్షిగా 57 యేండ్ల పురిటి నొప్పులతో పడిలేచిన, తెలంగాణ నేడు రాష్ట్రం సిద్ధించాక జరుగుతున్నదేమిటి?
ముల్కీ నిబంధనలతో వచ్చిన 610 జీఓ, 1956 స్థానికత అనే అంశాలు తెలంగాణలో ప్రధానమైన క్రమంలో, నాడు ఆంధ్రావలసలు తప్పు అని మాట్లాడి, కొట్లాడింది తెలంగాణ సమాజం. మరి, నేడు మహారాష్ట్రలో బీసీలుగా, కర్నాటకలో ఎస్‌సీలుగా, రాజస్థాన్ ఓసీలుగా చెలామణి అవుతూ, తెలంగాణకు లక్షలాదిగా వలసలు వచ్చిన లంబాడాలు రిజర్వేషన్, విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాలలో ఆదివాసీలను దోచుకుంటుంటే, ఈ వలసల గురించి మాత్రం ఎందుకు మాట్లాడడం లేదు? ఒకే రాష్ట్రంలో ఉన్న ఆంధ్రావి వలసలు కానీ, పక్క రాష్ట్రాల నుంచి వచ్చే లంబాడాలవి వలసలు కావా? తెలంగాణను దోచుకుంటే అన్యాయం, ఆదివాసీలను దోచుకుంటే న్యాయమా?
లంబాడాలు ఎస్‌టీలు కాదు
దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక షెడ్యూల్డ్ తెగలను(scheduled tribe) గుర్తించే క్రమంలో రాజ్యాంగ పరిషత్ ఆంధ్ర ప్రాంతంలోని మద్రాస్ ప్రెసిడెన్సీలో 18 తెగలను, హైదరాబాద్ రాష్ట్రంలోని మూడు తెగలను ఆర్టికల్ 342లో(article-342) చేర్చింది. ఇవి మాత్రమే షెడ్యూల్డ్ తెగలుగా పరిగణించబడుతాయి. ఈ జాబితాలో సుగాలీలు చేర్చబడలేదు. అటువంటప్పుడు వీరు ఎస్‌టీలు ఎలా అవుతారు? ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అనంతరం 342 ఆర్టికల్‌తో సంబంధం లేకుండా సుగాలీలను ఆంధ్ర రాష్ట్రం వరకు ఎస్‌టీ జాబితాలో చేర్చారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాక సుగాలీలను 29-10-1956న జాబితా నం. 18లో చేర్చడం జరిగింది తప్ప 342 ఆర్టికల్ క్రింద మాత్రం ఎస్‌టీలుగా గుర్తించలేదు.
లంబాడాలు, సుగాలీలు ఒక్కటేనని తెలంగాణ ప్రాంతంలో ఎస్‌టీలుగా చేర్చాలని ప్రతిపాదన వచ్చింది. 1793 (ఎస్‌డబ్ల్యూ) జీఓ ప్రకారం బీసీలుగా రిజర్వేషన్ పొందుతున్న లంబాడాలను ఎంఎస్ నం.149 (ఎస్‌డబ్ల్యూ) ప్రకారం 3-5-1978న తెలంగాణ డీఎస్‌టీ డీనోటిఫైడ్ ట్రైబ్స్‌గా 8వ షెడ్యూల్ ఆదివాసీ భూభాగంలో కాకుండా, మైదాన ప్రాంతంలో, అది కూడా విద్యారంగంలోనే ఎస్‌టీ జాబితాలో కలిసారు తప్ప ఆర్టికల్ 342 క్రింద కాదు. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్(ministry of tribal affairs) న్యూఢిల్లీ ధ్రువీకరించిన దానిలో కూడా 'The Lambada Community has not been notified as Scheduled Tribe Under Article 342 of the constitution in the state of Andhra Pradesh' అని పేర్కొంది.
నిబంధనలు కాదని
రాజ్యాంగం ప్రకారం ఒక కులాన్ని తెగగా గుర్తించాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ముందుగా ప్రభుత్వం కమిషన్ నియమించాలి. తెగగా గుర్తించబడాలంటే, ఏ ప్రాంతంలోనైనా ఒకే తెగగా పిలవబడుతూ ఆదిమ లక్షణాలు కలిగి ఉండాలి. నాగరిక సమాజంతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి బెరకు చూపుతుండాలి. దట్టమైన అడవుల కేంద్రంగా స్థిర నివాసం కలిగి ఉండాలి. ప్రత్యేక భాష, వేషధారణ కలిగి ఉండాలి. ప్రత్యేక సంస్కృతీ, సంప్రదాయాలతో వెనుకబాటుతనం కలిగి ఉండాలి.
గవర్నర్ నిర్ధారణ అనంతరం జాతీయ షెడ్యూల్డ్ తెగలు, కులాల కమిషన్, ఆంత్రోపాలజీ డిపార్ట్ మెంట్(antropology department) చేత చివరిసారి గుర్తింపు పూర్తి చేసి పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలి. ఆర్టికల్ 342 సవరణ తరువాత రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే అప్పుడు ఎస్‌టీలుగా గుర్తించబడతారు. ఇదేమీ జరుగకుండానే లంబాడీలు ఎస్‌టీలుగా చెలామణి అవుతూ ఆదివాసీల రిజర్వేషనే కాకుండా, భూములు సైతం దోచుకుంటున్నారు. ఓటు బ్యాంకు మత్తులో రాజకీయ పార్టీలు లంబాడీలకు(lambadies) పెద్దపీట వేస్తున్నారు.
లంబాడీల వలస
'ఒక లంబాడా కుటుంబం ఒక గోండు లేదా కౌలాం గూడేనికి చేరిందంటే లంబాడా కుటుంబాలు పెరుగుతాయి. గోండు కుటుంబాలు ఖాళీ అవుతాయి' అన్నారు మానవ పరిణామ శాస్త్రవేత్త హైమాండార్ఫ్. వాస్తవంగా ఇప్పుడు అదే జరుగుతోంది. ప్రపంచంలో ఇంతకంటే పెద్ద అన్యాయం ఎక్కడా కనబడదు. తెలంగాణలో లంబాడాల జనాభా 1961లో 81,366. ఇప్పుడు దాదాపు 24 లక్షలు. ఆదివాసీల జనాభా తొమ్మిది లక్షలకు పైగా ఉంది. 2010 ఉద్యోగాల గణాంకాలు చూస్తే ఎరుకల, యానాది 90 శాతం పొందగా, 10 శాతం ఉద్యోగాలు మాత్రం 30 ఆదిమ తెగలకు దక్కాయి.
75 యేండ్ల స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క ఆదివాసీ కూడా ఐఏఎస్, ఐపీఎస్ కాలేకపోయారు. లంబాడాల నుంచి మాత్రం ఒక్క నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోనే 27 మంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు. తెలంగాణలో 70 మంది దాకా ఉన్నారు. గ్రూప్ ఉద్యోగాలలోనూ 93 శాతం వారే ఉన్నారు. యూనివర్సిటీ ప్రొఫెసర్ స్థానాలలోను వారే అధికంగా ఉన్నారు. విద్యా సంస్థలలోనూ వారే ఎక్కువగా ఉన్నారు. చివరకు రాజకీయ కుట్రలతో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయాన్ని(central tribal university) కూడా ఆదివాసీ ప్రాంతంలో కాకుండా మైదాన ప్రాంతమైన ములుగులో ఏర్పాటు చేస్తున్నారు. రాజకీయంగానూ సర్పంచ్ స్థాయి నుంచి గిరిజన మంత్రి, పార్లమెంటరీ కమిటీ సభ్యుల వరకు లంబాడాలనే నియమించింది ప్రభుత్వం.
వారి మీదనే సర్కారుకు ప్రేమ
తెలంగాణ ప్రభుత్వం మాత్రం నిజమైన అడవి బిడ్డలు లంబాడాలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నది. పోలవరం ముంపు ప్రాంతాల నుంచి ఆదివాసీలను పంపించేశారు. త్యాగం అనుకున్నాం. హరితహారం పేరిట భూములను గుంజుకున్నారు. ఓపిక పట్టాం. ఓపెన్ కాస్ట్‌ల పేరుతో, టైగర్ జోన్ పేరుతూ అడవి నుంచి ఆదివాసీలను(tribes) దూరం చేస్తున్నారు. అయినా గమ్మున ఉన్నాం. కానీ, నిన్నటికి నిన్న మా ఆస్తిత్వాన్ని నిలబెట్టిన కొమురం భీమ్ రక్తం చిందించిన జోడేఘాట్ యుద్ధభూమిలోకి లంబాడాల సంస్కృతిని పంపించారు. తెలంగాణ అస్తిత్వ పోరాటంతో సంబంధం లేని సేవాలాల్‌ను(sevalal) తీసుకొచ్చి జిల్లాకు పది లక్షల చొప్పున విడుదల చేసి ఆదివాసీ పోరాట వీరులను కించపరిచారు.
ఆదివాసీలారా ఇకనైనా మేల్కొనండి. అక్రమంగా ఎస్‌టీలుగా గుర్తించిన లంబాడాలను ఆ జాబితా నుంచి వెంటనే తొలగించాలి. 1950 యాక్ట్ ప్రకారం గుర్తించిన ఎస్‌టీ జాబితాలో చేర్చబడిన తెగలకే ఎస్‌టీ ధ్రువీకరణ, ఎజెన్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలి. తెలంగాణలో లంబాడాలతో మనం భవిష్యత్ ప్రయాణం చేయలేం. మన అస్తిత్వం కోసం ఇప్పపూల దండులా 9-12-2022న ఇంద్రవెల్లిలో తుడుందెబ్బ నిర్వహించే భారీ బహిరంగ సభకు లక్షలాదిగా తరలివచ్చి ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలా మన సత్తా చాటుదాం.
( నేడు ఇంద్రవెల్లిలో జరుగనున్న తుడుందెబ్బ బహిరంగ సభ సందర్భంగా)
ఆదివాసీల డిమాండ్‌లు
- చట్టబద్ధతలేని లంబాడాలను ఎస్‌టీ జాబితా నుంచి తొలగించాలి
- ఆదివాసీలు సాగుచేస్తున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలి
- పెసా, 1/59, 1/70 చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి
- జీఓఎంఎస్ నం.3 ను యథాతథంగా అమలు చేయాలి
- 5వ షెడ్యూల్ ప్రాంతంలోని 29 ప్రభుత్వ శాఖలలో ఆదివాసీ యువకులనే నియమించాలి
- గిరిజన యూనివర్సిటిని ఆదిలాబాద్ జిల్లాలోనే ఏర్పాటు చేయాలి
- స్పెషల్ డీఎస్‌సీ వేసి ఆదివాసీ యువతనే నియమించాలి.
వూకె రామకృష్ణ దొర
జర్నలిస్ట్, కాలమిస్ట్
98660 73866