అరుదైన గోండి లిపి చరిత్రకారుడు
గుంజాల గోండి లిపి, భాషా పండితుడు కోట్నక్ జంగు ఆదివారం ఉదయం మరణించారు. వీరి స్వస్థలం ఆదిలాబాదు జిల్లా, సార్నూరు
గుంజాల గోండి లిపి, భాషా పండితుడు కోట్నక్ జంగు ఆదివారం ఉదయం మరణించారు. వీరి స్వస్థలం ఆదిలాబాదు జిల్లా, సార్నూరు మండలం, గుంజాల గ్రామం. ఆయన వయసు 90 ఏళ్లు. ఆయన గోండి, తెలుగు, ఇంగ్లీషు, మరాఠి భాషలలో ఏడవ తరగతి వరకు అభ్యసించారు. 1940 ప్రాంతంలో పెందోర్ లింగోజీ, కుంరా గంగోజి రాసిన రాతప్రతులను కోట్నక్ జంగు చదివారు. ఆ లిపిలో పాండిత్యం సంపాదించారు. ఆ రాత ప్రతులు 2006లో వెలుగుచూశాయి. ఆ లిపిలో రాయడం, చదవడంలో జంగు నిష్ణాతుడు. గుంజాల గోండి లిపి అధ్యయన వేదిక ఆ రాతప్రతులను సాఫ్ట్‌వేర్ చేయడంలో, వాచకాలు తయారు చేయడంలో వీరు ముఖ్య పాత్ర పోషించారు. ఎన్నో ఏళ్లుగా ఆ రాత ప్రతు లను తన ఇంటిలోనే భద్రంగా దాచి ఉంచారు. గుంజాల లిపిలో గోండి భాషలో స్వీయ చరిత్ర కూడా రాసుకున్నారు. గోండి సాంస్కృతిక మూలాలను అలవోకగా చెప్పేవారు. ఆ భాషలో పదివేల కోట్ల సంఖ్య వరకు వివరించేవారు. గోండుల చరిత్రని అలవోకగా చెప్పేవారు. గోండు జాతి పుట్టుక గురించి కథలు సేకరించడంలో సహకారం అందించారు. వారి మరణం గోండి భాషకు, గుంజాల లిపికి తీరని లోటు.
ఈ మధ్య జ్వరం, ఉబ్బసంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. తన మరణం గురించి తెలిసిన జంగు, లిపి ఏమైపోతుందో అని వ్యధ కూడా చెందేవారు. గుంజాల గోండీ లిపి వేదిక కన్వీనర్ ఆచార్య గూడూరు మనోజ, లిపి సేకర్త జయధీర్ తిరుమలరావు సంతాపం వ్యక్తం చేశారు. కోట్నక్ జంగు ఆవలితీరం చేరారు. కానీ గోండుల సంస్కృ తి, భాష, లిపి నిలిచి ఉంటాయని అభిప్రాయ పడ్డారు. ఒక దేశీయ, ఆదివాసీ పండితుడు జంగు మరణం పట్ల కేంద్రీయ విశ్వవిద్యాల యం సిడాస్ట్ కేంద్రం ప్రొ.కృష్ణ, ప్రొ. సర్రా జు, గూడూరు మనోజ సంతాపం వ్యక్తం చేశారు.
- జయధీర్ తిరుమలరావు
99519 42242