ముద్దంటే చేదా..... నీకా ఉద్దేశం లేదా.... అంటారు ఒక సినీ గేయ రచయిత. అవును మరి ముద్దంటే ఎవరికి చేదు. శృంగారంలో ముద్దుకి ఎంతో ప్రాధాన్యత ఉన్నది. ముద్దులేనిదే శృంగారమే లేదు అనడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఒక ఇంగ్లీష్ కవి ఒక స్త్రీ తో మొదటి ముద్దును ధూమపానంలో ఆఖరి దమ్ముతో పోలుస్తున్న అనుభూతి పొందుతారని అన్నారు. కానీ ఇవన్నీ తలుపు చాటున జరగవలసిన వ్యవహారాలే గాని, బహిరంగంగా జరిగితే అనర్థాలే కదా! చుంబనాలే ఇప్పుడు సినిమా ప్రపంచాన్ని శాసిస్తున్నాయి.
తన ప్రభావాన్ని తగ్గించుకుంటూ..
'సినిమా' ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రభావవంతమైన సామాజిక మాధ్యమం. మన దేశంలో కూడా అంతే ప్రాధాన్యత గల చలనచిత్ర రంగం ప్రజలలో అంతర్భాగం అయింది. సినిమాలు చూడని, సినిమాలు అంటే తెలియని వ్యక్తులే ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ప్రజలపై, ముఖ్యంగా యువతపై ఎంతగానో ప్రభావం చూపుతుంది సినిమా. సినిమా రంగం యొక్క ప్రభావం యువతపై ఎంతగానో ఉన్నది. సినీ హీరోలను, హీరోయిన్లను యువత అనుకరిస్తూ దానిని కొత్త ట్రెండ్ అనే భావనలో ఉంటున్నారు. హెయిర్ స్టైల్ నుండి చెప్పుల వరకు వారిని ఫాలో అవుతున్నారు. ఇంతటి ప్రభావాన్ని చూపిస్తున్న సినిమా సామాజిక బాధ్యతను విస్మరిస్తున్నదా అనిపిస్తుంది. నేటి సినిమాలు చూస్తుంటే మితిమీరిన శృంగారంతో పాటు, 'లిప్ లాక్' పేరుతో హద్దు మీరుతున్న ముద్దు సీన్లు సినిమాల స్థాయిని దిగజారుస్తున్నాయి. సినిమాలలో హీరో పాత్రలో ఉన్న నటుడు, హీరోయిన్ పాత్రలో ఉన్న నటీ మణితో నోటితో నోరు పెట్టి, పెదాల కలబోతతో కొన్ని నిమిషాల పాటు అదే పనిగా విశృంఖలంగా చేస్తున్న శృంగార సన్నివేశాలు, బాలీవుడ్‌లోనే కాదు అన్ని భారతీయ భాషల్లోని చిత్రాల్లోనూ దర్శనమివ్వడం సామాజిక దృక్పథం ఉన్న ప్రతి ఒక్కరికి ఆందోళన కలిగిస్తున్నది. ఈ సీన్లు సోషల్ మీడియాలోనూ, ఇతర మాధ్యమాలలోనూ, చివరికి కొన్ని ప్రధాన ఛానళ్ళలోను సినిమా ప్రమోషన్లకు వాడుకోవడంతో క్రమశిక్షణతో పిల్లలని పెంచుకోవాలనుకునే తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
దేశంలో సెన్సార్ వ్యవస్థ క్రమక్రమంగా తన ప్రభావాన్ని తగ్గించుకుంటూ పోవడం ఆలోచించవలసిన విషయం. ఒకపక్క ఇంటర్నెట్ ప్రభావంతో పాశ్చాత్య ప్రభావం, వెబ్సైట్లలో ఏరులై పారుతున్న నీలి చిత్రాలు నియంత్రించడానికి సరైన యంత్రాంగం లేకపోవడంతో సమాజంపై చెడు ప్రభావం అధికమవుతున్నది. మరో ప్రక్క సినిమాలలోనూ అదే తీరుతో వ్యవహారం మరింత ముదిరి పాకాన పడుతుంది. ఈ మధ్య ఒక బాలీవుడ్ సినిమాలో ఐదు పదుల వయసు దాటి టీనేజ్ వయసు పిల్లలు ఉన్న ఒక మాజీ హీరోయిన్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో గాఢమైన చుంబనాలతో లిప్ లాక్ లో పాల్గొన్న సన్నివేశం చూసి ముక్కున వేలు వేసుకోకమానం. ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితులు వస్తాయని ఎన్నడూ భావించలేదని పెద్ద వయసు వారు బాధపడుతున్నారు.
ఆ తీరు ఆందోళనకరం..
తొలినాళ్ళలో సినిమాల్లో శృంగారం నర్మగర్భంగా ఉండేది. కధకు అవసరమనిపిస్తే తప్ప శృంగార సన్నివేశాలకు ప్రాధాన్యతను ఇచ్చేవారు కాదు. అది కూడా బొమ్మలు,కళా చిత్రాల ద్వారానో ఇన్ డైరెక్ట్‌గా ప్రేక్షకులకు తెలియజేసేవారు. రాను రాను పాశ్చాత్య ప్రభావంతో సినిమా రంగంలో శృంగార సన్నివేశాల ప్రభావం అధికమవుతూ వచ్చింది. ప్రస్తుతం అది ఏ స్థాయికి వచ్చిందంటే నిర్మాతలు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు, మూడు నాలుగు రెట్ల ఆదాయం రావాలంటే శృంగార సన్నివేశాలు తప్పనిసరి అనే స్థాయికి. అందుకు సిద్ధపడి వచ్చే వారికి మాత్రమే హీరోయిన్లుగా ఛాన్సులు వస్తుంది. ఈ ట్రెండ్ తెలుగు సినిమాల్లోనూ విచ్చలవిడిగా చొచ్చుకొని వస్తున్నది. ఇటీవల విడుదలైన ఒక తెలుగు సినిమాలో ఒక సీనియర్ హీరోయిన్ ఒక కుర్ర హీరోతో చేసిన శృంగార సన్నివేశాలు సగటు తెలుగు వారిని ఔరా అనిపించకమానవు.
ఈ తరహా చిత్రాలు విజయవంతం అవుతున్నాయి కాబట్టే, ప్రేక్షకులు చూస్తున్నారు కాబట్టే మేము తీస్తున్నామని సినీ వర్గాలు అంటుంటే, వారు తీస్తున్నారు కాబట్టే మేము చూస్తున్నామని యూత్ అంటుంది. కౌమార దశలో యువత చెడు ప్రభావానికి లోనైనంతగా, మంచి వైపుకు వెళ్ళదు. ఒక సామాజిక బాధ్యతగా భావించి సినీ రంగం తమను తాము నియంత్రించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరోపక్క ప్రభుత్వం సెన్సార్ వ్యవస్థలను పునర్వ్యవస్థీకరించాలి. ఇంతేగాక చలనచిత్రాల్లో ధూమపానం అదుపు తప్పుతున్న తీరు ఆందోళన దాయకం. ఆ మధ్య వచ్చిన ఒక రాజకీయ నేపథ్యం ఉన్న చలనచిత్రంలో మహిళా జర్నలిస్టుగా నటించిన నటి సిగరెట్ తాగుతూ దాదాపు అన్ని సీనులలోను కనిపిస్తుంది. ఈ సన్నివేశాలు ఆ ఒక్క చలనచిత్రంలోనే కాక దాదాపు చాలా సినిమాల్లో కనిపిస్తున్నాయి. మరో ప్రక్క బుల్లితెర సీరియల్స్, వెబ్ సిరీస్ లలోను అదే ట్రెండ్. ఇప్పటివరకు మద్యపానం, ధూమపానం సన్నివేశాలలో మగవారు మాత్రమే కనిపించే వారు. ఇటీవల కాలంలో ఆ సన్నివేశాల్లో మహిళా పాత్రధారులు విచ్చలవిడిగా కనిపిస్తున్నారు. మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని ఒక హెచ్చరికను స్క్రీన్ పై కనీ కనిపించకుండా అక్షరాల రూపంలో వేసి, ఈ విచ్చలవిడి వ్యవహారాలను చూపించే ప్రక్రియకు హద్దు అదుపు లేకుండా పోయింది ఈ పరిణామాలు మారాలని సగటు భారతీయుడు కోరుకుంటున్నాడు.
-నేలపూడి స్టాలిన్ బాబు
సామాజిక విశ్లేషకులు
8374669988