ఈ ‘బెయిల్ ర్యాలీ’లు ఎందుకు?

శాసన మండలి సభ్యురాలుగా ఉన్న కవిత ఇటీవల ఢిల్లీ మద్యం కేసులో ఎన్ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ), సీబీఐ చేత విచారణను

Update: 2024-09-04 00:45 GMT

శాసన మండలి సభ్యురాలుగా ఉన్న కవిత ఇటీవల ఢిల్లీ మద్యం కేసులో ఎన్ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ), సీబీఐ చేత విచారణను ఎదుర్కొంటున్నారు. సాక్ష్యులను ప్రభావితం చేస్తుందన్న కారణంతో 15 మార్చి 2024ను ఆమెను అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలించారు అధికారులు. దీంతో ఆమె ఐదున్నర నెలలపాటు ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులలో బెయిల్ మంజూరు కొరకు ప్రయత్నాలు జరుపగా, చివరకు ఈ నెల 28న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

అయితే జైలు నుంచి విడుదల అయిన కవిత 29న హైదరాబాద్ చేరుకుంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి బంజారాహిల్స్‌లోని ఆమె నివాసం వద్దకు చేరుకునే క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చడం, బంజారా నృత్యాలు, పూలవర్షంతో స్వాగతం పలికారు. పలువురు శాసనసభ్యులు, నగర కార్పొరేటర్లు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రోడ్డు పొడుగుతా భారీ కటౌట్ల ఏర్పాట్లతో స్వాగతం పలికారు. నివాసం వద్ద భారీగా నినాదాలు మిన్నంటాయి. వందల కార్లు రోడ్లుపై పరుగులు పెట్టాయి. దీంతో ప్రజా జీవన స్రవంతికి ఇబ్బందులు కలిగాయి. ట్రాఫిక్ స్తంభించింది. ఇక్కడే సామాన్య మానవుడికి రకరకాల ప్రశ్నలు తలెత్తాయి.

'బెయిల్' యాత్రల మతలబు

బెయిల్‌పై బయటకు వచ్చిన టీఆర్ఎస్ నేత కవిత ఎందుకు ర్యాలీ తీసినట్లు? ఆమె నిర్దోషిగా ఇంకా తేలలేదు కదా..? కేవలం ‘బెయిలు’పైనే విడుదలయ్యారు కదా... విచారణ కొనసాగుతూనే ఉంది కదా? ఇలాంటి ప్రశ్నలన్నీ సాధారణ పౌరుడి బుర్రను తొలుస్తూ ఉంటాయి. గజమాలలు వేస్తున్నప్పుడు, తెగిన పూల రెక్కల వర్షం కురిపిస్తున్నప్పుడు, కరుణశ్రీ ‘పుష్ప విలాపం’ గుర్తుకు వస్తుంది. తొడగొట్టడం, పిడికిలి బిగించడం, మీసాలు మెలివేయడం వంటి విన్యాసాలతో నినాదలివ్వడం సమాజానికి ఎలాంటి దిశా నిర్దేశం చేస్తున్నట్లుగా భావించాలి. వందల వాహనాలు తోవ పొంట సాగుతుంటే పెట్రోల్, డీజిల్ వృధా అవడం బాధిస్తుంది. ధరలు ఆకాశాన్ని అంటుతున్న తీరు తెలిసి వస్తుంది. వేలాదిమంది ‘శ్రమశక్తి, సమయం’ వృధా అవుతున్న తీరు కలిచివేస్తుంది. ర్యాలీ మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుంది. విధి నిర్వహణలో అలసి, త్వరగా ఇంటికి చేరుకోవాలనే వారికి, అత్యవసర పనులపై వెళ్లే వారికి తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. అత్యవసర వైద్య సేవలకు బయలుదేరే అంబులెన్సులకు తీవ్ర విఘాతం కలుగుతుంది.‘బెయిల్’ ఎవరికోసం అనే ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తుతుంది.

బెయిల్.. పక్షపాతానికి మారుపేరు

కేసులలో ఇరుక్కున్న వారికి అంత తొందరగా జైలు విముక్తి ఎవరికి సంతోషాన్ని కలిగిస్తుందన్నప్పుడు, రకరకాల సమాధానాలు మనస్సును తొలుస్తాయి. ఈ బెయిల్ తమ కుటుంబ సభ్యులకు అవసరం. పార్టీకి అవసరం. పార్టీ అధినేతకు అవసరం. బెయిల్ మంజూరు వల్ల కేసు దర్యాప్తుకు ఏ మేరకు ఆటంకం కలుగుతుందన్నది దర్యాప్తు సంస్థలు చూసుకుంటాయి. అయితే ఈ బెయిల్ కథా కమామీషును పరిశీలిస్తే రకరకాల అనుమానాలకు తావిస్తాయి. రాజకీయ నేతలు, పలుకుబడి వ్యక్తులకు, ప్రజా జీవనంలో ఉండి పోరాడుతున్న మేధావులకు తేడా స్పష్టంగా కనిపించడం బాధేస్తుంది. మనకు తెలిసిన విషయమే... అండా జైలులో ఉన్న ప్రొ.సాయిబాబా, 90 శాతం వికలాంగుడైన బెయిల్ కొరకు ఎన్నేళ్లు వేచి చూడాల్సి వచ్చిందో... అలాగే ప్రజా కవి, రచయిత వరవరరావు, అరుంధతీరాయ్ తదితరుల బెయిల్ కోసం కేసు ఎన్ని మలుపులు తిరిగిందో, ఎన్నేళ్లు తీసుకుందో మనకి తెలిసిన విషయం.

చట్టం తన పని తాను చేసుకుపోతుంది, చట్టం ఎవరికీ చుట్టం కాదు... ఇలాంటి పడికట్టు పదాలు వల్లె వేస్తున్నంత సులభంగా ‘బెయిల్ మంజూరు’లోని మతలబు అర్థం కాదు. చట్టాలు, సెక్షన్ల చుట్టూ పరిభ్రమించే బెయిల్ మంజూరు ఎలా ఉన్నప్పటికీ, ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా ఉండే రీతిలో విడుదల అయిన వ్యక్తి వ్యవహరించాలన్న నిబంధన కూడా ‘వ్యక్తిగత పూచికత్తు’లో చేర్చితే సమాజం ఆరోగ్యకరంగా ఉంటుంది.

కోడం పవన్ కుమార్

98489 92825

Tags:    

Similar News